కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జాడే లేదు..
శ్రీకాకుళం జిల్లా: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జాడే లేదని, రైతు పండించిన ఏ పంటకు మద్దతు ధర లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. గార మండలంలోని రామచంద్రాపురంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన మాతృమూర్తి సావిత్రమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు, ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని, రైతులకు కనీస మద్దతు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం రూ.2400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ మార్కెట్లో రూ.1400కే పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదని, ప్రజల ఆరోగ్యం, విద్య, సామాజిక చైతన్యం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామాల్లో పిల్లలు ఆరోగ్యంగా లేకపోవడానికి కల్తీ ఆహారం, పోషకాహార లోపం కారణమని చెప్పారు. తల్లులు చైతన్యంగా ఉండి పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఎరువులు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీస మద్దతు ధర కూడా ఇవ్వకపోతే రైతులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ ధరలు రూ.2000 దాటుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. “ఈ ప్రభుత్వం కళ్లున్నా చూడలేని స్థితిలో ఉంది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రజల సమస్యల కంటే రాజధాని నిర్మాణానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కరోనా సమయంలో గత ప్రభుత్వం ప్రజలను ఎలా ఆదుకుందో అందరూ చూశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా సమానమేనని అన్నారు.
రాబోయే రోజుల్లో ప్రజలు నిజాలు గ్రహించి మంచి నాయకులను ఎన్నుకోవాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే నాయకులను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో అక్రమాలకు తావు ఇవ్వకుండా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని ధర్మాన ప్రసాదరావు సూచించారు.