చంద్రబాబు, లోకేష్ ల  రహస్య విదేశీ పర్యటనలు

2 Jan, 2026 19:37 IST

కాకినాడ:ప్రజలకు కనీస సమాచారమివ్వకుండానే  విదేశీ పర్యటలకు వెళ్ళిన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ తీరుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఆక్షేపించారు. కాకినాడలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు, లోకేష్ ల  రహస్య విదేశీ పర్యటన ప్రజలను గందరగోళంలోకి నెట్టిందని మండిపడ్డారు. బాధ్యత గల పదవుల్లో ఉంటూ... తమ పర్యటన వివరాల్లో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని నిలదీశారు. సీఎం హోదాలో  తన కుమార్తెను చూడ్డానికి లండన్ వెళ్లిన  వైయస్.జగన్  పై లోకేష్ చేసిన దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 
అధికారికంగా సమాచారమిచ్చినా చౌకబారు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఇవాళ మీ తండ్రీకొడుకుల పర్యటన వివరాలెందుకివ్వలేదని నిలదీశారు. పర్యటన ఏదైనా బాధ్యతగల సీఎం, మంత్రిగా ఎందుకు సమాచారమివ్వలేదని ప్రశ్నించారు. ఒకవైపు బాబు లండన్ పర్యటన అంటూ మీడియాకు లీకులిస్తుంటే.. బాలికి బాబు ప్రయాణం అని జరుగుతున్న ప్రచారం ప్రజలను అయోమయానికి గురి చేస్తుందని ఆక్షేపించారు. 18 నెలల్లో కూటమి పాలనలో రికార్డు స్ధాయి అప్పులు చేశారని.. 5 ఏళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే.. 18 నెలల బాబు పాలనలో ఏకంగా రూ. 2.93 లక్షల కోట్ల అప్పు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మీరు చేస్తామన్న సంపద సృష్టి ఏమైందని ప్రశ్నించిన కన్నబాబు... బాబు పాలనలో వృద్ధి రేటుకి, జీఎస్టీ ఆదాయానికి  పొంతన కుదరడం లేదని తేల్చి చెప్పారు. 
ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

● గందరగోళంలో రాష్ట్ర ప్రజలు...

కొత్త సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ ఎక్కడికి వెళ్లారో తెలియక రాష్ట్ర ప్రజలు గందరగోళంలో ఉన్నారని, వీరి పర్యటనలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కుమార్తెను చూసేందుకు లండన్ కు సమాచారం ఇచ్చి వెళ్తే కట్టుకథలు అల్లిన చరిత్ర లోకేష్ కు ఉందన్నారు. ప్రెస్ మీట్ లో కురసాల కన్నబాబు ఇంకా ఏమన్నారంటే...

● రహస్యంగా విదేశాలకు చంద్రబాబు,లోకేష్ 

ప్రజలకు పారదర్శకంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్.. కనీసం అధికారిక పర్యటనా?, అనధికార పర్యటనా? చెప్పకుండా ఇన్నిరోజులు మాయం అయిపోవడం ఏంటి ? రాష్ట్రానికి తాము అందుబాటులో ఉండటం లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వారికి ఎందుకు రాలేదో, ఈ పర్యటనలు ఎందుకు రహస్యంగా ఉంచారో ఎవరికీ అర్దం కావట్లేదు. కొడుకు ఏ దేశం వెళ్లాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్లాడో తెలియదు. బయటికి లీకులు చూస్తే చంద్రబాబు లండన్ వెళ్లారని చెప్తున్నారు. వీళ్లు చెప్తున్న దేశం కాకుండా బాలి లేదా మరో దేశం వెళ్లినట్లు బయట ప్రచారం జరుగుతోంది. అసలు ప్రజల్ని ఇంత అయోమయంలో ఉంచాల్సిన అవసరం ఏముంది?, మీరు ఏ దేశం వెళ్లినా నేను ఇన్ని రోజులు అందుబాటులో ఉండను, నూతన సంవత్సర వేడుకలకు వెళ్తున్నామనో, సొంత పనుల మీద వెళ్లాననో, పెట్టుబడుల కోసం వెళ్లాననో చెప్పుకోవచ్చుగా?.. అలా కాకుండా ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు.

● గతంలో వైయస్.జగన్ పై దుష్ఫ్రచారం..

