విజయవంతమైన కోటి సంతకాలు సేకరణ, వైయస్.జగన్ పుట్టినరోజు వేడుకలు
తాడేపల్లి : వైయస్.జగన్ కు వస్తున్న జనాదరణ చూసి సీఎం చంద్రబాబు తట్టుకోలేక దిక్కుతోచని స్ధితిలో.. వైయస్ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఒకవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తడంతో పాటు, మరోవైపు వైయస్.జగన్ పుట్టిన రోజును వాడ, వాడలా పండగలా నిర్వహించడంతో కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని స్పష్టం చేశారు. దీనికి తోడు అమరావతి కోసం ఇచ్చిన భూమికి బదులు వాగుల్లో ప్లాట్ కేటాయించారన్న ఆవేదనలో రాజధాని రైతు చనిపోవడంతో.. వీటన్నింటినీ డైవర్షన్ చేయడం కోసమే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. వైయస్.జగన్ పుట్టిన రోజు సంబరాల్లో జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్న హోంమంత్రి అనిత... గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ప్లెక్సీలకు పొట్టేళ్లను బలిఇచ్చి తలకాయలతో దండలు వేసిన ఘటనపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. తన నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన హోంమంత్రి.. ఇప్పుడు ఉద్యమ నేత అప్పలరాజుని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన ఆయన... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ బనాయిస్తారా? అని నిలదీశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తల్లా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించిన కన్నబాబు.. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే...
● వైయస్ఆర్‌సీపీ పై తప్పుడు ప్రచారం...
గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిక్కుతోచని స్ధితిలో పడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారెకి అపఖ్యాతి తెచ్చిపెట్టే పనిలో పడిందని, ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్రదర్శించడంలో తెలుగు దేశం పార్టీకి ఓ పేటెంట్ ఉందని వైయస్ఆర్‌సీపీమాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఎప్పుడూ నేరుగా రాజకీయాలు చేయకుండా, తప్పు చేస్తే ఇది తప్పు అని సరిదిద్దుకోకుండా ఎదుటివాళ్ల మీద బురదజల్లడం, ఆ బురద వాళ్లు కడుక్కునేలోపు మనం పునీతులు అని ఫోజులు కొట్టడం ఈజీ అనే ఓ సిద్దాంతాన్ని నమ్ముకుని ఈ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు.
నిన్న, ఈరోజు రాష్ట్రంలో ఓ పెద్ద ప్రచారానికి తెరదీశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వైయస్ఆర్‌సీపీ అంటే ఓ రౌడీయిజాన్ని ప్రోత్సహించే పార్టీగా, అరాచకానికి ఆస్కారం ఇచ్చే పార్టీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి బ్రాండింగ్ మాటున పబ్బం గడుపుతునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఓ పెద్ద ఉద్యమం జరుగుతోంది. కోటి సంతకాల సేకరణ చేసి, వాడవాడలా ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడే సరికి వారికి ఊపిరిసలపని పరిస్ధితి వచ్చింది. ప్రైవేటీకరణకు అనుగుణంగా మెడికల్ కాలేజీలకు ఒక్క టెండర్ కూడా వేయలేదు. ఒక్క కాలేజీకి మాత్రం కిమ్స్ ఆస్పత్రి టెండర్ వేసిందని వారికి మద్దతిచ్చే పత్రికలో రాశారు. ఆ తర్వాత కిమ్స్ తాము టెండర్లు వేయలేదని ఖండిస్తే, కిమ్స్ కాదు అందులో పనిచేసే డాక్టర్ ఆ టెండర్ వేశారని వివరణలు ఇచ్చుకున్నారు.
● రాజధాని రైతు మృతికి బాధ్యత ప్రభుత్వానిదే...
వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం ఊరూవాడా ఓ పండగలా జరిగింది. సాధారణంగా వైఎస్సార్సీ నేతలు సేవా కార్యక్రమాలు, రక్తదానాలు చేస్తుంటాం. వీటితో పాటు ఈసారి అనూహ్యంగా ప్రతీ గ్రామంలో, ప్రతీ ప్రాంతంలో పెద్ద ఎత్తున స్వచ్చందంగా పెద్ద ఎత్తున వైయస్ జగన్ మోహన్ రెడ్డిపుట్టినరోజు కార్యక్రమాలు జరిగాయి. అవి ఎంతలా అంటే వారి ఇళ్లలో కూడా లేనంత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇదంతా చంద్రబాబు సర్కార్ కు కంటగింపుగా మారినట్లుంది. ఈ రెండు సంఘటనలకే వాళ్ల కడుపు మండిపోతుంటే అమరావతిలో ఓ హృదయవిదారక ఘటన జరిగింది. చంద్రబాబు చాలా గొప్పగా చెప్పుకునే అమరావతి రైతుల వేదనకు, బాధకు సాక్షంగా ఓ ఘటన జరిగింది. మొదటి విడత భూములిచ్చిన రైతులకూ న్యాయం చేయకుండా వారికి వాగుల్లో, చెరువుల్లో ప్లాట్లు ఇచ్చారు. వాటిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సాక్ష్యాత్తు మున్సిపల్ శాఖ మంత్రి ముందే ఆవేదన వ్యక్తం చేసి ఓ రైతు చనిపోయిన ఘటన చూశాం. దీనిపై ప్రభుత్వంలో మంత్రులు, బాధ్యత కలిగిన వారి నుంచి కనీస స్పందన లేదు. తప్పు చేశామన్న బాధ కూడా వారిలో లేదు. ఈ ఘటనకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. మంత్రి నారాయణ ముందే ఆవేదన చెందుతూ రైతు చనిపోయాడు. ఇలాంటి సంఘటన పట్ల కూడా వీళ్లు చలించలేదు. ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి.
