నీళ్లున్నా చెరువులు నింపరా?
అనంతపురం: శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం, శింగనమల, పుట్లూరు మండలంలో ఉన్న పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతరపల్లి చెరువులకు సాగు తాగునీరు అందించాలని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురంలోని హెచ్చెల్సీ కార్యాలయంలో ఎస్ఈ సుధాకర్ రావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ..గతంలో కూడా పలుమార్లు ఇదే విషయమై అధికారుల దృష్టికి తీసుకువచ్చామన్నారు. అయినా కూడా అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టెంకాయ కొట్టడం తప్ప.. చెరువులకు నీటిని వదలలేని పరిస్థితుల్లో టీడీపీ నాయకులున్నారన్నారు. అక్రమ, ఇసుక మట్టి తవ్వకాలు అయిపోయే వరకు చెరువులకు నీటిని వదలరా అని ప్రశ్నించారు. ఈ నెల 16వ తేదీలోపు నీటిని వదలకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా హెచ్చెల్సీ ద్వారా, సుబ్బరాయ సాగర్ లో ఉన్న నీటిని చెరువులతో నింపి ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరారు. నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి మేలూ జరగడం లేదన్నారు. ఇప్పటికైనా చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే రాజకీయం అంటున్నారని, రైతుల కోసం, ప్రజల సంక్షేమం కోసం చేసే పోరాటమే రాజకీయం అనిపిస్తే, అదే రాజకీయం చేయడానికి ఎలాంటి తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రజలకు మంచి జరగలేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టీకరించారు. ఈ కార్యక్రమంలో నార్పల సత్యనారాయణ రెడ్డి, గార్లదిన్నె నారాయణరెడ్డి, బొమ్మన శ్రీరామారెడ్డి, గోకుల్ రెడ్డి, మండల కన్వీనర్లు ఎల్లారెడ్డి, పూల ప్రసాద్ శ్రీకాంత్ రెడ్డి, ఖాదరవల్లి మహేశ్వర్ రెడ్డి, శివశంకర్, జడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, చామలూరు రాజగోపాల్, గువ్వల శ్రీకాంత్ రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు నాయక్, నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.