హామీలిచ్చి తప్పడమే చంద్రబాబుకున్న క్రెడిబులిటీ

19 Jan, 2026 21:00 IST

కాకినాడ: క్రెడిబులిటీ గురించి మాట్లాడే అర్హత సీఎం చంద్రబాబుకి లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలిచ్చి తప్పడమే బాబుకున్న క్రెడిబులిటీ అని... ఎవరి క్రెడిబులిటీ ఎంతో ప్రజలందరికీ తెలుసని తేల్చి చెప్పారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  వేదిక ఏదైనా వైయస్.జగన్ ను దూషించడమే బాబు లక్ష్యమని.. ఆత్మస్తుతి పరనింద బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. చివరకు ఆయన వర్ధంతి సభలోనూ   తన స్వోత్కర్షే చేసుకోవడంపై  తీవ్రంగా ఆక్షేపించారు . కూటమి పాలనలో రాష్ట్రంలో యథేచ్ఛగా భూపందేరానికి పాల్పడుతూ... కప్పు టీ కన్నా కారుచౌకగా ఎకరా భూమిని కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, లిక్కర్ సహా అన్ని రకాలకు స్కామ్ లకు పాల్పడుతూ... ప్రజల కళ్లలో ఇసుక కొట్టిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు...  ప్రశ్నిస్తే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో ఎదురుదాడి చేయడాన్ని ఖండించారు. రాష్ట్రంలో ఆర్వో ప్లాంట్లు తరహాలో నకిలీ లిక్కర్  ప్లాంట్లు నడుస్తున్నాయని... చివరకు మద్యం డోర్ డెలివరీ చేసే స్దితికి దిగజార్చిన ఘతన  బాబుదేనని మండిపడ్డారు. కూటమి పాలనలో ఏపీ డ్రగ్స్ డెన్ గా మారిందని కన్నబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

● హామీలిచ్చి తప్పడమే బాబు క్రెడిబులిటీ...

రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎంలను చూసుకుంటే... ఎవరికి క్రెడిబులిటీ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. విశ్వసనీయతకు మారుపేరులాగా ఎవరు పనిచేశారు? ఇచ్చిన హామీలను ఇచ్చినట్లు ఎవరు నెరవేర్చారన్నది ప్రజలందరికీ తెలుసు. ఎన్ టీ రామారావు గారిని పదవి నుంచి దింపేసిననాటి నుంచి మొదలుకుని... ఇవాల్టి వరకు జరిగిన రాజకీయ పరిణామాలన్నింటి గురించి మాట్లాడుకోవాలి. ఒక నాయకుడు పార్టీని పెట్టి.. దాన్ని చారిత్రాత్మకంగా గెలిపించి ప్రజలపట్ల తనకున్న ఆర్తిని చూపస్తూ.. ఎన్నో కార్యక్రమాలు, పధకాలు పెట్టిన ఎన్టీ రామారావు గారిని  రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. స్వయంగా ఎన్టీఆర్ గారే బాబు నన్ను వెన్నుపోటు పొడిచాడని బాధపడిన రోజుల నుంచి...  చంద్రబాబు సీఎం కాగా, ఆ తర్వాత మరలా దివంగత వైయస్సార్, చంద్రబాబు, వైయస్.జగన్, మరోసారి చంద్రబాబు సీఎం అయ్యేంత వరకు ఈ మొత్తం సీఎంల పరిపాలనా కాలాన్ని తీసుకుంటే ఎవరికి క్రెడిబులిటీ ఉందన్నది చరిత్రే చెబుతుంది.
హామీలు ఇచ్చి నెరవేర్చడాన్ని క్రెడిబులిటీ అంటారా? హామీలిచ్చి ఎగ్గొట్టడాన్ని క్రెడిబులిటీ అంటారా? చెప్పింది చెప్పినట్లు కరోనా వంటి కష్టకాలంలో కూడా హామీలు అమలు చేసిన నాయకుడిని క్రెడిబులిటీ ఉన్న నాయకుడు అంటారా? ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా మోసం చేసిన వాళ్లను క్రెడిబులిటీ ఉన్న నాయకులని ఎవరైనా అంగీకరిస్తారా? 2014 ముందు ఎన్నికలు తీసుకున్నా.. రైతు రుణమాఫీ మొదలుకుని ఆ రోజు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి?  తాజాగా 2024 ఎన్నికల ముందు సూపర్ సిక్స్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి రకరకాల హామీలిచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని తప్పుడు ప్రచారం చేసుకోవడాన్ని క్రెడిబులిటీ అంటారా? 