● శాంతిభద్రతల్ని గాలికొదిలేసిన హోంమంత్రి
ఇవే కాదు వారం, పది రోజుల నుంచి ఈ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో ఉందనే విషయం అర్దమవుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు, రోడ్లు మీద గోతులు పూడ్చే పరిస్ధితి లేదు, ఏ కార్యక్రమం ముందుకు సాగట్లేదు. పబ్లిసిటీ తప్ప ఇంకేం చేసుకోలేకపోతున్నారు. ఈ టైంలో గొప్ప అవకాశం దొరికినట్లుగా హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యువత అక్కడ పొట్టేళ్లను నరికి ఫ్లెక్సీల ముందు కార్యక్రమాలు నిర్వహించినట్లు చూశాం. ఇది మహాపరాధం, మహాఘోరం, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరుగుతాయా?, జరిగితే ఖండించని జగన్ మనిషేనా ? అని హోంమంత్రి మాట్లాడుతున్నారు. అనిత పిడుగుకూ, బియ్యానికీ ఒకే మంత్రం జపిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ( ఈ సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణ పుట్టినరోజుల సందర్భంగా రాయలసీమలో పొట్టేళ్ల తలలు నరికి, పొట్టేళ్ల తలలతో దండలు కట్టి ఫ్లెక్సీలకు తగిలించిన వీడియోల్ని కన్నబాబు ప్రెస్ మీట్ లో చూపించారు.)
● రప్పా రప్పా తప్పయితే సెన్సార్ ఎలా ఆమోదించింది ?
నిన్న పొట్టేలు నరికితే జగన్ నువ్వు మనిషివేనా అని హోంమంత్రి అనిత ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న చంద్రబాబుకూ వర్తిస్తుందా? లేదా? అనేది ఆమె చెప్పాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా క్షీణించిపోయాయో ఈ మధ్య ఓ ఛానల్లో కూడా చెప్పారు. వీటన్నింటినీ కప్పి పుచ్చడం కోసం హోంమంత్రి మీడియా ముందుకు వచ్చి తల్లితండ్రులు మీ పిల్లల్ని ఇలాంటి పార్టీలకు పంపొద్దని అప్పీల్ చేస్తున్నారు. మీ పార్టీ చేస్తే తప్పులేదు?, అదే పొరుగు పార్టీ చేస్తే మహాపరాధం, మహానేరం. మీకు ఆడిందే ఆట, పాడిందే పాటగా చెల్లుబాటు అయిపోతోంది. ఎందుకంటే మీకు జాకీలు వేసి లేపే మీడియా మీ చేతుల్లో ఉంది. ఎదుటి వాల్లు మంచి చేస్తే తప్పని చూపిస్తారు, విష సంస్కృతి అని ఎడిటోరియల్స్ కూడా రాస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అరాచక పార్టీ అని ముద్ర వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయడం మొదలుపెట్టారని అర్దమవుతోంది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య పుష్పా సినిమాలో రప్పా.. రప్పా అనే డైలాగ్ పాపులర్ అయింది. అది ఎక్కడైనా ఫ్లెక్సీ మీద వేసినా, పిల్లలు రప్పా రప్పా అన్నా వారిని స్టేషన్లకు తీసుకెళ్లడం, కేసులు పెట్టడం, వేధించడం చేస్తున్నారు. రప్పా రప్పా అనేది తప్పయితే సెన్సార్ దాన్ని ఎలా ఆమోదించింది ? ఈ రోజు ఈ పదాలు వాడమని పార్టీ పరంగా ఎవరూ చెప్పరు. మేం కూడా చెప్పం. సినిమా డైలాగులు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే అది కూడా తప్పని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
● ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే పీడీ యాక్టు- అరెస్టులా?
తప్పులన్నీ మీరు చేస్తారు, పాపాలన్నీ మీరు చేస్తారు, అమరావతిలో రైతు కూడా మీరు చేసిన పాపానికి గుండె పగిలి చనిపోయే పరిస్ధితి వచ్చింది. అయినావైయస్ఆర్‌సీపీని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం వల్ల అనిత గారికి వచ్చిన ప్రయోజనం ఇదేనా?, హోంమంత్రి నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా ఓ ఉద్యమం చేస్తుంటే, అక్కడ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అప్పలరాజు అనే కమ్యూనిస్టు నాయకుడిని పీడి యాక్ట్ పెట్టి అరెస్టు చేశారు. ఈ రాష్ట్రంలో కార్పోరేట్ విధానాలకు తప్ప, పేదల గురించి గొంతెత్తే వారి గురించి ఆలోచించం, వారిని కచ్చితంగా అణచివేస్తాం అనే సంకేతాలు ఇస్తున్నారు. పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టి, వారిని రెండు కిలోమీటర్లు రోడ్డు మీద నడిపించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఇదీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి.. ఇవన్నీ వదిలేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజుకు కేక్ కట్ చేశారని, మేక కట్ చేశారని చెప్పుకుని బతికేద్దాం అనుకుంటున్నారు.
