జీవో 590 రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు
చిత్తూరు: మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో 590 రద్దు చేసే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి ఆర్కే రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం నగరిలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా, భూమన మాట్లాడుతూ..`పేద విద్యార్థులు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని పరిస్థితి . పేద ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేని పరిస్థితి. అనుభవం ఉంది..విస్తారకుల కట్ట ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారు. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. వైయస్ జగన్ తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం 17 మెడికల్ కాలేజ్ కి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లొకేష్ ప్రవేట్ విమానాల్లో తిరిగేందుకు డబ్బులు ఉన్నాయి కానీ, మెడికల్ కాలేజీల నిర్మాణానికి లేవా? . మెడికల్ కాలేజీల పరిరక్షణకు వైయస్ జగన్ నేతృత్వంలో ప్రజాఉద్యమం కొనసాగుతుంది` అని హెచ్చరించారు.