అన్యాయంగా జైల్లో పెట్టారు.. ఐ డోంట్ కేర్‌

18 Feb, 2026 18:12 IST

 రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: అక్రమ కేసులో అరెస్టై 18 రోజుల పాటు జైలులో గడిపిన వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు బెయిల్‌పై రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైల్ నుంచి విడుదలయ్యారు. ఆయ‌న‌కు పార్టీ నేత‌లు మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, తానేటి వ‌నిత‌, మాజీ ఎమ్మెల్యేలు జ‌క్కంపూడి రాజా, చీర్ల జ‌గ్గిరెడ్డి, మాజీ ఎంపీ వంగా గీతా, పార్టీ నాయ‌కులు వ‌డ్డీ ర‌ఘురామ్‌, త‌దిత‌రులు జైలు వ‌ద్ద స్వాగ‌తం ప‌లికారు.  జైల్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షసాధింపే అని ఆరోపించారు. తన ఇంటిపై దాడులు, కుటుంబ సభ్యులపై బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం జరిగినప్పటికీ తనను జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. “అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు… ఐ డోంట్ కేర్‌” అంటూ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడే వ్యక్తిని కాదని, ఈ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

మీడియాతో అంబ‌టి రాంబాబు ఇంకా ఏమ‌న్నారంటే..: 

ఐ డోంట్ కేర్‌
జైల్‌కు వెళ్లేటప్పుడు సంతోషమే… వచ్చేటప్పుడు సంతోషమే. 18 రోజులు సెంట్రల్ జైలులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పోలీసులు, కూటమి నేతలు కలిసి చేసిన ప్రయత్నం. 18 రోజులు జైల్లో పెట్టితే భయపడతానని అనుకున్నారేమో గానీ, తనకు భయం లేదు.  “నా ఇంటిపై దాడి చేశారు. నన్ను హింసించారు. నా భార్య, పిల్లలను తరిమారు. నా కార్లను ధ్వంసం చేశారు. ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారు. బాధితుణ్ని లోపల పెట్టారు… నిందితుణ్ని వదిలారు. ఐ డోంట్ కేర్. పార్టీలకు అతీతంగా ఈ దాడిని ఖండించిన వారందరికీ కృతజ్ఞతలు.

టైమ్ విల్ డిసైడ్
ఎన్ని కేసులు పెట్టినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను. ఈ పోరాటం ఆగదు. జైలు జీవితం నాకు కొత్త కాదు. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ పట్టుదల పెంచే శిక్షణ కేంద్రం లాంటిది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డాను. చంద్రబాబు, లోకేష్ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితులు మారుతాయి… పాపానికి పరిహారం చేయక తప్పదు. టైమ్ విల్ డిసైడ్ . దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ వచ్చింది, దాడికి గురైన తనకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది.

ప్రాణం ఉన్నంత వ‌ర‌కు వైయ‌స్ జ‌గ‌న్ వెన‌కే..
తాను రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. జైల్లో పెడితే భయపడే వ్యక్తిని కాదు.  ఎక్కడా తప్పు చేయలేదు. తప్పు జరిగితే వెంటనే పశ్చాత్తాపపడతాను. గుండెలో ప్రాణం ఉన్నంతవరకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి వెనకే ఉంటా. మొత్తం ఘటనపై ప్రజల ముందుకు పూర్తి వివరాలు తీసుకువస్తా, పత్రికల్లో వచ్చిన ప్రతి అంశంపై సమాధానం చెబుతా. “దేవుడున్నాడు… ధర్మమే గెలుస్తుంది” అంటూ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ధీమా వ్య‌క్తం చేశారు.
 

అంబటి రాంబాబు విడుదలపై వైయ‌స్ఆర్‌సీపీ నేతల స్పందన

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుకు స్వాగ‌తం ప‌లికిన అనంత‌రం  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు  మీడియాతో త‌మ‌ అభిప్రాయాలను వెల్లడించారు.

- జక్కంపూడి రాజా, వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు

 “అంబటి రాంబాబు తప్పు చేయలేదు కాబట్టే ఆయనకు ఆత్మవిశ్వాసం ఉంది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అక్రమ కేసులను, దాడులను లెక్కచేయరు. వైయస్ జగన్ నాయకత్వంలో ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాం,” అని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు.

- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి

“ప్రశ్నించినందుకు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి, ఆయన్ను జైల్లో పెట్టారు. కక్షసాధించుకోవడానికే తనకు అధికారం ఇచ్చారని చంద్రబాబు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. ‘నా వైపు న్యాయం ఉంది… వెనక్కి తగ్గేది లేదు’ అని అంబటి స్పష్టంగా చెప్పారు. ఆయన కుటుంబాన్ని కూడా హింసించారు. తిడితే జైలు… దాడి చేసిన వారికి బెయిల్ అనేది రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితి,” అని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.

- తానేటి వనిత, మాజీ హోంమంత్రి

“వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కక్షసాధించడం తప్ప ఈ ప్ర‌భుత్వం ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పినా ఆయన ఇంటిని ముట్టడి చేసి దారుణంగా ధ్వంసం చేశారు. మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేశారు. అటువంటి వారిపై ఎటువంటి చర్యలు లేవు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అధికారం, అహంకారంతో ఏదైనా చెల్లుతుందని అనుకుంటున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గరపడింది,” అని అన్నారు.

- వడ్డే రఘురాం, తాడేపల్లిగూడెం కో-ఆర్డినేటర్

“ఆ రోజున అంబ‌టి రాంబాబును కావాలని ఉద్రేకపరిచారు. ఆ మాట నేను అనకుండా ఉండవలసింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినా దానిని పెద్దది చేసి రాజకీయంగా వేధించారు,” అని పేర్కొన్నారు.

- వంగా గీత, పీఏసీ సభ్యురాలు 

“చాలా అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఏ విధమైన లా అండ్ ఆర్డర్ నడుస్తుందో అందరికీ అర్థమైంది. సామాన్య ప్రజలకు రక్షణ ఏముంటుంది? అంబటి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారు. శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అంబటిని కలుసుకునేందుకు వచ్చిన వారిని సైతం పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని అంబటి మాట్లాడటం ఆయన ధైర్యానికి అద్దం పడుతుంది,” అని వంగా గీతా వ్యాఖ్యానించారు.