గతంలో వైయ్.జగన్ ముఖ్యమంత్రిగా ఉండి లండన్ లో కుమార్తెల్ని చూసేందుకు అధికారికంగా చెప్పి వెళ్లినా, లోకేష్ ఎంత చౌకబారు భాషతో, ఎంతలా దుష్ప్రచారం చేశారో గుర్తుందా?, ఓ అబద్ధాన్ని నిజం చేసేందుకు ఎంత తెగబడతారో వీళ్లని చూసే అర్దం చేసుకోవాలి. ఎంత దిగజారిపోయి తప్పుడు భాష, మాటలు మాట్లాడుతూ కూడా వాళ్లు చెప్పేది చాగంటి, గరికపాటి, చినజీయర్ ప్రవచనాల్లాగా భావిస్తూ ఉంటారు. కానీ నోరు విప్పితే అబద్ధాలు, కట్టుకథలు, పిట్టకథలు, అభూతకల్పనలే. వాళ్ల సొంత మీడియాతో ఏం మాట్లాడినా వాళ్లు ప్రవచనాలు వల్లించినట్లు చెప్తారు. అయితే ప్రజలకు  చేసుకోలేనంత అమాయకత్వం లేదు. ఎందుకంటే ఓ సెక్షన్ మీడియాను నమ్మి ప్రజలు నడవట్లేదు. ఇవాళ సోషల్ మీడియా బలంగా ఉంది. ఏ దేశం వెళ్లినా మన తెలుగువాళ్లు ఉన్నారు, ఏ విమానం ఎక్కారో, ఏ ప్రైవేటు వాహనం ఎక్కారో తెలుస్తూనే ఉంది. ఇది వ్యక్తిగతం అనుకోవడానికి లేదు. చంద్రబాబు, ఆయన తనయుడు.. సీఎం, మంత్రిగా బాధ్యతల్లో  ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే పాలనను చంద్రబాబు భుజస్కందాలపై నడుపుతున్నారు. వీళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లిపోయారన్న ఆసక్తి ఉండదా ?. కానీ మీరు గతంలో వైయస్.జగన్ పై మీరు మాట్లాడినట్లు మేం ఇప్పుడు మీ మీద దుర్భాషలు మాట్లాడట్లేదు. పాపం పని మీద వెళ్లుంటారు, ఏదో అవసరానికో, వాళ్ల కుటుంబంతో వెళ్లి ఉంటారని అనుకుంటాం, కానీ పలానా పని మీద వెళ్లామని చెప్తే తప్పేంటి?. 

● 18 నెలల్లోనే రికార్డు స్ధాయిలో అప్పులు

గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రాన్ని అప్పులు చేసేస్తున్నారని దుష్ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టేస్తున్నారని స్వయంగా ఆర్బీఐ చెబుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులు కూటమి ప్రభుత్వమే చేసిందని ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఐదేళ్లకు చేసిన అప్పులు రూ. 3 లక్షల 32 వేల 671కోట్లు అయితే ఇప్పుడు 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన అప్పులు రూ. 2 లక్షల 93 వేల 178 కోట్లు. అంటే జగన్ గారు తన హయాంలో చేసిన అప్పుల్లో 89 శాతం రుణాల్ని చంద్రబాబు కేవలం 18 నెలల్లోనే చేశారు. వేగంగా అప్పులు చేసే రాష్ట్రంగా ఏపీకి రికార్డు తెచ్చిపెట్టారు. సంపద సృష్టిలేదు, ఉద్యోగ కల్పన లేదు, పెట్టుబడిదారులు పారిపోతున్నారని వైయస్.జగన్ హయాంలో ... తన  సొంత ఫ్యాక్టరీలో తయారు చేసిన అబద్ధాల్ని చంద్రబాబు బ్రాండింగ్ చేసేవారు.

● కూటమి అబద్ధాలకు ఆర్బీఐ లెక్కలే చెంపపెట్టు

మ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు రప్పించడంలో, ఉద్యోగాల కల్పనలో ఇదీ మా ఘనత అని ఓ ట్వీట్ చేశారు. దానికి ఇప్పటివరకూ చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. వాళ్లు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను వైయస్.జగన్ దెబ్బతీశారని... చంద్రబాబు చేసిన  ప్రచారం చేశారనడానికి ఇదే నిదర్శనం. 2019-24 మధ్య తయారీ రంగంలో దక్షిణాదిలో  ఆంధ్రప్రదేశ్ అగ్రస్దానంలో ఉందని, దేశంలో ఐదో స్ధానంలో ఉందని ఆర్బీఐ నివేదిక చెబుతోంది. పారిశ్రామికాభివృద్ధిలో దక్షిణాదిలో తొలి స్ధానంలోనూ, దేశంలో ఎనిమిదో స్ధానంలో ఉందని ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఇలాంటి ఉదాహరణలు పెట్టుకుని వైయస్.జగన్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దెబ్బతీసారని ఎలా చెప్పారు?, అంటే మీరు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారన్నమాట. 

