గుప్త నిధుల కోసం ఆలయాన్నే కబ్జా చేయడం దుర్మార్గం
అనంతపురం: గుప్త నిధుల కోసం ఆలయాన్నే కబ్జా చేయడం దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శింగనమల శ్రీ దుర్గాంజనేయస్వామి ఆలయ పూజారి రమణాచారిని గెంటివేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయం కోసం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రమణాచారి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రమణాచారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ, గుప్త నిధుల పేరుతో దేవాలయాన్నే కబ్జా చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. దశాబ్దాలుగా ఆలయ రక్షకుడిగా సేవలందిస్తున్న రమణాచారిని అక్రమంగా గెంటివేయడం ఘోరమైన అపచారమని వ్యాఖ్యానించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతల అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. దేవాలయాలను కూడా వదలకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కబ్జా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల విశ్వాసాలకు కేంద్రబిందువైన దేవాలయాలపై ఇలాంటి దాడులు సహించబోమని స్పష్టం చేశారు. రమణాచారి పై జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే నిలిపివేయాలని, ఆలయానికి సంబంధించిన హక్కులను ఆయనకే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌సీపీ పార్టీ తరఫున నిరంతర పోరాటం చేస్తామని మాజీ మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు.