వైయస్ జగన్ పర్యటనతో ప్రభుత్వంలో వణుకు
విజయవాడ: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు పుట్టిందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత జోగి రమేష్ విమర్శించారు. వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు చివరి నిమిషంలో రూటు మార్చారని ఆయన ఆరోపించారు. అధికారుల ఈ చర్యలు ప్రభుత్వ భయాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. వైయస్ జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో వస్తున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. ప్రజల మద్దతు చూసి ప్రభుత్వం అసహనానికి గురవుతోందని, అందుకే పోలీసులను ఉపయోగించి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పోలీసులు అత్యుత్సాహంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.
తన కుటుంబంపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, పెట్రోల్ బాంబులతో తమ ఇంటిని లక్ష్యంగా చేసుకుని కుటుంబాన్ని మట్టుబెట్టాలని ప్రయత్నించారని జోగి రమేష్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి ఇటువంటి దాడులు చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని జోగి రమేష్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు త్వరలోనే తగిన తీర్పు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని, ఈ మద్దతు రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు నాంది అవుతుందని జోగి రమేష్ అన్నారు.