● ఎల్లో మీడియా సాయంతో బురదజల్లే యత్నం
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో టీడీపీ నేతలు చేసిన రక్తతర్పణాలకు ఎవరైనా కేసులు పెట్టారా?, టీడీపీ అరాచక పార్టీ అని అప్పటి ప్రభుత్వ పెద్దలు మాట్లాడారా ?, ఎందుకీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హోంమంత్రి నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా హామీలిచ్చి ఎన్నయినా మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టు వద్దంటే కమ్యూనిస్టు నేతల్ని అరెస్టు చేస్తారు. బల్క్ డ్రగ్ పార్క్ ను గతంలో వ్యతిరేకించమని చెప్పింది ఎవరు?, ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వారిని ఎలా అరెస్టు చేస్తారు?, నిన్న అమరావతిలో రైతు కుప్పకూలిపోయి చనిపోయిన ఘటనపై ఎందుకు స్పందించలేదు? గతంలో మీరు వస్తే అమరావతి బంగారం అయిపోతుందని అబద్దాలు చెప్పిన వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారు?. రైతు మరణంపై కచ్చితంగా ఎఫ్ఐఆర్ వేయాల్సిందే. మీ ఇష్టానుసారం అధికారం ఉంది, రాసే పత్రికలు ఉన్నాయి, చూపించే ఛానల్స్ ఉన్నాయని మా మీద బురదజల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు అర్దం చేసుకోలేని పరిస్ధితుల్లో ఉన్నారని అనుకోకండి.
● పోలీసులు చట్ట పరిధిలో పనిచేయాలి
ప్రభుత్వం కనీస బాధ్యత వహించట్లేదు. వైయస్.జగన్ హయాంలోనే గంజాయి దొరికింది, ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదని హోంమంత్రి చెప్తున్నారు. కానీ ఇప్పుడు గ్రామాలకు వెళ్తే గంజాయి, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా మహిళలు పోరాటాలు చేస్తున్నారు. అబద్దాలు చెప్పి హెడ్ లైన్స్ లో వస్తే చాలని అనుకుంటున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజుకు జరిగింది సైకోయిజం అయితే మీరు చేసింది ఏ ఇజం అవుతుంది. రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి, ఇంకా చాలా పేజీలున్నాయని లోకేష్ చెప్తున్నారు. మీ బెదిరింపులకు బెదిరిపోతారనేది మీ ఉద్దేశం. పోలీసుల్ని ఇంత విచ్చలవిడిగా వాడుతున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. వారం క్రితం ఓ పరామర్శకు వెళ్తే ఓ పోలీసు అధికారి కనిపిస్తే మీరు ఎక్కడున్నారని అడిగితే రెడ్ బుక్ లో ఉన్నానని చెప్పారు. పోస్టింగ్ అని అడిగితే ఇవ్వరంట, జీతం కూడా రావట్లేదని చెప్పారు. అంటే వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన అధికారులంతా మీకు శత్రువులు. పోలీసులు ఇప్పటికైనా సంయమనం పాటించాలి. మీరు పెట్టుకున్న స్టార్స్ కు విలువ ఇచ్చి చట్టానికి అనుగుణంగా పని చేయాలి కానీ ప్రైవేటు సైన్యంలా కాదు. నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘటనపై పోలీసుల్ని మా నాయకులు ప్రశ్నిస్తే పై నుంచి ఒత్తిడి ఉందని చెప్తున్నారు. మీరు ఇలాగే పనిచేస్తే మా న్యాయవిభాగం కూడా అలాగే స్పందిస్తుంది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అధికారులు గుర్తుపెట్టుకోవాలి. మాకేదో బ్రాండింగ్ వేద్దామంటే అమాయకత్వమే అవుతుంది.
ఎన్నికల ముందు అమరావతిలో ఒలింపిక్స్ అంటారు, ఎన్నికల తర్వాత ఆవకాయ్ అంటున్నారు. కాసేపు ఏఐ, కాసేపు క్వాంటం అంటారు. ఎకరం 99 పైసలకే ఇచ్చేసారు, మీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా జరుగుతోంది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు బ్రహ్మాండంగా జరిగింది. కోటి సంతకాల సేకరణ అద్భుతంగా జరిగింది. ప్రజల నిరసన చాలా గట్టిగా వ్యక్తమైంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని, దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి మమ్మల్ని అరాచకవాదులుగా ముద్ర వేయాలని మీరు చేస్తున్న ప్రయత్నం బూమరాంగ్ అవ్వడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.