రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో మరణమృదంగం

3 Jan, 2026 19:47 IST

తాడేపల్లి : 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటితో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఆహారం, తాగునీరు కలుషితం కావడం వల్లే పిల్లల వరుస మరణాలు సంభవిస్తున్నా.. ప్రభుత్వానికి ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలూ  పట్టడం లేదని విమర్శించారు. వైయస్.జగన్ హయాంలో జీవో 46తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పడితే.. కేవలం అక్కసుతోనే ఆ జీవోను నిలిపివేసి చంద్రబాబు... పేద పిల్లల ఉసురు తీస్తున్నారని స్పష్టం చేేశారు.  దాని ఫలితమే అధ్వాన్న స్దితిలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు అని విడదల రజిని తీవ్రంగా ఆక్షేపించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...

● సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం మొద్దునిద్ర

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,783 సంక్షేమ హాస్టళ్లలో సుమారు ఆరున్నర లక్షల మంది విద్యార్ధులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. వారి హక్కుల్ని కాలరాస్తోంది. విద్యార్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. పారిశుద్ధ్యం కరవై అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఇది పాలనా వైఫల్యం కాదా ?, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. 18 నెలల్లో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం కరవై ఆస్పత్రుల పాలవుతున్నారు. 

● సంక్షేమ హాస్టళ్లలో మరణమృదంగం

ఈ 18 నెలల్లో తిరుపతి జిల్లాలో 139 మంది గురుకుల హాస్టల్ విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో భోజనంలో పురుగులు వచ్చాయి. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ హాస్టల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు జిల్లా ఆత్మకూరులో పిల్లలు విషజ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బాలికల ఆశ్రమ పాఠశాలలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలో 8 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. సత్యసాయి జిల్లా గిరిజన సంక్షేమ పాఠశాలలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఇలా 18 నెలల్లోనే మొత్తం 46 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోనప్పుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుంది. 

● ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు గొలికొదిలిన ప్రభుత్వం..

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధుల మరణాలకు కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి. వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకోకుండా ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అనేది చెప్పాలి. సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదు, బాథ్యత అస్సలే లేదు. ఇది పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, కార్పోరేట్ వాళ్లకు పెట్టే ప్రభుత్వం. పిల్లల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారంటే ఇది ముంచే ప్రభుత్వమని అర్దమవుతోంది. హాస్టళ్ల విషయంలో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్( ఎన్సీపీసీఆర్) కొన్ని మార్గదర్శకాలు ఇస్తోంది. హైకోర్టు కూడా వీటిని అమలు చేయాలని మొట్టికాయలు వేస్తూనే ఉంది. తాగునీరు ఎప్పుడిస్తారని అడుగుతోంది. ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాల ప్రకారం భద్రమైన వాతావరణం కల్పించాలని, క్వాలిఫైడ్, బాధ్యత కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, లివింగ్ కండిషన్స్ ఉండాలని, పౌష్ఠికాహారం ఇవ్వాలని, మందులు అందుబాటులో ఉంచాలని చెబుతోంది. అలాగే విద్యార్ధులకు మానసిక అంశాలపై కౌన్సిలింగ్ కూడా కల్పించాలని చెబుతోంది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. 

● జీవో 46తో సంక్షేమ హాస్టళ్లను ఆదుకున్న వైయస్.జగన్ 

జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉండగా జీవో నంబర్ 46 తెచ్చింది. వీటిలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై అన్ని మార్గదర్శకాలను పొందుపరిచింది. అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ఈ చక్కటి జీవోను తెచ్చింది. ఇందులో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, విద్యార్ధుల భద్రత, ఆహారం, ఇలా ఎన్నో అంశాలున్నాయి. ఇందులో మరో గొప్ప అంశం రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు సంక్షేమ హాస్టళ్లను పరిశీలించి క్షేత్రస్దాయిలో ఇబ్బందుల్ని అక్కడికక్కడే పరిష్కరించాలని జీవోలో చెప్పాం. అందుకే ఇలాంటి ఘటనలు అప్పట్లో జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ జీవో నంబర్ 46ను పూర్తిగా పక్కనబెట్టేశారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఎంత దారుణమైన పాలన చేస్తున్నారో అర్దమవుతోంది. విద్యార్ధుల డైట్ ఛార్జీలు చంద్రబాబు హయాంలో తక్కువగా ఉంటే మా హయాంలో పౌష్టికాహారం ఇవ్వాలని వాటిని సమూలంగా మార్చి చక్కడి డైట్ ప్లాన్ ఇచ్చాం. కానీ ఇప్పుడు హాస్టళ్లలో పిల్లలకు నీళ్ల పప్పు, ఉడకని అన్నం ఇస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డి తెచ్చారనే కారణంతో ఈ జీవోను పక్కనబెట్టేశారు.

● ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయం

రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో  పిల్లలు ఈ భోజనాలు తినలేక ఆకలితో నీరసించిపోతున్నారు. చలి వణికిస్తున్నా కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వలేని పరిస్ధితుల్లో హాస్టళ్లు నడుపుతున్నారు. ప్రశ్నిస్తే వార్డెన్ కొడతారో, ఇంటికి పంపేస్తారనే భయంతో పిల్లలు అలాగే ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రతీ వసతి గృహానికి నిర్వహణ, రిపేర్ల కోసం  20-30 వేలు అత్యవసర నిధులు అందుబాటులో ఉంచే వాళ్లం.  ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. వార్డెన్లు వస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. వైయస్.జగన్ ప్రభుత్వంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకునే వాళ్లం. పిల్లల భవిష్యత్తు, హాస్టళ్లలో పారిశుద్ధం, పౌష్టికాహారం అందించే విషయంలో నిరంతరం సమీక్షలు చేసి ఆదేశాలు ఇచ్చే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేకుండా పోయాయి. అలాగే ఆరోగ్య, వైద్య, సంక్షేమ శాఖల మధ్య సమన్వయం ఉండాలని వైయస్.జగన్ చెప్పేవారు. ఇప్పుడు అలాంటి ఆనవాళ్లు, పర్యవేక్షణ లేదు. 

● వైయస్.జగన్ హయాంలో నాడు-నేడుతో మారిన స్కూళ్లు...

వైయస్.జగన్ హయాంలో నాడు-నేడు  పథకంతో పాఠశాలల రూపురేఖలు మార్చారు. ప్రభుత్వ స్కూల్స్ కు సైతం రికమండేషన్ చేయించుకోవాల్సిన స్థాయికి వాటిని తెచ్చారు. కార్పోరేట్ స్కూల్స్ లా మార్చారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆటస్థలాల్ని అభివృద్ధి చేసి ఇచ్చారు. గోరు ముద్ద పేరుతో మంచి మెనూతో పౌష్టికాహారం అందించారు.  టాయిలెట్ల నిర్వహణ కోసం ఓ నిధి ఏర్పాటు చేసి పూర్తి పారిశుద్ధ్యంగా ఉండేలా చూశారు. ప్రతీ పేద విద్యార్దికీ కార్పోరేట్ స్కూల్ అన్న ఫీలింగ్ తెచ్చారని విడదల రజిని స్పష్టం చేశారు. దీంతో పాటు అంతర్జాతీయ వేదికల మీద పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్ధితి ఉండేదని..  కానీ ఇప్పుడు కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని  ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.