తన కేసులపై తానే తీర్పు ఇచ్చుకున్న చంద్రబాబు
కాకినాడ: మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో తన మీదున్న కేసులను తానే ఎత్తేయించుకున్న సీఎం చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తన కేసులపై తానే తీర్పు ఇచ్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో సంక్రాంతి కానుక పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పంచిన బాబు.. ఇప్పుడు తనకు తానే సంక్రాంతి కానుక ఇచ్చుకున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు చర్యలతో ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను జేబు సంస్థలుగా మార్చుకున్న చంద్రబాబు... వ్యవస్థలను నీరుగారుస్తున్నారని మండిపట్టారు. తనపై ఉన్న కేసుల్లో దోషా? కాదా? అన్నది కోర్టులు తేల్చాలే తప్ప చంద్రబాబు కాదని తేల్చి చెప్పారు. ఒకవైపు కూటమి నేతలు పీకలు కోసే ఘోరాలు చేస్తుంటే... మరోవైపు వైయస్సార్సీపీ నేతలు కేకులు కోసినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చివరకు టెంకాయ కొట్టినా కేసు పెట్టే దుస్థితి వచ్చింది.. ఇది చంద్రబాబు దుర్మార్గ పాలనకు నిదర్శనమన్న కన్నబాబు... ఇందుకు సహకరిస్తున్న అధికారులు న్యాయసమీక్షకు సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పారు. ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన చంద్రబాబు.. చట్ట వ్యతిరేకంగా లాటరీ, ఆన్ లైన్ గేమింగ్ తో సంపదసృష్టిస్తానడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏ రకంగా న్యాయబద్ధం అని నిలదీశారు.
ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...
● తనకు తానే సంక్రాంతి కానుకిచ్చుకున్న చంద్రబాబు..
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి కానుక పేరుతో పప్పు, బెల్లాలు పంచే చంద్రబాబు ఈదఫా సంక్రాంతి కానుక ప్రజలకు ఇవ్వడం మానేసి... తనకు తానే ఇచ్చుకున్నాడు. రాష్ట్రంలో వందలాది కోట్లు దిగమింగిన స్కిల్ స్కామ్ చాలా సంచలన కేసు. ఈ స్కామ్ ను కేంద్ర ప్రభుత్వం, ఈడీ దర్యాప్తు చేసి కేసు పెట్టింది. ఇందులో ఇన్ వాల్వ్ అయి ఉన్న కొన్ని కంపెనీల ప్రతినిధుల ఆస్తులను కూడా జప్తు చేసింది. ఈ కేసు మూలాలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం వరకు ఉన్నాయని ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ కేసులో పక్కదారిపట్టిన డొల్ల కంపెనీలకు వెళ్లిన నిధులు.. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఖాతాలోకి కూడా వచ్చాయని ఆరోజు ఈడీ తేల్చింది. అలాంటి కేసును నిన్న చంద్రబాబు నాయుడు తనకు తానే ఎత్తేయించుకున్నాడు. ఈ కేసులో చంద్రబాబే నిందితుడు ఆయనే న్యాయవాది, ఆయనే తీర్పులిచ్చుకునే న్యాయమూర్తిలా వ్యవహరిస్తూ తన మీద కేసులను ఎత్తేయించుకున్నాడు. ఈ చర్య ద్వారా ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది ఒక ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న నాయకుడు తన మీద కేసులను తనే ఎత్తేయించుకుంటూ ఈ దేశానికి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాడంటే.. ఇదొక ఆనవాయితీగా తీసుకునే పరిస్థితి కల్పించాడు. అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆనాటి సీఐడీ అధికారులు తేల్చి ఆధారాలతో సహా కేసు పెడితే.. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కేసులన్నీ ఎత్తేస్తున్నారు. చంద్రబాబు గారూ ఇది దేనికి సంకేతం? సుదీర్ఘకాలం పరిపాలన అనుభవం ఉన్న మీరు ఇలా చేయడం వ్యవస్థలను పరిహారం చేయడం కాదా? వ్యవస్థలను నీరుగార్చడం కాదా? మీరు దోషా? నిర్దోషా? అని కోర్టుల్లో తేలాల్సి ఉంది. కానీ మీ దర్యాప్తు సంస్థలని వ్యక్తిగత సంస్థలుగా మార్చివేసి కావాల్సినట్టుగా రికార్డులు రూపొందికుని, సుప్రీం కోర్టులో కూడా వాదనలు జరుగుతున్న ఈ స్కిల్ స్కామ్ కేసుని మీరు ఎత్తేసుకోవడం ప్రజానీకానికి చాలా ఆశ్యర్యంగా ఉంది.
● మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కేసులు ఎత్తివేత...
కానీ మీ అనుకూల పత్రికల్లో మాత్రం సంక్రాంతి కానుక కింద ఉద్యోగులకు ఇచ్చే డీఏలు, కాంట్రాక్టర్లకు రూ.1248 కోట్ల చెల్లింపులు సంక్రాంతి కానుక అని రాశారు. అవి సంక్రాంతి కానుకలా? వారి హక్కులా? అది కానుకా? డీఏ పొందడం ఉద్యోగుల హక్కు, అది కానుకవుతుందా?
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న 8 కేసులు ఎత్తివేశారు. అసైన్డ్ ల్యాండ్స్ కేసును కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో 25 నవంబరు 2025న ఎత్తివేశారు. అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కేసును కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో 25-11-2025 నాడే ఎత్తివేశారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కేసును కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు. స్కిల్ డవలప్ మెంట్ కేసును నిన్న అనగా 12-01-2026 నాడు ఎత్తివేశారు. అదే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై ఇవాల్టి వరకు పైనల్ రిపోర్టు ఫైల్ చేయలేదు. 2023లో ఫైల్ చేసిన లిక్కర్ కేసును 01-12-2025న లిఫ్ట్ చేశారు. అదే విధంగా మైనింగ్ కేసును కూడా 27-10-2025న, అసైన్డ్ ల్యాండ్స్ మీద మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసు పై హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ సిద్ధంగా ఉంది. ఇవన్నీ తనకు తానే తీర్పులిచ్చుకుని తీసేస్తున్నాడు. తన చేతిలో అధికారం ఉందని దర్యాప్తు సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నూ, తన మీద తనే కేసులు తీసేయించుకుంటున్నాడు.
● కేకులు కోసినా కేసులు పెడుతున్న చంద్రబాబు సర్కార్...
మరోవైపు మేకలు కోశారని కేసులు పెడుతున్నాడు. ఎవరైనా పీకలు కోస్తే కేసులు పెడతారు. చంద్రబాబు మాత్రం కేకులు కోసినా కేసులు పెడుతున్నాడు. వైయస్.జగన్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి సమీపంలో కోడిని కోస్తే ఆది పెద్ద నేరమని ఐదు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. పుట్టిన రోజు నాడు వైయస్.జగన్ ప్లెక్సీ దగ్గర మేకను కోశారని వారిపై కేసు నమోదు చేయడమే కాకుండా.. ధర్డ్ డిగ్రీ ప్రయోగించి ప్రజాస్వామ్యాన్నఅపహాస్యం చేసే విధంగా వారిని నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్లారు. తప్పుడు కేసులు బనాయించి.. అత్యంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను వాడుతున్నారు. చివరకు టెంకాయ కొట్టినా కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. కోడిని కోస్తే తప్పు.. కోడిపందేలు వద్దని హైకోర్టు చెప్పినా వాటిని పండగలో భాగంగా చెబుతున్నారు. మేం సంక్రాంతి సంబరాలకు వ్యతిరేకం కాదు.. కానీ ఇదే మీడియా వైయస్.జగన్ హాయంలో అత్యంత దుర్మార్గంగా వార్తలు రాశారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతూ అరాచకం జరుగుతుందని రాశారు. ఇప్పుడు మాత్రం కేపీఎల్(కోడిపందేల లీగ్) పేరుతో అధికార పార్టీ శాసనసభ్యులే నిర్వహిస్తున్నారు. అది కాకుండా విందు, వినోదాలని గొప్పగా రాస్తున్నారు. వైయస్.జగన్ హయాంలో మాత్రం ఇవన్నీ కేసినోలు, జూదం కింద కనిపించాయి. ఈ ప్రపంచంలో మీ అంత దుర్మార్గమైన ప్రచారం చేసుకునేవాళ్లు మరొకరు ఉండరు. మీరు గోబెల్స్ కి అమ్మా మొగుడులా ప్రచారం చేసుకుంటున్నారు.