వైయస్.జగన్ గురించి పచ్చి నిందలను ప్రచారం చేస్తూ.. అవాచలు, చవాకులు చెబుతూ ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని, ప్రజలు నమ్మే పరిస్థితులను క్రియేట్ చేశారు. మూడు పార్టీలు కలిసి కూటమిగా జతకట్టి  ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఒక నాయకుడిని ఓడించడం కోసం మూడు పార్టీలు కలిసి కూటమి కట్టడం కూడా ఒక చరిత్రే. ప్రజాభిమానం ఉన్న నాయకుడ్ని ఓడించడం కోసం కూటమి కట్టి దాన్నే మీ క్రెడిబులిటీ అంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సభ అంటే ఆయన గురించి చెప్తారని భావించాం. రూ.1750 కోట్లతో ఆయన విగ్రహం పెడతామంటున్నారు. అది ప్రభుత్వ ధనంతోనా, పార్టీ ధనంతోనా, లేక ఆయన కుటుంబమే డబ్బులు పెడుతుందా అన్నది క్లారిటీ ఇస్తారనుకున్నాం. విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం కన్నా ఎక్కువ ఎత్తులో పెడతామని చెబుతున్న విగ్రహ ఏర్పాటుకు నిధులు గురించి మాట్లాడుతారని భావించాం. కానీ అవేవీ ప్రస్తావించకుండా అక్కడ కూడా వైయస్.జగన్ ని నిందించడమే పనిగా పెట్టుకున్నారు. 

● ఆత్మస్తుతి - పర నిందకే పరిమితమైన చంద్రబాబు...

వైయస్.జగన్ ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లు ఖర్చుపెట్టి 17 మెడికల్ కాలేజీలు పెడితే అవేవీ అవసరం లేదని .. వాటన్నింటినీ ప్రైవేటు వారికి కట్టబెడుతూ అలా చేయడాన్నే క్రెడిబులిటీ  అని మీరు అనుకుంటూ... రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మారుస్తూ ప్రజలను, పాలనను గాలికొదిలేశారు. కానీ వందల వేల కోట్లతో విగ్రహాలు ఏర్పాటుకు మాత్రం సిద్ధమవుతున్నారు. మీరు అత్యంతగా ప్రేమించే ఎన్టీఆర్ గారి పేరు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్నదైనా ఆయన వర్థంతి వేదిక మీద నుంచి చెబుతారని భావించాం. ఇవేవీ చెప్పకుండా ఆత్మస్ధుతి, పరనిందకు పరిమితమవుతూ...  కేవలం మీ సోత్కర్ష చేసుకుంటూ, వైయస్.జగన్ ని దూషించడం తప్ప మరోకటి లేదు. 

● కప్పు టీ కన్నా కారుచౌకగా ఎకరా భూమి... 

ల్యాండు, శాండ్, వైన్, డ్రగ్స్, గంజాయి అంటూ చాలా మాట్లాడారు. భూములు గురించిమాట్లాడితే.. ఈ రాష్ట్రంలో  పప్పు బెల్లాల కన్నా అత్యంత ఖరీదైన భూముల్ని తమ వారికి అతి చౌకగా కట్టబెడుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా? కాదా? కప్పు టీ కన్నా కారుచౌకగా ఎకరాలకు, ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తున్న మాట వాస్తవమా? అబద్ధమా? కార్పొరేట్ కంపెనీలకు వందలాది ఎకరాల భూమిని, అర్హత, సామర్ధ్యం లేకున్నా రాత్రికి రాత్రే వాటికి కట్టబెడుతున్న వైనాన్ని ఏమంటారు? కానీ అన్ని మాఫియాల గురించి మరలా మీరే మాట్లాడుతారు. లులూ అనే ప్రైవేటు సంస్థ పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మాణం చేసి, నిర్వహిస్తోంది. దానిమీద మీకు ఎందుకు అంత ప్రేమ? విశాఖపట్నం, విజయవాడలో వేల కోట్లు విలువైన భూములను ఎందుకు లులూకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. లులూ మాల్ కోసం ఈ రెండు నగరాల్లో దాదాపు రూ.3వేల కోట్ల విలువైన భూమని కట్టబెడుతున్న మాట నిజంకాదా? అది కూడా కేవలం నామమాత్రపు లీజుకు కట్టబెడుతున్న మాట వాస్తవం కాదా? విశాఖపట్నంలో హార్బర్ పార్కు దగ్గర బహిరంగ మార్కెట్ లో ఎకరా రూ.150 కోట్ల  ఖరీదుతో దాదాపు రూ.2వేల కోట్ల విలువ చేసే భూమిని మీరు 99 ఏళ్ల లీజుకు రాసివ్వడాన్ని మాఫియా పనులు కాక మరేమిటంటారు చంద్రబాబూ? పైగా లులూ సంస్థ మాల్ కట్టేవరకు లీజు మినహాయించారు. వారికి కేటాయించిన స్థలంలో దాదాపు 13.50 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేస్తే.. అందులో 3.30 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అమ్మేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అంతే కాకుండా లులూ సంస్థ అడిగిన ప్రతి అంశంలోనూ వారికి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటే జీవోలిచ్చారు.  మరోవైపు విజయవాడ నగరం నడిబొడ్డు ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని కూడా 99 ఏళ్లకు మాల్ నిర్మాణం కోసం దాదాపు రూ.600 కోట్ల విలువైన భూమిని కట్టబెడుతున్నారు.  ఆ స్దలంలో లులూ సంస్థ పెట్టే పెట్టుబడి కేవలం రూ.150 కోట్లు మాత్రమే. దీన్ని స్కామ్ కాక మరేమిటంటారు? ఎందుకు మీకు లులూ మీద అంత ప్రేమ? సూటిగా సమాధానం చెప్పండి.

● పప్పు బెల్లాల్లా అయిన వారికి భూపందేరం...

