వైయస్ జగన్ హయాంలో ఆలయాలకు పెద్దపీట..
అన్నమయ్య జిల్లా: సంబేపల్లె మండలం శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో నూతనంగా నిర్మించిన కొండలరాయుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ కృపాకటాక్షాలు లభించాలని ప్రార్థించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేయించడంలో శ్రీకాంత్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు.
శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం కాలంలో సంబేపల్లె మండలంలోనే రూ.7.26 కోట్లతో ఆలయాల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. సిజిఎఫ్ నిధుల ద్వారా శెట్టిపల్లె తిమ్మక్కగారిపల్లెలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు, దేవపట్లలో దేవపట్లమ్మ ఆలయానికి రూ.1.05 కోట్లు, సంబేపల్లెలో నల్లగంగమ్మ ఆలయానికి రూ.1.18 కోట్లు, పెద్దబిడికి మారెమ్మ ఆలయ ప్రహరీకి రూ.26 లక్షలు, రామాలయానికి రూ.25 లక్షలు, గుహేశ్వరి పశుపతినాథ ఆలయానికి రూ.1.22 కోట్లు కేటాయించామని వివరించారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మండలంలోని 15 ఆలయాలకు రూ.1.60 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, భగవంతుడి కృపతో ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తితోనే ఆధ్యాత్మిక ప్రశాంతత సాధ్యమని అన్నారు.
పూజా కార్యక్రమాలకు విచ్చేసిన భక్తులతో నాయకులు ఆత్మీయంగా మమేకమై, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు గొర్ల ఉపేంద్ర రెడ్డి, రమేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి మరియు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ఆవుల విష్ణు వర్ధన్ రెడ్డి, పుంగనూరు నాయకులు శ్రీనాథ్ రెడ్డి, అనూష రెడ్డి, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.