రైతుల ఉసురు తీస్తున్న కూటమి ప్రభుత్వం 

17 Mar, 2026 18:08 IST

తాడేపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులపాలైన రైతులు, రైతు కూలీలు ఒక్క ఏడాదిలోనే 2,865 మంది ఆత్మహత్య చేసుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే  శైలజానాథ్‌ ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోజుకి సగటున 8 మంది రైతులు, రైతు కూలీలు బలవన్మరణానికి పాల్పడుతున్నా బాధిత కుటుంబాల్లో ఏ ఒక్కరికీ పైసా పరిహారం ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ వ్యవసాయం దండగ అనే ఆలోచనతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని అమలు చేయకుండా రైతులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. 20 నెలల్లోనే రూ. 3.30 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు అందులో ఒక శాతం ధరల స్థిరీకరణ నిధికి ఖర్చు పెట్టినా రైతుల బతుకులు బాగుండేవని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచన మార్చుకుని రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే  శైలజానాథ్‌ హెచ్చరించారు. 
ప్రెస్‌మీట్‌లో సాకే శైలజానాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఎన్నికల హామీల అమలు లేదు:
    రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశాడు. రైతులు, రైతు కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వ్యవసాయం దండగ అనే ఆలోచనతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నాడు. ఈ ఒక్క ఏడాదిలోనే 2,865 మంది రైతులు, రైతులు బలవన్మరణం చెందినట్టు ప్రభుత్వ లెక్కలే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం చేస్తామన్నారు. అదీ నిలబెట్టుకోలేదు.
    వ్యవసాయానికి పగటిపూట 9 గం. నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. రాయితీతో సోలార్‌ పంపుసెట్లు, సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు ఇస్తామన్నారు. ధరల స్థిరీకరణ నిధికి నిధులు లేవు. సంక్షేమ పథకాలను కౌలు రైతులకు వర్తింప చేస్తామని మాట తప్పారు. రైతు కూలీలకు ప్రత్యేక కార్పోరేషన్‌ స్థాపించి వారికి రాయితీలు, సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. అదీ లేదు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేపట్టి మార్కెటింగ్‌ చేస్తామన్నారు. అదీ ఒట్టి మాటే అయింది. ఇవన్నీ అమలు చేసి ఉంటే రైతులకు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చేది కాదు. 

అప్పుల్లో ఒక్క శాతం కేటాయించినా..:
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కూడా దక్కని దుస్థితి. మొక్కజొన్న గిట్టుబాటు ధర క్వింటాకు రూ.2400 ఉంటే, రైతుకు కనీసం రూ.1500లు కూడా దక్కడం లేదు. అరటిని కేజీ రూ.5కు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. శనగకు రూ.5,600 ఉంటే, వ్యాపారులు రూ.5 వేలకు అడుగుతున్నారు. ఇప్పటికే రూ.3.30 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు అందులో కనీసం ఒక్క శాతమైనా రూ.3 వేల కోట్లు ధరల స్థిరీకరణకు ఖర్చు పెట్టి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదు. కానీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.300 కోట్లు మాత్రమే.
    ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎత్తేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాపింగ్‌ జరగడం లేదు. ఉచిత పంటల బీమా ఊసే లేదు. ప్రభుత్వం ప్రీమియమ్‌ చెల్లించకపోవడంతో రూ.3,500 కోట్ల మేర రైతులు నష్టపోయారు. సున్నా వడ్డీ రుణాలు లేవు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారులు దోపిడీ చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టేశారు. కౌలు రైతులను అసలు పట్టించుకోవడం మానేశారు. కనీసం రైతులకు బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి. 

ఆ రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది జగన్‌గారు:
    వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వం రైతన్నకు అండగా నిలిచి ఆదుకున్నారు. వైయస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో 2019–24 మధ్య రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాల రూపంలో రూ.1,84,567 కోట్లు ఖర్చు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ రైతు పక్షపాతి అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదు. ధరల స్థిరీకరణ రూపంలో రూ.7,200 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే గతంలో రూ.5 లక్షల పరిహారం అందేది. వైయస్‌ జగన్‌ గారు సీఎం అయ్యాక రూ.7 లక్షలకు పెంచి బాధిత రైతు కుటుంబాలకు అందజేసి ఆదుకున్నారు.
    2014–19 మధ్య చంద్రబాబు కేవలం 450 రైతు కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇస్తే, ఆయన ఇవ్వకుండా వదిలేసిన 474 మంది రైతులకు రూ.23.70 కోట్లు జగన్‌గారు సీఎం కాగానే అందజేశారు. 

తప్పు చేసినోళ్లని వదిలేసి, ప్రశ్నించిన వారిపైన కేసులా!:
    ఇసుక అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మీద, ఫ్లెక్సీలు చించివేస్తుంటే అడ్డుకున్నందుకు వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త మోహనకృష్ణ మీద, బీఆర్‌ నాయుడితో రాజీనామా చేయించాలని నిరసన వ్యక్తం చేసినందుకు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. డ్రగ్స్‌ పార్టీలో అడ్డంగా దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ కి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి వదిలేశారు. తప్పులు చేసిన వారిని వదిలేసి, ఆ తప్పులను ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న దుస్థితి రాష్ట్రంలో ఉంది. చివరకు ధైర్యంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులను కూడా వేధిస్తున్నారు.
    సీఎం చంద్రబాబు ఇకనైనా తన ఆలోచన సరళి మార్చుకోవాలి. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు, వ్యవసాయ రంగాన్ని బాధ్యతగా భావించాలి. అయినా అహంకారంతో వ్యవహరిస్తే భవిష్యత్తులో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని మాజీ మంత్రి సాకె శైలజానాథ్‌ హెచ్చరించారు.