ఉర్సా అనే ఓ కంపెనీని తీసుకొచ్చి విశాఖలో రూ.3 వేల కోట్ల ఖరీదు చేసే 66 ఎకరాల భూమిని కేవలం ఎకరా 99 పైసలకే కేటాయించడాన్ని ఏమనాలి. కేవలం రూ.10 లక్షల పెట్టబడితే రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీని తీసుకొచ్చి రాత్రికి రాత్రే  60 ఎకరాలు భూమని ఏ విధంగా కట్టబెడతారు? అదే విధంగా టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ కి 21.16 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకే లీజుకు ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఈ విధంగా మీరు భూముల్ని పప్పుబెల్లాల్లా పంచుతున్నారు అని ప్రశ్నిస్తే... చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ మాట్లాడుతూ మొత్తం భూమిని 99 పైసలకే ఇచ్చేస్తాం మీరెవరు అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. మీరేమైనా ఈ రాష్ట్రానికి అధిపతులు అనుకుంటున్నారా? రాష్ట్రాన్ని ప్రజలు మీకు రాష్ట్రాన్ని రాసిచ్చారనుకుంటున్నారా? మీరు కేవలం రాష్ట్రానికి కస్టోడియన్ లు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకొండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు... ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  కూడా ఐఏంజీ భారత్ సంస్థకు బిల్లీ రావు అనే వ్యక్తికి గచ్చిబౌలిలో ఎకరా రూ.50వేల చొప్పున వందలాది ఎకరాలు అప్పనంగా కట్టబెడితే అది స్కామ్ గా మారి కోర్టుల్లో నడుస్తున్న మాట వాస్తవం కాదా? భూమిల్ని పంచేది, పంచుకుతినే కార్యక్రమాన్ని ప్రోత్సహించేది కూడా మీరే. మీ చుట్టపక్కల ఉన్న వాళ్లకు అనుకూలంగా విధాననిర్ణయాలు తీసుకునేది కూడా మీరే. మీరా  వైయస్.జగన్ హయాంలో భూముల్లో మాఫియాలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు.  చివరకు విశాఖపట్నం  అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి వైయస్.జగన్ సాయం చేసిన జిఎమ్మార్ సంస్థతో కూడా మీకు ఇంత భూమి అవసరం లేదని.. తిరిగి 500 ఎకరాలు వెనక్కి తీసుకున్న ఘనత వైయస్.జగన్ కే దక్కుతుంది.
 మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా 500 ఎకరాలు వాళ్లకే కట్టబెట్టి ప్రపంచానికి నీతులు చెబుతారు. నాయుడు పేట నుంచి మడకశిర వరకు భూపందేరం తప్ప మీరు చేసిందేమీ లేదు. అమరావతిలో కూడా మీ భూ పందేరం జరుగుతుంది. ఈ వాస్తవాలు అందరికీ తెలుసు. 

● ప్రజల కళ్లలో ఇసుక కొట్టిన ఘనత చంద్రబాబుదే...

మేం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని ప్రచారం చేసిన చంద్రబాబు పాలనలో లారీ ఇసుక గోదావరి తీరప్రాంతా గ్రామాల్లో కూడా రూ.18 నుంచి రూ.30వేలకు అమ్ముతున్నారు. ఇసుక రీచ్ లన్నీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చేతుల్లోనే ఉన్నాయి. స్టాక్ యార్డులు నిర్వహణ కూడా మీ పార్టీ వాళ్లే నిర్వహిస్తూ.. అక్రమ వ్యాపారం చేస్తుంటే మీరు మరలా నీతులు చెబుతున్నారు. 2014-19 లో కూడా ఇదే విధంగా ఇసుకను మీ వాళ్లకే అడ్డగోలుగా కట్టబెట్టారు. మీ హయాంలోనే ఏర్పేడు వద్ద మీ అక్రమ ఇసుక దందా వల్ల లారీలతో తొక్కిస్తే 15 మంది మృత్యువాత పడిన ఘటన ఇంకా మర్చిపోలేదు. కోనసీమలో ఇసుక దందా అడ్డుకున్న వందలాది మంది యువకుల మీద అక్రమ కేసులు పెట్టించిన ఘనతున్న మీరు ఇసుక మాఫియా గురించి మాట్లాడ్డం విడ్డూరం.

● ఫేక్ మీడియా ఫ్యాక్టరీలతో ఎదురుదాడి...

కేవలం మీకున్న మీడియా బలంతో నెట్టికొస్తున్నారు. ఆ క్రమంలోనే  ఓ మీడియా సంస్థకు విశాఖలో హైవే పక్కనే 75 సెంట్లు ఉచితంగా ఇచ్చారు. మరో మీడియా అధిపతికి ఇప్పటికే టీటీడీ చైర్మన్ ఇచ్చారు. కేవలం మీడియా మీద ఆధారపడి అబద్దాలను వండి వార్చి ప్రచారం చేస్తూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఇవి కాకుండా  సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అడ్డగోలుగా ఎదురుదాడి చేస్తున్నారు.

● ఆర్వో ప్లాంట్లలా మీ హయాంలో నకిలీ లిక్కర్ తయారీ ప్లాంట్లు...

