రైతు సాంబశివరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
బాపట్ల: కౌలు రైతు సాంబశివరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాపట్ల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. పర్చూరు మండలం వీరన్న పాలెం మాజీ మంత్రి మేరుగ నాగార్జున పర్యటించారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాంబశివరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడారు. `రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. రైతు సాంబశివరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పొగాకు కొనుగోలుపై అవగాహనా రాహిత్యం కారణంగానే రైతుల ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైంది. ఏపీ లో వ్యవసాయాన్ని నమ్ముకున్న ప్రతి రైతు పూర్తిగా అప్పుల ఊబీలో మునిగి పోయారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ వ్యవసాయాన్ని పండుగ చేశారు. చంద్రబాబు మాత్రం వ్యవసాయం దండుగ అన్న ఆలోచనతో పరిపాలన చేస్తున్నారు. గతంలో రూ18,000, 20 వేల కు కొన్న పొగాకు నేడు కొనే నాధుడే లేక పండించిన పంటను రైతులే తగుల పెడుతున్న పరిస్థితి. వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాం.. రైతులు సుభిక్షంగా ఉన్నారు` అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు.