ల‌డ్డూ మాటున పాల‌నా వైఫ‌ల్యాలు దాచిపెట్టే కుట్ర 

8 Feb, 2026 18:43 IST

కాకినాడ‌: అధికారంలోకి వ‌చ్చిన 20 నెల‌లుగా ప్ర‌జ‌ల‌కిచ్చిన ఏ హ‌మీని అమ‌లు చేయ‌కుండా పాల‌న గాలికొదిలేసిన చంద్ర‌బాబు పాల‌న‌లో తీవ్రంగా వైఫ‌ల్యం చెంది.. ఆ వైఫ‌ల్యాల గురించి మాట్లాడుతుంటే ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా తిరుమ‌ల ల‌డ్డూ పేరుతో కుట్ర‌లు చేస్తున్నాడ‌ని పార్టీ ఉత్తరాంధ్ర రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్, మాజీ మంత్రి కుర‌సాల క‌న్నబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాకినాడ‌లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాజ‌కీయ ల‌బ్ధి కోసం ల‌డ్డూ పేరుతో రాజ‌కీయాలు చేస్తూ తిరుమ‌ల శ్రీవారి పవిత్ర‌త‌ను, హిందూ ధ‌ర్మాన్ని కించ‌ప‌రుస్తున్నాడ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కూట‌మి పార్టీల‌న్నీ ఒక్క‌టైనా ఒకే ఒక్క వైయ‌స్ జ‌గ‌న్‌ని రాజ‌కీయంగా ఎదుర్కోవ‌డం చేత‌కాక గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వ‌ర‌కు ల‌డ్డూ పేరుతో దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టార‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని హ‌న‌నం చేసే కుట్రలో నిమ‌గ్న‌మైన చంద్ర‌బాబు సుప్రీంకోర్టు ఆదేశాల‌ను సైతం ధిక్క‌రిస్తున్నాడ‌ని స్ప‌ష్టం చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌ర‌ఫ‌రా చేసిన నెయ్యి శాంపిల్స్ నే క‌ల్తీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తున్నాడ‌ని మాజీ మంత్రి క‌న్నబాబు గుర్తు చేశారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే.. 

● పాల‌నా వైఫ‌ల్యాలు బ‌య‌ట‌ ప‌డుతుంటే ల‌డ్డూ పేరుతో కుట్ర‌లు

20 నెల‌లుగా ప‌రిపాల‌న గాలికొదిలేసిన చంద్ర‌బాబు, త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను ప్రశ్నిస్తుంటే ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ఆర్‌సీపీమీద బుర‌ద‌జ‌ల్లే కార్యక్ర‌మాల‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుట్టాడు. అందులో భాగంగానే తిరుమ‌ల ల‌డ్డూ అంశాన్ని తెర‌పైకి తెచ్చి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నాడు. క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామిని కూడా వ‌ద‌ల‌కుండా త‌న రాజ‌కీయ ప్ర‌చారం కోసం వాడుకుంటూ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వ‌రకు ఆల‌య ప్ర‌తిష్ట‌పై నీలినీడ‌లు క‌మ్ముకునేలా దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టాడు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకే ఈవీఎంలపై అనుమానాలు రావ‌డం, వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాల‌ని కోర్టుల్లో కేసులు దాఖ‌లు కావ‌డంతో చంద్ర‌బాబు తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీకి వాడిన నెయ్యిని జంతువుల కొవ్వు, చేప‌ల నూనెతో త‌యారు చేశారంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టారు. నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌న‌డానికి ఎలాంటి ఆధారం లేక‌పోయినా వైయ‌స్ఆర్‌సీపీహ‌యాంలోనే జరిగింద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టారు. చివ‌రికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ కూడా జంతువుల కొవ్వు క‌లిసింద‌న‌డానికి ఆధారాలేవీ లేవ‌ని, రాజ‌కీయ ల‌బ్ధికోసమే ప్ర‌చారం జ‌రిగింద‌ని చార్జిషీట్‌లో తేల్చారు. సిట్ నివేదిక త‌న‌కు అనుకూలంగా రాలేద‌నే ఆవేద‌న‌తో, జ‌గ‌న్ మీద బుర‌ద‌జ‌ల్లడానికి చేసిన కుట్ర‌గా తేలిపోవ‌డంతో చంద్ర‌బాబు ఇంకా బ‌రితెగించేశాడు. త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం హిందూ ధ‌ర్మాన్ని బ‌ల‌పెట్టే స్థితికి చంద్ర‌బాబు దిగ‌జారిపోయాడు. 

● ఆ నెయ్యి శాంపిల్స్‌ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక తీసినవే  

కూట‌మి అధికారం లోకి వ‌చ్చాక టీటీడీలో రిజెక్ట్ చేసి పంపిన నెయ్యి ట్యాంక‌ర్లు దొడ్డి దారిన మ‌ళ్లీ వ‌చ్చాయ‌ని, వాటినే ల‌డ్డూ త‌యారీకి వాడార‌ని సిట్ త‌న నివేదిక‌లో స్ప‌ష్టంగా చెప్పింది. క‌ల్తీ నెయ్యి స‌ర‌ఫ‌రా చేశార‌ని చంద్ర‌బాబు ఆరోపిస్తున్న బోలేబాబా డెయిరీకి కూడా 2018లో అనుమ‌తులిచ్చింది చంద్ర‌బాబే. నువ్వుల నూనె క‌న్నా తక్కువ ధ‌రకే నెయ్యి ఎలా దొరుకుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్న కూట‌మి నాయ‌కులు.. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో వైయ‌స్ఆర్‌సీపీహ‌యాంలో క‌న్నా త‌క్కువ ధ‌రకే నెయ్యి సప్లై జ‌రిగింది క‌దా. జంతువుల కొవ్వు , పంది కొవ్వు, చేప‌ల నూనెతో త‌యారు చేసిన ల‌క్ష ల‌డ్డూల‌ను అయోధ్య ఆల‌య ప్రారంభోత్స‌వానికి కూడా పంపించార‌ని ప్ర‌చారం చేశారు. ఆ నెయ్యిని టీటీడీ బోర్డు మెంబ‌ర్ సౌరభ్ బోరా, మ‌రో మాజీ బోర్డు మెంబ‌ర్ రామేశ్వ‌ర‌రావు పంపితే దానికీ టీటీడీకి ఏంటి సంబంధం?  త‌ప్పుల‌న్నీ చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగితే దానికి వైయ‌స్ఆర్‌సీపీని నిందిస్తూ ప్ర‌చారం చేస్తున్నాడు. తాను త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టే టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు ఆశ్ర‌యించి సీబీఐ విచార‌ణ కోరారు. సీబీఐ విచార‌ణ చేసి రిపోర్టు ఇచ్చేలోపు అబ‌ద్ధాల‌తో త‌ప్పుడు ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఇంత‌క‌న్నా దారుణం ఇంకోటి ఉంటుందా?  కోట్లాది మంది పూజించే క‌లియుగ‌దైవాన్ని అవ‌మానించ‌డం కాదా? 

● హిందూ ధ‌ర్మంపై చంద్ర‌బాబు దాడి 

తాను చేసిన త‌ప్పుడు ఆరోప‌ణ‌లు నిరూపించ‌లేక సిట్ చార్జిషీట్‌తో అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు.. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బీజేపీని తోడు తెచ్చుకుంటున్నాడు. బీజేపీ భుజాల మీద తుపాకీ పెట్టి వైయ‌స్ఆర్‌సీపీని కాల్చాల‌ని కుట్ర‌లు చేస్తున్నాడు. అందులో భాగంగానే బాత్రూమ్‌లు క‌డిగే ర‌సాయ‌నాలు ల‌డ్డూ త‌యారీలో వాడార‌ని ప్ర‌చారం మొద‌లుపెట్టాడు. వైయ‌స్ జ‌గ‌న్‌ని కించ‌ప‌ర‌చాల‌నే దురుద్దేశంతో పవిత్ర‌మైన ల‌డ్డూపై కుట్ర‌లు చేస్తున్నాడు. చంద్ర‌బాబుకి చెందిన హెరిటేజ్ పెరుగు మంచిది కాద‌ని బ్యాన్ చేస్తుంటే ఆ విష‌యాన్ని దాచి పెట్టి ల‌డ్డూ విష‌యంలో జ‌ర‌గ‌ని క‌ల్తీ జ‌రిగిన‌ట్టు ప్ర‌చారం చేయ‌డం దుర్మార్గం కాదా? అడ్డ‌గోలు అబ‌ద్ధాల‌తో హిందూ ధ‌ర్మాన్ని చంద్ర‌బాబు ఏం చేయాల‌నుకుంటున్నాడు?  వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు ఎంత‌గానో కృషి చేశారు. 3వేల కొత్త ఆల‌యాల నిర్మాణం జ‌రిగింది. ముంబై, కాశ్మీర్‌, అమ‌రావ‌తి, విశాఖ‌ప‌ట్నంలో శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాల‌ను వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలోనే నిర్మించ‌డం జ‌రిగింది. తిరుమ‌ల రెండు కొండ‌ల‌ను ఏడు కొండ‌లుగా పేర్కొంటూ వైయ‌స్సార్ జీవో ఇచ్చారు. తిరుమ‌ల‌లో అన్య‌మ‌త ప్ర‌చారాన్ని నిషేధిస్తూ ఆయ‌నే జీవో ఇచ్చారు. దాన్ని కూడా చంద్ర‌బాబు వ‌క్రీక‌రించ‌డం సిగ్గుచేటు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన 20 నెల‌ల్లో హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించే కార్య‌క్ర‌మాలు చేయ‌క‌పోగా ఆల‌యాల‌ను విధ్వంసం చేస్తున్నారు. 

● క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌మంటే మాపై దాడులా? 

చేసిన త‌ప్పుకి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను డిమాండ్ చేస్తుంటే వైయ‌స్ఆర్‌సీపీనాయ‌కుల‌ను బూతులు తిడుతున్నారు. ఇళ్ల‌పై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్ల‌తో దాడులు చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ మీద దుష్ప్ర‌చారం చేస్తూ త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా వాటికి పోలీసుల‌ను కాప‌లాగా పెట్టారు. మాజీ మంత్రులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్‌ల ఇళ్ల‌ల్లో దూరి విధ్వంసం చేశారు. పోలీసుల స‌మ‌క్షంలోనే కాపు నాయ‌కుడు అంబ‌టి రాంబాబును ఏకంగా హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఎమ్మెల్యే, ఆమె భ‌ర్త స్వ‌యంగా దాడుల్లో పాల్గొన‌డ‌మే కాకుండా దాడులు చేయ‌డానికే వ‌చ్చామని, మ‌ళ్లీ మ‌ళ్లీ దాడులు చేస్తామంటూ మీడియాలోనే హెచ్చ‌రిస్తున్నారు. కూట‌మి నాయ‌కులు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని రావ‌ణ‌కాష్టంలా మార్చేశారు. వారే దాడులు చేసి వారే కేసులు పెట్టి, మా నాయ‌కుల‌ను అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్‌ని తీసుకొచ్చారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డం చేత‌కాక అధికారం చేతిలో ఉంద‌నే అహంకారంతో ఆట‌విక రాజ్యాన్ని సృష్టించారు. త‌మ‌కు అనుకూలంగా మాట్లాడిన మాజీ అధికారులు, మీడియా ప్ర‌ముఖుల వార్త‌ల‌ను ప్ర‌ముఖంగా మొద‌టి పేజీ బ్యాన‌ర్ వార్త‌లుగా అచ్చేయ‌డం, త‌మ‌కు గిట్ట‌ని వారి మీద విషం క‌క్క‌డం త‌ప్ప ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియ‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఆధారాల‌తో స‌హా ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెబుతున్నందుకు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు పంపిస్తున్నారు. 

● జ‌గ‌న్ ఒక్క‌డిని ఎదుర్కోలేకనే ఈ కుట్ర‌లు

కూట‌మి క‌లిసున్నా, అధికారం చెలాయిస్తున్నా.. రాజ‌కీయంగా ఒక్క జ‌గ‌న్‌ని ఎదుర్కోలేక‌పోతున్నారు. ఆ ఒక్క జ‌గ‌న్‌ని ఎదుర్కోవ‌డానికి  ఇన్ని కుట్ర‌లా? ఆయ‌న్ను ఎదుర్కోలేక‌నే కూట‌మి పార్టీల‌న్నీ క‌లిసుంటున్నాయి. ఆయ‌న వ్య‌క్తిత్వం మీద బుర‌ద‌జ‌ల్లి రాజ‌కీయ‌ల‌బ్ధి పొందాల‌న్న కుట్ర త‌ప్పించి ఆయ‌న క‌న్నా గొప్ప పాల‌న చేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాల‌న్న ప్ర‌య‌త్నం చేయడం లేదు. అధికారంలోకి వ‌చ్చిన 20 నెల‌ల్లో ఏ ఒక్క ఎన్నిక‌ల హామీని కూడా అమ‌లు చేయ‌లేదు. దొడ్డిదారి దోపిడీతో విశాఖ భూముల‌ను దోచుకుతింటున్నారు. లోకేష్ తోడ‌ల్లుడు విశాఖ ఎంపీ భ‌ర‌త్‌కి ఏకంగా రూ. 5 వేల కోట్లు విలువైన 55 ఎక‌రాలు అడ్డ‌దారిలో క‌ట్ట‌బెట్టేస్తున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు పెడుతున్న చంద్ర‌బాబు, ఆయ‌న అవినీతి మీద ఆధారాల‌తో స‌హా సీఐడీ న‌మోదు చేసిన కేసుల‌ను అధికారం అండ‌తో మూసేయిస్తున్నాడు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉండి ఎక్క‌డా నిజాయితీగా ప‌నిచేయ‌డం లేదు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చ‌నేలా నియంత పాల‌న సాగిస్తున్నాడు. పోలీసులు సైతం టీడీపీ కార్య‌కర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.