మీరు లిక్కర్ గురించి మాట్లాడినప్పుడల్లా... భగవంతుడు  మీకు సిగ్గూ శరం ఇవ్వలేదు అనిపిస్తుంది. రాష్ర్టంలో మద్య నిషేధం విధించిన దివంగత సీఎం ఎన్టీఆర్ ను గద్దె దింపి  ఆయన్ను పదవీచ్యుతుడ్ని చేసిన కొద్ది రోజులకే మద్య నిషేధాన్ని ఎత్తివేసి.. ఏరులై పారించిన ఆనాటి పరిపాలనా దక్షుడు మీరు కాదా చంద్రబాబూ? ఆ చరిత్ర మీది కాదా? 2014-19 మద్య మీ స్వహస్తాలతో మీరే ఎన్ని డిస్టలరీలకు అనుమతిలిచ్చారో గుర్తుందా ? బెల్టుషాపులు సృష్టికర్తా మీరే. తాజాగా పండగ ముందురోజే ప్రతి బాటిల్ మీద రూ.10 అధికారికంగా పెంచారు. అది కాకుండా రిటైలర్లకు మార్జిన్ పెంచారు. దాంతో పాటు అదనపు ధరలకు రిటైలర్లు అమ్మకాలు చేపట్టారు. అంటే బాటిల్ కు రూ.30 తక్కువ కాకుండా అదనంగా అమ్మకాలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రంలో ఆర్వీ ప్లాంట్ల తరహాలో అనధికారికంగా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు పెట్టింది మీ పార్టీ నేతలు కాదా? నకిలీ మద్యం, నకిలీ బాటిల్లు సీళ్లు, హేలో గ్రామ్స్ తో సహా ప్రభుత్వానికి సమాంతరంగా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ని నిర్వహించిన ఘనత కూడా మీ పార్టీదే. ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోతే ఎదుట వాళ్ల మీద బురద జల్లిన చరిత్ర కూడా మీదే బాబూ. పేకాట క్లబ్లులు గురించి చెప్పాల్సిన పనిలేదు. అధికారికంగానే అనుమతిలిచ్చినట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. అధికారపార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ కలిసిపోయి ఈ రకంగా చేస్తున్నారు. 

● మద్యం డోర్ డెలివరీ స్దాయికి తెచ్చిన ఘన ప్రభుత్వం...

ఇక మద్యం రంగంలో ఏ జరుగుతుందో చూస్తే...  ఈ నెల 1 నుంచి 17 వరకు 24.64 లక్షల మద్యం కేసులు, 11.36 లక్షల బీరు కేసులు అమ్మకం జరిగింది. అక్షరాలా రూ.1797.57 కోట్ల విలువైన మద్యాన్ని సంక్రాంతి సీజన్ లో అమ్మారు. గతేడాది కంటే  రూ.266.39 కోట్లు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. ఏపీలో లిక్కర్ సిండికేట్ కు మాత్రమే నిజమైన సంక్రాంతి ఇది. కల్తీ మద్యం తయారీ అనేది టీడీపీ నేతలు తమ హక్కుగా భావించి తయారు చేస్తూ అమ్ముకునే స్దాయికి వచ్చారు. ఇంత వ్యవస్థీకృతంగా లిక్కర్ అమ్మకాలు చేస్తూ.. చివరకు డోర్ డెలివరీ చేసే స్దాయికి తీసుకొచ్చారు. ఓ లెక్క ప్రకారం ఏపీలో 75వేల బెల్టుషాపులు నడుస్తున్నట్టు అంచనా. రూ.99 కే క్వార్టర్ బాటిల్ మద్యం ఇస్తానని చెప్పి.. కేవలం అదొక్కటే చీప్ లిక్కర్ అందుబాటులో ఉంచి మిగిలిన వాటి ధరలను భారీగా పెంచి అమ్ముతున్నారు. 

● డ్రగ్స్ డెన్ గా ఏపీ...

