రాయలసీమకు నీటి కష్టం 

25 Feb, 2026 17:36 IST

తాడేప‌ల్లి: పొరుగు రాష్ట్రాల కార‌ణంగా రాయలసీమ ప్రాంతానికి నీటి క‌ష్టం వ‌చ్చింద‌ని, కర్ణాటక, తెలంగాణ ప్రాజెక్టులపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎందుకు నోరుమెద‌ప‌డం లేద‌ని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రజల ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌ డిమాండ్ చేశారు. 

ప్రెస్‌మీట్‌లో సాకె శైల‌జ‌నాథ్ ఇంకా ఏమ‌న్నారంటే..:

అసెంబ్లీలో చ‌ర్చించండి బాబూ
ప్ర‌స్తుతం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు ఒక మాట చెప్పదలిచాను. చంద్రబాబు గారూ… రాయలసీమకు కష్టం వచ్చింది. ముఖ్యంగా అనంతపురం, క‌ర్నూలు జిల్లాల‌కు నీటి సమస్య ఎదురైంది.  మేం లేవనెత్తిన అంశాలపై అసెంబ్లీ స‌మావేశాల్లో చ‌ర్చించండి..నీటి ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరుతున్నాం. 

ఆల్మట్టి ప్రాజెక్టుపై ఎందుకు స్పందించడం లేదు
 1996 వరకు ఆల్మ‌ట్టి కేవలం ఒక ఆనకట్ట మాత్రమే. అప్పటికి 506 అడుగులుగా ఉన్నఈ ప్రాజెక్టు ఎత్తు తర్వాత 519.6 మీటర్లకు పెరిగింది. అప్పట్లో నేను దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నానని, దేవెగౌడను ప్రధానిగా చేశానని చంద్ర‌బాబు చెప్పుకునే రోజుల్లోనే ఆల్మట్టి డ్యామ్‌ 120 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పెద్ద జలాశయంగా మారింది. తాజాగా ఈ డ్యామ్ ఎత్తును 524.24 మీటర్లకు పెంచి అదనంగా మరో 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళికలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అనేక అంశాలపై గంటల తరబడి మాట్లాడే చంద్ర‌బాబు ఆల్మట్టి ప్రాజెక్టుపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. అనంతపురం, క‌ర్నూలు జిల్లా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. కృష్ణా పరివాహక ప్రాంత భవిష్యత్‌పై భయం నెలకొంది. 

నీరు రాక‌పోతే సీమ ఎడారే
ఆల్మ‌ట్టి డ్యామ్ వద్ద 120 టీఎంసీల నీరు నిల్వ చేస్తేనే జూన్, జులైలో రావాల్సిన వరద నీరు ఆలస్యమై ఆగస్టులో వస్తోంది. రాబోయే రోజుల్లో అదనంగా మరో 100 టీఎంసీలు నిల్వ చేస్తే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వరద నీరు దిగువ ప్రాంతాలకు వచ్చే అవ‌కాశం ఉండ‌దు. ఎగువ నుంచి నీరు రాకపోతే  రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారుతుంది. అప్పర్ తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టు నుంచి 5.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు రెండు ప్రాజెక్టుల ద్వారా కలిపి 20.90 టీఎంసీల నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందకపోవచ్చనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు 2018లోనే సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా(సీడ‌బ్ల్యూసీ) అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ప్రభావంతో రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. తుంగ‌భ‌ద్ర డ్యామ్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, ఎల్‌ఎల్‌సీ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి.  వేదావ‌తి న‌దిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించకూడదనే నిబంధ‌న‌లు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి నీటి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యామ్నాయ మార్గాల‌ను రూపొందించాలి. 

చంద్ర‌బాబు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావ‌డం లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులం మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశామని చెప్పారు. ఈ పథకాన్ని ఆపేయడం వల్ల రాయలసీమ ప్రాంతంలోని అనేక ప్రాజెక్టులు, దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా లేకుండా పోయే ప్రమాదం ఉంది.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తుంటే, చివరకు శ్రీ‌శైలం డ్యామ్‌కు నీరు వస్తుందా లేదా అన్న ఆందోళన నెలకొంది.  చంద్ర‌బాబు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదు. పోతి‌రెడ్డిపాడు ద్వారా నీరు తీసుకోవాలంటే 841 అడుగుల నీటి మట్టం అవసరం. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నాం. బనకచర్ల ఎత్తిపోతల సహా ప్రత్యామ్నాయ నీటి సరఫరా మార్గాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. చంద్ర‌బాబు రాయలసీమ బిడ్డగా తన బాధ్యతను నిర్వ‌ర్తించాలి. 

ఆర్డీటీని నిల‌బెట్టండి
స్పెయిన్‌కు చెందిన ఫాదర్ ఫెర్రర్ విదేశాల నుంచి వచ్చి రాయలసీమలో దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు  రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌(ఆర్డీటీ) ద్వారా నిర్వ‌హిస్తున్నారు. అనంతపురం, వైఎస్సార్ క‌డ‌ప జిల్లా, కర్నూలు జిల్లాల్లో విద్య, వైద్యం, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి అనేక సామాజిక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరిగాయి. పేద పిల్లల విద్యాభివృద్ధికి ఆర్డీటీ ఎంతో కృషి చేస్తోంది. అనంత‌పురంలోని ఆర్డీటీ స్టేడియం నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు తయారయ్యారు. దళితులు, ఆదివాసులు, బలహీన వర్గాల సంక్షేమానికి ఈ సంస్థ సేవలు ఎంతో అవసరం. గత మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధులపై విధించిన ఆంక్షల కారణంగా ఆర్డీటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి, సంస్థ ఆస్తులు విక్రయానికి పెట్టారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ఢిల్లీలో తన ప్రభావాన్ని ఉపయోగించి విదేశీ నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడిని మాజీ మంత్రి సాకె శైల‌జ‌నాథ్ కోరారు.  ఆర్డీటీకి వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని ఆయ‌న‌ స్పష్టం చేశారు.