ఆకలి తీర్చే అన్నదాత కష్టాలు కనిపించడం లేదా?
అనంతపురం: అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి సాకె శైలజనాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదు… చెప్పేవి కొండంత చేసేవి గోరంత” అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వర్షాలు పడుతున్నందుకు సంతోషపడాలో, పంటలు నష్టపోతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో రైతులు నలిగిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు వెంటనే పరిహారం చెల్లించడంతో పాటు తడిసిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గంలోనే దాదాపు 160 ఎకరాల మొక్కజొన్న, 90 ఎకరాల అరటి పంటలు తీవ్రంగా నష్టపోయాయని వివరించారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు ఇలా దెబ్బతినడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రతి నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, గత రెండు సంవత్సరాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగినా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే బాధిత కుటుంబాలకు సహాయం అందించేవారని గుర్తుచేశారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2400గా ఉన్నా, రైతులకు రూ.1600కే కొనుగోలు చేస్తున్న దుస్థితి నెలకొందని తెలిపారు. దీంతో రైతులు తమ పంటలను ఇళ్ల వద్దే నిల్వ చేసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం రైతాంగంపై ముందుచూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, రైతులు నిల్వ ఉంచుకున్న మొక్కజొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పంటను బట్టి ఎకరాకు కనీసం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు తక్షణ సాయం అందించాలన్నారు. ఇది జరగని పక్షంలో రైతుల పక్షాన పోరాటానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని స్పష్టం చేశారు. డాక్టర్ సాకే శైలజనాథ్ సూచన మేరకు గార్లదిన్నె, సింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు మండలాల్లో పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం రెడ్డి 5000 అరటి మొక్కలు నాటగా, దాదాపు 2000 మొక్కలు నేలకొరిగినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వై. నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వంశీ గోకుల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాపరెడ్డి తదితరులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతుల ఆవేదనను ప్రభుత్వం వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.