● సంక్రాంతి పైనా నిస్సిగ్గు ప్రచారం...
అసలు సంక్రాంతిని ఈయన కనిపెట్టినట్లు, మకరరాశిలోకి సూర్యుడ్ని ఈయనే వెళ్లమన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అసలు సంక్రాంతికి పుట్టినూరు వెళ్లడం అనేది ఈయనే తీసుకొచ్చాడని చెప్పుకోవడం మరింత దుర్మార్గం. అంతకముందు ఎవరూ సొంత గ్రామాలకు వెళ్లడం తెలియదని.. ఈయన తీసుకొచ్చిన సాంప్రదాయాన్ని ఈయనే మొదలుపెడితే మిగిలిన వాళ్లు దాన్ని ఆనవాయితీ చేసుకున్నారని చెప్పడానికి మీకు సిగ్గులేకపోయినా, వినడానికి మాకు మాత్రం సిగ్గుగా ఉంది. హైదరాబాద్ బిర్యానీని సైతం తానే కనిపెట్టానని చెప్పడం దారుణం.
● భవిష్యత్తులో న్యాయసమీక్షకు సిద్ధంగా ఉండాలి..
సుప్రీం కోర్టులో ఉన్న స్కిల్ స్కామ్ కేసుపై మీరు స్ట్రాంగ్ గా నిలబడి పోరాటం చేయాల్సింది పోయి మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటే సరిపోతుందా? ఈ స్కామ్ లన్నీ వైయస్సార్సీపీ న్యాయపోరాటం చేయడం ఖాయం. మీరు కేసులు ఎత్తేసుకున్నా మీకు సొంతపార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న కొంతమంది అధికారులు, మీకు సహకారం అందించిన వాళ్లందరూ కచ్చితంగా భవిష్యత్తులో న్యాయసమీక్షకు సిద్ధంగా ఉండాల్సిందే. చట్టాలు అంటే గౌరవం లేదు, దాన్ని ఔన్నత్యాన్ని కాపాడాలనే ఆలోచన లేదు. సమాజానికి, రాష్ట్రానికి దుష్ట సాంప్రదాయాన్ని పరిచయం చేస్తున్నారు. అధికార పీఠంపై ఉన్నవాడు తనమీద ఉన్న ఎన్ని మచ్చులునైనా తీసేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే చట్టాలంటే ఏం గౌరవం ఉంటుంది? వైయస్.జగన్ హయాంలో మీరు కాకినాడ సెజ్ రైతుల మీద పెట్టిన కేసులను, కాపుల మీద మీరు అక్రమంగా పెట్టిన కేసులను తీశారే తప్ప ఆయన మీద కేసులను తీసేయలేదు. మీరు మాత్రం సామాన్య జనాలను వేధించుకు తింటూ.. కోళ్లను, మేకలను కేశారని కేసులు పెడుతూ.. మీ మీద ఉన్న అతిపెద్ద స్కామ్ కేసులను తీసేయించుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో తన మీదున్న కేసులను తనే తీసేయించుకున్న ముఖ్యమంత్రి మీరు తప్ప మరొకరు లేరు. అసలు ఏ కేసులో జైలుకు వెళ్లాడో ఆ కేసులోనే మీరు మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోలేకపోతే ఎక్కడుంది మీ నిజాయితీ. మీ మీద దుర్మార్గంగా కేసు పెట్టారని పత్రికలలో రాయించిన మీరు.. అదే నిజమైతే మీరు కోర్టుల్లో నిలబడి ఆ విషయాన్ని చెప్పించాలి. ఆ విషయాన్ని చెప్పాల్సింది కూడా కోర్టులే. వేల కోట్ల రూపాయిల స్కామ్ లకు జరిగిన కేసులన్నింటినీ రాత్రికి రాత్రే అధికారం మీ చేతిలో ఉంది కదాని ఎత్తేయించుకుంటున్నారంటే మీరు ఎంత భయపడుతున్నారో అర్ధం అవుతుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు చెప్పినట్లు... వైయస్.జగన్ అంటే ఈ ప్రభుత్వానికి భయం. ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తూ... ప్రజల ఆస్తులను దోచుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే అవినీతి కార్యక్రమం చేస్తోంది. అందుకే ఈ ప్రభుత్వానికి వైయస్.జగన్ అంటే భయం.