మందు ప్రియుల కడుపు కొడతారా అని ఆవేశపడిన వాళ్ల నోళ్లు ఇప్పడు పెగలడం లేదు. వైయస్సార్సీపీ హయాంలో ఏపీలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయని విపరీతంగా ప్రచారం చేసిన ఆయన.. ఇప్పుడు తమ హయాంలో ఏపీ డ్రగ్స్ కి డెన్ గా మారిపోతే మాత్రం మాట్లాడ్డం లేదు. అబద్దాలను ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన నిపుణుడు మరొకరు లేరు. విజయవాడ- మంగళగిరి- గుంటూరు ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటితోపాటు కొకైన్ లాంటి ప్రమాదకర మాదకద్రవ్యాలు కూడా లభ్యమవుతున్నాయి. డిసెంబరు 12న విశాఖలో రూ. 1.11  కోట్ల  విలువైన గంజాయి పట్టుకున్నారు. 48,300 గ్రాముల కొకైన్ పట్టుకున్నారు. విజయవాడలో 2280 కేజీల గంజాయి ఇటీవలే పట్టుకున్నారు.  
 ఆ రోజు గంజాయి సాగు నియంత్రించాలని వైయస్.జగన్ ప్రభుత్వం ఒక వ్యవస్థనే తీసుకొచ్చింది. రామచంద్రపురంలో రూ. 1.1 కోట్ల విలువైన గంజాయి దొరికింది. గుంటూరులో కోకైన్ పట్టుబడింది. ఏకంగా డీలర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు నడుస్తుంటే.. దాన్ని వైయస్.జగన్ కు అంటగడతారా?. 
లిక్కర్, గంజాయి  అరికట్టడానికి సెబ్ అనే ప్రత్యేక వ్యవస్థనే తీసుకొస్తే మీరు అధికారంలోకి రాగానే వాటి తలుపులు మూసివేశారు. మీకు ఇవేవీ అవసరం లేదు. కానీ ఆ రోజు వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో  11,500 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేసింది. ఎక్కడైనా గంజాయి కనిపిస్తే ధ్వంసం చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఇది పచ్చి నిజం. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పట్టేలా అత్యంత భయంకరమైన పరిస్థితులు నెలకున్నాయి. వీరికి కావాల్సిందల్లా ప్రచారం మాత్రమే. 

ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి మరో తరహా ప్రచారానికి చంద్రబాబు తెరలేపాడు. సంక్రాంతికి సొంతూళ్లకి వెళ్లడంతో పాటు చివరకు రైతులకు కూడా సాయంత్రం ఐదింటికి ఇంటికి వెళ్లి పాలు పితకడం కూడా తానే నేర్పించానని చెబుతున్నాడు. ఇది ఏ రకమైన ప్రచారం. హైదరాబాద్ బిర్యానీకి, చార్మినార్ దగ్గర అమ్మే ముత్యాలకు తానే ప్రచారం చేసానని నోటికి ఏది వస్తే అది చెప్పుకునే ఈయన అబద్దాలు ఏ స్థాయికి దిగజారాయంటే.. చంద్రబాబు లండన్ వెళ్తే.. ఆయన ఎక్కడ కోహినూర్ వజ్రం డిమాండ్ చేస్తాడేమోనని తనపై నిఘా పెట్టారని చెప్పుకునే స్థాయికి జారిపోయారు. ఎంతసేపూ ప్రచారయావ తప్ప మహిళలు, రైతులు, విద్యార్ధులు పట్ల కనీస ఆలోచన లేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధర చూడండి మహా ప్రభో అంటే... పంట పొలాల మీద గాలి ఏ దిశగా మళ్లుతుంది.. దాన్ని పంటలకు అనుకూలంగా  మళ్లించేలా టెక్నాలజీ తీసుకువస్తున్నానని చెబుతున్నాడు. టెక్నాలజీ ద్వారా గాలి, వ్యాధులు అన్నింటినీ కనిపెడతానని ఆయన చెబితే.. అనుకూల మీడియాలో హెడ్ లైన్స్ పెడుతున్నారు.  

● చంద్రబాబు క్రెడిట్ చోరీ - చరిత్ర వక్రీకరణ.

తానేమీ చేయకుండానే క్రెడిట్ చోరీ చేయడం చంద్రబాబుకు అలవాటు. వైయస్.జగన్ చేసిన మంచి పనులన్నీ తన ఖాతాలో వేసుకుంటాడు. తాను చేసిన చెడ్డ పనులన్నీ వైయస్.జగన్ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ ప్రభుత్వం ఎంత అనైతికంగా ప్రవర్తిస్తుందంటే.. వైయస్.జగన్ గురించి మాట్లాడుతూ.. అక్రమ డబ్బుతో ఆయన మీడియా పెట్టాడని చెబుతున్నారు. కానీ చంద్రబాబుకు అనుకూలంగా ఎన్ని మీడియాలున్నాయో.. ఎన్ని పచ్చి అబద్దాలు చెబుతారా ప్రజలందరికీ తెలుసు. 
టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలన్నీ మమ్నిల్ని మోస్తుంటే.. మీరు అబద్దాల కధను నడిపిస్తున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి నేటి వరకు  కేవలం మీడియా బలం ద్వారానే మీరు లాక్కుంటూ వస్తున్నారు.  ఏబీయన్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఈనాడు, మహాటీవీ ఎవరికి మద్దతిస్తుందన్నది ప్రజలకు తెలిసిన నిజాలే. కానీ మాకు అసలు మీడియానే లేదన్నట్టు మాట్లాడ్డం విడ్డూరం. రెండు రోజుల నాడు చంద్రబాబు కాకినాడ వచ్చి గ్రీన్ అమ్మోనియా ప్లాంటులో మిషనరీని ప్రారంభించారు. ఈ ప్రాంతానికి అది గర్వకారణం. వాస్తవానికి ఈ గ్రీన్ కో ఏర్పాటుకు వైస్.జగన్ హాయంలో ఎంఓయూ కుదిరింది. కానీ ఆయన వల్లే ఇవన్నీ వచ్చాయన్నట్లు మాట్లాడారు. ఈ సందర్బంగా గోదావరి, నాగార్జున ఫెర్టిలైజర్స్ అనే రెండు కంపెనీలను 1980లలో రామసంజీవరావుగారు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కృషిచేశారని చెబుతారు. ఆయన కాకినాడను ఫెర్టిలైజర్స్ సిటీగా తయారు చేశారు. గోదావరి ఫెర్టిలైజర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. ఇప్కో తో కల్సి డై అమ్మోనియా ఫాస్పేట్ ని తయారు చేసే సంస్థ. అలాంటి గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ( జీఎఫ్ సీ ఎల్) ని అమ్మకానికి పెట్టింది ఎవరు? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు కాదా చంద్రబాబూ? ఇది చరిత్ర చెప్పిన నిజం. కోరమాండల్ ఫెర్టిలైజర్స్ అనే సంస్థను కూడా అమ్మేశారు. వేలాది ఎకరాల భూమితో కలిసి ఉన్న ఈ సంస్థ విలువ ఇవాల మార్కెట్ లో కనీసం రూ.8- రూ.10 వేల కోట్లు ఖరీదు చేస్తుంది. అలాంటి కంపెనీని రూ.102 కోట్లకు అమ్మేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కంపెనీలను అమ్మేసిన ఘనత చంద్రబాబుదే. కానీ ఈ కంపెనీలు రావడానికి నేను, తెలుగుదేశం పార్టీయే కారణమని చంద్రబాబు చెప్పుకుంటాడు. వాస్తవానికి ఈ కంపెనీల ఏర్పాటుకు 1981లోనే బీజం పడేనాటికి తెలుగుదేశం పార్టీయే పుట్టలేదు. కానీ గోదావరి, నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీలు రావడానికి మేమే కారణమంటూ చరిత్రను వక్రీకరిస్తున్నారు. 
ఇవాళ యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్న దుస్థితిని మీ పాలనలో తీసుకొచ్చారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు రూడ్లమీద దయనీయంగా పడిగాపులు పడుతున్నారు. యూరియా పంచడానికి కూడా కోటా సిస్టం. ఎకరాకు మూడు బస్తాలు మూడు విడతలుగా ఇస్తే.. మూడు సార్లు ఆధార్ కార్డులు, పాస్ బుక్ పట్టుకుని తిరగాలి. దీనికి తోడు యూరియా వాడితే కేన్సర్ వస్తుందని చెబుతాడు. అసలు క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతుందో మీకు తెలుసా చంద్రబాబూ?   

● పెట్టుబడుల ప్రచారంలోను పచ్చి దగా - డైవర్షన్ పాలిటిక్స్.

2014-19 మద్య కాలంలో చంద్రబాబు గారు తీసుకొస్తానన్న పెట్టుబడులు, ఇప్పుడు 18 నెలలుగా వచ్చాయని చెబుతున్న పెట్టుబడులు కలిపితే.. దాదాపు రూ.60-70 లక్షల కోట్ల పెట్టుబడులు అని ప్రచారం చేశారు. 2014-19 మధ్య మీరు చెప్పిన పెట్టుబడులు ఎంతవరకు కార్యరూపం దాల్చాయి, ఈ 18 నెలలుగా చెబుతున్న పెట్టుబడులు ఎంతవరకు కార్యరూపం దాల్చుతున్నాయో చెప్పగలరా? వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే. దాన్ని డైవర్ట్ చేయడం కోసం వైయస్.జగన్ పై బురద జల్లడమో, తిరుపతి లడ్డూ అంశాన్ని, వివేకానందరెడ్డి హత్య కేసును తెరపైకి తీసుకురావడం అలవాటుగా మారింది. సచివాలయానికి కూతవేటు దూరంలో రామారావు అనే అమరావతి రైతు చనిపోతే మీరు పరామర్శించ లేకపోయారు. చివరికి అమరావతి రైతులకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. 

● జగన్నామస్మరణ బాబుకు నిత్యకృత్యం..
 
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడుపుతూ... ఎన్టీఆర్ వర్ధంతి అయినా మరో ప్రారంభోత్సవం అయినా, పెన్షన్ల పంపిణీలోనైనా మీకు జగన్నామస్మరణ అలవాటుగా మారింది. ఆయన పేరు లేకపోతే మీకు పొద్దు గడవడం లేదు. ఈ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు కాబట్టే మీరు ఆయన్ను తగ్గించడానికే నిత్యం ఆయన పేరు తలుస్తూ.. విమర్శించడం మీకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి కన్నబాబు  తేల్చి చెప్పారు. 

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ..

పండగలకూ కులాలను ఆపాదించడం సరికాదు. పండగలు కులాల వారీగా ఉండవు. మతాల వారీగా ఉంటాయి, కానీ చరిత్రను వక్రీకరించే ప్రమాదకర ధోరణిలో ఒక కులమే ఆధిపత్య, ఆరాధనీయ కులంగా జరుగుతున్న ప్రచారం సమాజానికి మంచిది కాదు. గతంలోనూ ఈ ధోరణి చూశాం. కానీ ఇప్పుడు అంతకుమించి సంక్రాంతే కమ్మవారి పండగ అని మాట్లాడే పరిస్థితిపై మాట్లాడ్డం సిగ్గుచేటు. సంక్రాంతి అనేది సూర్య సిద్ధాంతం, ఆర్యభట్ట, వరహమిహిరకుడి కాలం నుంచి ఉంది. కాలిదాసు మొదలుకుని బమ్మెరపోతన, నన్నయ, తిక్కన వరకు సంక్రాంతి ప్రస్తావనతో ఆనాటి రచనా వ్యాసాంగాలు సాగాయి. వేలసంవత్సరాల నాటి పంచాంగాల్లోనూ సంక్రాంతిప్రస్తావన ఉందన్నారు. బమ్మెర 15వ శతాబ్దంలోనే సంక్రాంతి గురించి మకర రవి రాక, పండగ గురించి రాశారని తెలిపారు.