టీడీపీ గూండాల దాడిపై వైయస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి: టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులతో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఈ దాడి ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, బాధితులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం జంగిల్ రాజ్ నడుస్తోందని వైయస్ జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆటవిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని వైయస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఎవరూ ప్రశ్నించకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడమే పాలకుల లక్ష్యంగా మారిందని విమర్శించారు. అధికార మదంతో ప్రత్యర్థులపై దౌర్జన్యాలకు దిగడం రాష్ట్రానికి ప్రమాదకర సంకేతమని హెచ్చరించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదని, బాధితుల వెంటే పార్టీ అండగా నిలుస్తుందని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.