● విజనరీ హయాంలో సంపద సృష్టి ఏదీ ?

చంద్రబాబు మాటలకూ, వాస్తవ అంకెలకూ పోలిక ఉండటం లేదు. జీఎస్టీ ఆదాయం చూసినా గత రెండేళ్లలో 10 శాతం పెరగాల్సి ఉండగా.. కేవలం  3.48 శాతమే పెరిగింది. వృద్ధి రేటు ప్రకారం చూస్తే దీనికీ పొంతన కుదరడం లేదు.  ప్రభుత్వం చెప్పినట్లు జీడీపీ రేటు పెరిగితే జీఎస్టీ ఎందుకు పెరగలేదు?. రాష్ట్ర పన్నులు చూసినా పెరగాల్సింది పోయి 2.93 శాతం పడిపోయింది. ఇది మీ లెక్కలే చెప్తున్నాయి. మీ అంచనాల ప్రకారం చూస్తే రాష్ట్ర పన్నులు 17 శాతానికి పెరగాలి. జీడీపీ లెక్కలు నిజమైతే ఈ అంకెలతో ఎందుకు సరిపోవడం లేదో చెప్పాలి. ఇవాళ ఊర్లలో పనుల్లేవు, నిర్మాణ పనులు జరగడం లేదు. రోడ్డు, అభివృద్ధి పనులు, ప్రైవేటు వ్యక్తులు సైతం ఇల్లు కట్టుకోలేని పరిస్ధితుల్లో ఉన్నారు. పండగ పూట కూడా రోడ్లు, షాపులు ఖాళీగా ఉన్నాయి. ఏ దుకాణాదారుడిని అడిగినా వ్యాపారాలు కట్టగట్టుకుపోయాయని చెప్తున్నారు. ఇది మీ చేతగానితనం వల్లే. మీరు విజనరీ అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎందుకు దిగజారిపోతోంది. ? ఇంచుమించు 2.93 లక్షల కోట్ల అప్పు చేశారు, అదంతా ఎక్కడికి పోయింది. అప్పుల కోసం బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి. అమరావతిలో తుప్పలు కొట్టడం, నీళ్లు తోడటం తప్ప మీరేం చేశారో చెప్పండి?. ఒక్క పథకం అమలు చేయట్లేదు, ప్రాజెక్టులూ ముందుకు సాగట్లేదు, మరి డబ్బులన్నీ ఎక్కడ ఖర్చుపెడుతున్నారో చెప్పండి.. 

● సచివాలయాల పేర్ల మార్పుతో సాధించిందేంటి ?

ప్రజలు రోజువారీ దైనందిత జీవితం ఎలా గడపాలో అర్దం కాకుండా ఇబ్బందులు పడుతుంటే సచివాలయాల పేర్లను స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డులని మార్చారు. పేరు మారిస్తే తీరు మారిపోతుందా ?, జగన్ గారు సృష్టించిన వ్యవస్థకు మీరు ఎన్ని పేర్లు మార్చినా దాన్ని సచివాలయం అనే అంటారు. లక్షా 30 వేల మంది ఉద్యోగులను నియమించాం, ప్రతీ 2 వేల మందికీ ఓ సచివాలయం పెట్టాం. రైతు భరోసా కేంద్రాల పేరు మార్చినా ఇంకా ఆర్బీకేలు అంటున్నారని చంద్రబాబు కోప్పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య భరోసా అన్నా ప్రజలు ఆరోగ్యశ్రీనే అంటున్నారు. అమ్మఒడికి సైతం తల్లికి వందనం అని మార్చినా ఇప్పటికీ అమ్మఒడి అనే జనం పిలుస్తున్నారు.. వైయస్.జగన్ చేపట్టిన సంక్షేమానికి ఇవే నిదర్శనమని కురసాల కన్నబాబు తేల్చి చెప్పారు.