ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించాలి
శ్రీకాకుళం: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ. 3200 కోట్లు పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించకపోతే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి ఉద్యమిస్తామని వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం 45 రోజుల్లో చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా ఆస్పత్రులను ఇబ్బంది పెట్టడమే కాకుండా, బిల్లుల చెల్లింపులకు తెచ్చిన అప్పులు ఆరోగ్యశ్రీ ట్రస్టు కట్టకపోతే వడ్డీతో సహా ఆస్పత్రుల నుంచే వసూలు చేసేలా నిబంధనల తీసుకురావడం ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఆస్పత్రులను స్వచ్ఛందంగా తప్పుకునేలా చేసే కుట్రగా సీదిరి అభివర్ణించారు. ఆరోగ్యశ్రీ చరిత్రలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ సహా అన్ని సేవలు నిలిచిపోవడం 20 ఏళ్లలో రెండుసార్లే జరిగితే, అది ఈ రెండేళ్ల చంద్రబాబు పాలనలోనే కావడం ప్రజారోగ్యంపై చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబు తెచ్చిన రూ 2.56 లక్షల కోట్ల అప్పుల్లో ఆరోగ్యశ్రీకి రూ. 3200 కోట్లు చెల్లించలేరా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పేరు వింటే వైయస్ జగన్, దివంగత వైయస్సార్ లే గుర్తొస్తున్నారనే బాధతోనే చంద్రబాబు నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాడని మాజీ మంత్రి ఆరోపించారు. ట్రస్టు మోడల్‌లో నడిచే ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ మోడల్‌లోకి మార్చేసి ప్రైవేటుకి దారాదత్తం చేయడం చంద్రబాబు దోపిడీ విధానాలకు నిదర్శనమని తెలిపారు. కోటి సంతకాల సేకరణ చూసి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తామనడం సిగ్గుచేటని.. ప్రజాభిప్రాయం, ప్రజారోగ్యంపై తనకు చిత్తశుద్ధి లేదని చంద్రబాబు మళ్లీ మళ్లీ చెబుతున్నట్టే అనుకోవాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అభిప్రాయపడ్డారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
- చంద్రబాబు పాలనలోనే రెండు సార్లు ఆరోగ్యశ్రీకి బ్రేక్
రాష్ట్రంలో ఓ వెలుగువెలిగిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వీర్యం చేసేసింది. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రెండేళ్లలో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కూటమి పాలనలో రెండేళ్లలో రెండుసార్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇన్‌పేషెంట్, ఎమర్జెన్సీ సహా అన్ని సేవలను నిలిపివేయడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. దివంగత వైయస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ 20 ఏళ్ల చరిత్రలో రెండుసార్లు ఈ దుస్థితి ఏర్పడింది. అది కూడా చంద్రబాబు పాలనలోనే కావడం ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత ఉదాసీనంగా ఉందో చెప్పడానికి వేరే రుజువులు అక్కర్లేదు. పెండింగ్ బిల్లుల కోసం ఆస్పత్రి యాజమాన్యాలు ధర్నా చౌక్ లో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆరోగ్యశ్రీ పేరు వింటే ప్రజలకు వైయస్ జగన్, వైయస్సార్ పేర్లే గుర్తోస్తున్నాయనే భయంతోనే చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్నే లేకుండా చేసే కుట్రలు చేస్తున్నాడు.
- నిబంధనల ప్రకారం 45 రోజుల్లో చెల్లించాలి
ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 3200 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని ఆస్పత్రి యాజమాన్యాలు ధర్నాకు దిగితే వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద వారం రోజుల్లో వెయ్యి కోట్లు చెల్లిస్తామని నమ్మించి ధర్నాను విరమింపజేశారు. ఆయా ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలను కొనసాగించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండు నెలలవుతున్నా ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి ఏపీ పవర్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అప్పులు తెచ్చి వాటికి ఆరోగ్యశ్రీ ట్రస్టును గ్యారెంటీర్‌గా చేర్చారు. ఒకవేళ ఆరోగ్యశ్రీ ట్రస్టు అప్పులు తీర్చకపోతే ఆరోగ్యశ్రీ ఆస్పత్రి యాజమాన్యాల నుంచి వసూలు చేసేలా నిబంధనలు పెట్టారు. పేదలకు తక్కువ ధరలకు వైద్య సేవలందించినందుకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా? అంతేకాకుండా తెచ్చిన అప్పులకు గాను 8 శాతం వడ్డీలు కూడా ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లుల నుంచే మినహాస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు నిబంధనల ప్రకారం సర్వీస్ ఇచ్చిన 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. కానీ ఆ బిల్లులు చెల్లించకపోగా తిరిగి వారినే దోచుకునే కార్యక్రమానికి ప్రభుత్వం కుట్రలు చేయడం సిగ్గుచేటు. ఎలాగైనా ఆరోగ్యశ్రీని లేకుండా చేసి దాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే వ్యూహంలో భాగంగా ప్రైవేటు ఆస్పత్రులే స్వచ్ఛందంగా బయటకొచ్చేలా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ప్రభుత్వమే దోపిడీకి గురిచేయడమే. నేరాలు-ఘోరాల్లో ఇదే మెయిన్ వార్తగా ఉండాలి.
- ప్రభుత్వాన్ని నడపడం చంద్రబాబుకి చేతకావడం లేదు
చంద్రబాబుకి ప్రభుత్వం నడపడం చేతకాదని తేలిపోయింది. 23 నెలల్లోనే రూ.3.56 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చిన చంద్రబాబు, ప్రజారోగ్యం కోసం ఆస్పత్రులకు రూ.3200 కోట్లు చెల్లించకుండా ఇబ్బందులు గురిచేయడం దౌర్భాగ్యం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం 60 నెలల్లో చేసిన అప్పులు కేవలం రూ. 3.32 లక్షల కోట్లు. ఏదీ నడపలేక ప్రైవేట్ జపం చేస్తున్నాడు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, రోడ్లు, టూరిజం ప్రాజెక్టులు, ఆఖరుకి ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు వ్యక్తులకు రాసిచ్చే కుట్రలు చేస్తున్నాడు. మంత్రులను సింగపూర్ పర్యటనకు పంపుతున్నది కూడా ప్రైవేటీకరణ ఎలా చేయాలని నేర్చుకోవడానికేనా అని అనుమానం కలుగుతోంది. సంపద సృష్టించి గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ అప్పులు కూడా తీర్చేస్తానని చెప్పిన చంద్రబాబు మొదటి నెలకే చేతులెత్తేశాడు. ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్ అనుభవం చూపించి ఉద్యోగుల జీతాలు కూడా కోత విధిస్తామని భయపెడుతున్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఉద్యోగ సంఘాలు నిలదీస్తుంటే వారిని నోరెత్తకుండా ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నాడు. రోజూ ఎల్లో మీడియాలో వార్తలు రాసి, డిబేట్లు నడిపి ఉద్యోగులను భయాందోళనకు గురి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే రెవెన్యూ ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌లు నెల రోజులుగా మాట్లాడటం వెనుక వ్యూహం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే. ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు దారుణంగా వంచించాడు.
వైయస్ఆర్‌సీపీ హయాంలో 60 నెలల్లో చేసిన కేవలం రూ. 3.32 లక్షల కోట్లు అప్పులతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు మాత్రం 23 నెలల్లోనే రూ. 3.56 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులుండవు, కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ప్రత్యేక విమానాల్లో జల్సాలు మాత్రం ఆపడం లేదు. ఆచరణ సాధ్యం కాని అమరావతి పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు.
- ప్రజారోగ్యాన్ని ఆదాయ వనరుగా మార్చేశాడు
ప్రజారోగ్యాన్ని పెట్టుబడిదారులకు లాభదాయకమైన ఆదాయ వనరుగా మార్చేందుకు హెల్త్ ఇన్వెస్ట్ మెంట్ పాలసీ పేరుతో కొత్త విధానానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ పాలసీ ఎన్‌హెచ్‌పీ-2017 తీసుకొచ్చింది. దానికి ఈ విధంగా పేరు మార్చి
వైయస్ జగన్ గారు కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నెల రోజుల్లో ప్రైవేటుపరం చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలిస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోటి మంది రాష్ట్ర ప్రజలు సంతకాలు చేసి గవర్నర్‌కి ఇచ్చినా చంద్రబాబు మూర్ఖంగా ముందుకు పోతున్నాడు. ప్రజల ఆలోచనలకు, వారి నిర్ణయాలకు చంద్రబాబు విలువ లేకుండా చేస్తున్నాడు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా మెడికల్ బిల్లులు ప్రజలపై భారం కాకూడదని సూచించింది. మొత్తం బడ్జెట్ లో హెల్త్ బడ్జెట్ 8 శాతం ఉండాలని చెప్పింది. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా అది 4.2 శాతానికి మించలేదు. వైస్ జగన్ గారు దాన్ని 6.5 నుంచి 7 శాతానికి పెంచి ప్రజారోగ్యాన్ని కాపాడారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నాడు. అన్నీ ప్రైవేటీకరణ చేసేట్టయితే ప్రభుత్వంలో మంత్రులు, కమిషనర్లు, సెక్రటరీలు దేనికి?
- వైయస్ జగన్‌కి, చంద్రబాబుకి ఉన్న తేడా...
దివంగత వైయస్సార్ గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీని వర్తింపజేసి వచ్చిన బిల్లులను ఆస్పత్రుల అభివృద్ధికి వినియోగించేలా చేసి ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేశారు. వైయస్ జగన్ గారు సీఎంగా ఉండగా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే 50 ఎకరాల భూమి ప్రభుత్వమే కేటాయించేలా అందుకుగాను 50 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీకి కేటాయించాలని నిబంధన పెట్టారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకర్షించాలంటే ఇలా ప్రజలకు మేలు జరగాలి. తండ్రీకొడుకుల ఆలోచన ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసే దిశగా సాగితే, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటుకి అప్పనంగా దారాదత్తం చేస్తున్నాడు. హెల్త్ ఇన్వెస్ట్ మెంట్ పాలసీ అనే పేరే పేద ప్రజలను దోచుకుంటామని చెబుతున్నట్టుగా ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి ఉద్యమిస్తాం.