● తొలివిడత రైతులకు న్యాయం చేయకుండానే...
అమరావతిని ముంపు ప్రాంతంలో కడుతున్నారు.. అది గుంటూరు, విజయవాడ మధ్య కట్టుకోవచ్చు కదా అంటే వైయస్.జగన్ మీద విపరీతంగా బురద జల్లుతున్నారు. అమరావతిని ఒక్క వైయస్.జగన్ మాత్రమే తప్పు పట్టారా? మీ సొంత ఛానెళ్లలోనే అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తుంది తప్పని చెబుతున్నారు. మీ ఛానెల్స్ లోనే అమరావతిలో ముంపునకు గురైన చోట నీటిని తోడుతున్న వైనాన్ని, తుప్పలు కొడుతున్న ప్రాంతాలను కూడా చూపిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మునిగిపోయే చోట కాకుండా మంచి ప్రాంతంలో రాజధాని కట్టుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తే శాపనార్ధాలు పెడుతున్నారు.
ఏమన్నా అంటే అమరావతిలో ఆవకాయ్ కలుపుతూ ఈవెంట్ చేశారు. అది కూడా అమరావతిలో కాకుండా విజయవాడలో పెట్టారు. గతంలో వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా నిండా ముంచేసిన చంద్రబాబు మరలా వేలాది ఎకరాలు సేకరించడానికి సన్నద్ధం అవుతున్నారు.
ఢిల్లీని మించిన రాజధాని కడతానని, హైదరాబాద్ నిర్మించిన కులీకుతుబ్ షా ని మరిపిస్తానని రోజూ ప్రకటనలు ఇస్తున్నారు.
● చట్ట వ్యతిరేక ఆన్ లైన్ గేమింగ్ తో సంపదసృష్టా...
ఈ సంపద సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాటరీ తీసుకొస్తానని చెబుతున్నాడు. దానిమీద రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందంటున్నాడు. ఆన్ లైన్ గేమింగ్ ద్వారా మరో రూ.1400 కోట్ల ఆదాయం వస్తుందంటున్నాడు. అంటే ఆన్ లైన్ గేమింగ్ లు, ఆన్ లైన్ బెట్టింగులను ఈ సంపద సృష్టికర్త ఆదాయమార్గంగా చూస్తున్నాడు. చాలా చిత్రం ఏమిటంటే రూ.13100 కోట్ల ఆదాయన్ని సమకూర్చుకోబోతున్నామని చాలా గొప్పగా చంద్రబాబు అధికార్లతో చెప్పినట్లు రాశారు. ఆదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను ఆన్వేషిస్తున్నామని.. ఏపీ లాటరీ, ఆన్ లైన్ గేమింగ్ వంటి మార్గాలపై 1 శాతం సెస్ లాంటి మార్గాల్లో వేలకోట్ల అదనపు ఆదాయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆర్ధిక శాఖ కార్యదర్శి పియూష్ కుమార్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 2047-48 నాటికి జీఎస్ డీ పీ లో సేవారంగం వాటా 55.19 శాతం అని చెబుతున్నారు. ఇలాంటి సొల్లు మాటలతోనే పాలనా కాలం అంతా గడిపేయడం ఆయనకు అలవాటు. 2000లో 2020 అని చెప్పడం 2020 వస్తే 2040 అని చెప్పడం పరిపాటిగా మారింది. 2040లో 2090 అని చెప్పడం అలవాటు. కన్నతల్లికి అన్నం పెట్టని నీలాంటి వాడే పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది. ఎక్కడి రోడ్లు అక్కడే గుంతలుపడి ఉన్నాయి. పేదలు పండగకి బట్టలు కొనుక్కునే స్దోమత లేకుండా పోయింది. వైయస్.జగన్ హాయంలో పండగనాటికి ఒకటిరెండు పథకాల్లో డబ్బులు వవేస్త బట్టల మార్కెట్లు కళకళలాడుతూ ఉండేవి. ఇప్పుడు అది కూడా లేదు. ప్రజల కనీస అవసరాలు తీరని పరిస్థితులుంటే.. 2047 నాటికి సేవారంగం పెరుగుతుందని కడుపు మండిన ప్రజల మీద కామెడీ చేస్తున్నారు. ఎస్ జీ ఎస్ టీ పై 1 శాతం వేస్తే రూ.4700 కోట్లు, ఏపీ లాటరీ ద్వారా రూ.3000 కోట్లు, ఆన్ లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ.1400 కోట్లు అదనపు ఆదాయం చెబుతున్నారు. ఒకవైపు ఆన్ లైన్ గేమింగ్, ఆన్ లైన్ బెట్టింగ్ క్రైమ్, పాపం అని ఒకవైపు కేసులు పెడుతున్నారు. దానిమీద పన్నులు వేస్తానంటే.. అది న్యాయబద్ధం అని ఆమోదిస్తున్నారా? ఇదేనా సంపద సృష్టి ? ఎవరి కోసం ఇదంతా?
● మందు బాబులకు సంక్రాంతి కానుక- బాటిల్ కు రూ.10 బాదుడు.
గతంలో వైయస్.జగన్ హయాంలో లిక్కర్ ధరల మీద గగ్గోలు చేస్తూ... తాగుబోతుల కడుపుకొడుతున్నాడని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడేమో సంక్రాంతి కానుక కింద మందుబాబులకి బాటిల్ మీద రూ.10 పెంచుతూ జీవో ఇచ్చారు. ఇది కాకుండా 1 శాతం రిటైలర్ కి అదనపు కమిషన్, బార్లకు సంబంధించి రిటైల్ టాక్స్ ఎత్తివేత పండగ కానుక కింది ఇచ్చారు. ఆ రోజు వైయస్.జగన్ మద్యం ధరలు పెరిగితే కొనలేక తాగడం తగ్గిస్తారని నిర్ణయం తీసుకుంటే అధి మీకు మహాపరాధం, మహా ఘోరం. ఇవాళ మీరు ధరలు పెరిగితే ఆదాయవనరుల సమీకరణ అని రాస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఈ చిడతలకి కొరత ఉండదేమో. అప్పడు పేకాడతే తప్పు.. ఇవాళ అది ఇండోర్ గేమ్ అయి కూర్చొంది. వైయస్.జగన్ హాయంలో క్లబ్బులన్నింటినీ ఉక్కుపాదం వేసి మూసివేస్తే... ఇవాల మీరు ఆదాయాల కోసం లాటరీలకు తెరతీశారు. మరోవైపు సీఎం చంద్రబాబు సరిగా పనిచేయని అధికారులు మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రాశారు. ఫలితాలు బాగా ఉంటే... అది క్రెడిట్ చంద్రబాబుకి.. బాగా పనిచేయకపోతే దాన్ని అధికారుల ఖాతాల్లో వేయడం అలవాటు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ... 99 పైసలకే ఎకరా మీకు నచ్చినవాళ్లకు కట్టబెట్టుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే... మొత్తం భూమి 99 పైసలకే ఇస్తామని చెబుతున్నారు. మీరు యజమానులు కాదు.. కేవలం కస్టోడియన్స్ మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకొండి. మీకున్న బలంతో ఏం చేసినా పర్వాలేదన్న మైండ్ సెట్ తో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ఒకే ఒక్క జగన్ ని ఎదుర్కొంటే ఏదైనా చేయవచ్చన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తల మీద కేసులు ఇష్టం వచ్చినట్లు కేసులు పైల్ చేస్తున్నారు.
● ఆర్వో ప్లాంట్ల్ తరహాలో లిక్కర్ తయారీ...
నిన్న మొన్నటివరకు కుటీర పరిశ్రమల్లా, గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ల తరహాలో ఎవడికి వాడే మద్యం తయారీ యూనిట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు లాటరీలు, ఆన్ లైన్ గేమింగ్, లాటరీలు అని చెబుతున్నాడు. గతంలో మా హయాంలో గంజాయి అక్కడక్కడా ఉంటే దాన్ని అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటే దానికి కూడా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి ఎక్కడ లేదో చెప్పగలరా?
క్షేత్రస్ధాయిలో పోలీసధికారులు పద్ధతిగా ఉండాల్సిన, నిజాయితీగా ఉండాల్సిన అధికారులు తప్పుగా ప్రజలను వేధించే విధంగా, అధికార పార్టీకి సేవ చేసే కార్యకర్తల్లా పనిచేస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఇది మంచి పద్దతి కాదు. ఈ విధంగా అధికార పార్టీకి కొమ్ముకాసే కార్యక్రమం చేస్తే మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. అదే సందర్భంగా వైయస్.జగన్ ప్రభుత్వ హాయంలో పనిచేసిన అధికారులకు ఇవాల్టికి పోస్టింగులు ఇవ్వలేదు. అటాచ్ మెంట్ల పేరుతో వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఏదైనా పనిచేయడం అధికారుల బాధ్యత. అలాంటి వారికి పోస్టింగులు ఇవ్వకుండా వైయస్సార్సీపీ పోలీస్ విభాగం అని, టీడీపీ పోలీస్ విభాగం అని కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా మంది అధికార్లకు నష్టం కలిగిస్తుంది. 18 నెలలైంది కొత్త ఏడాదిలోనైనా ప్రజలను, వైయస్సార్సీపీ కార్యకర్తలను, అధికార్లను వేధించడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం.
ఇటీవల వీక్ మేగజైన్ లో లోకేష్ కవర్ పేజీ మీద వేశారు. రూ.20 లక్షల కోట్ల ఎంఓయూలు చేశారు.. వాస్తవంగా ఎంత పెట్టుబడులు వస్తాయో అప్పుడు చూద్దాం. నిజం నిలకడ మీద తెలుస్తుందని కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఈ సంక్రాంతికి చంద్రబాబు తనకు తాను కానుకిచ్చుకున్నాడే తప్ప.. ప్రజలకేం కానుకులు లేవని తేల్చి చెప్పారు. తన మీద తాను కేసులెత్తేసుకున్న వైయస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుందని హెచ్చరించారు.
● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ...
బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకోవడం మీ విజ్ఞత. ఆ రోజు ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిగారిని పెళ్లి చేసుకుంటే మీరు ఆయన్ను పరిపాలన చేయనివ్వలేదు. ఆయన్ను వేధించారు. ఇప్పుడేమో ఒకవైపు రూ.1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామని చెబుతున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి డబ్బుల్లేవని చెబుతారు. ఉద్యోగుల డీఏ, పిల్లల ఫీజు రీయింబర్స్ మెంట్, రోడ్ల మీద గోతులు పూడ్చడానికి కూడా డబ్బుల్లేవు కానీ.. భారీ మొత్తంలో ఖర్చు చేసి విగ్రహం ఏర్పాటుకు సిద్ధమవుతున్నవారు. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా చేస్తున్నారు.
మరోవైపు లాటరీలు, ఆన్ లైన్ గేమింగ్ లు పెట్టాలనుకోవడం ద్వారా ప్రభుత్వ మైండ్ సెట్ ఏంటో అర్ధం అవుతుంది. ఎన్నికల్లో విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు.. వైయస్.జగన్ హయాంలో భూసర్వే తప్పు అయితే ఇవాళ చంద్రబాబు చేస్తున్నదేమిటి?