మొక్కజొన్న రైతును ఆదుకోండి.. 

15 Mar, 2026 09:59 IST

శ్రీకాకుళం: రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. రైతు కష్టాలను అర్థం చేసుకుని ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని ఆయన కోరారు.

శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ వరి పంట తరువాత పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారని ధర్మాన తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న పంట రైతులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటా రూ.2,400 కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ, మార్కెట్లో వ్యాపారులు కేవలం రూ.1,600 నుంచి రూ.1,700కే కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

క్వింటాకు సుమారు రూ.700 తక్కువ ధర రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక ఎకరానికి సుమారు 40 బస్తాలు మొక్కజొన్న పండితే రైతుకు రూ.28 వేల వరకు నష్టం వస్తోందని ధర్మాన వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికీ ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతులకు తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు.

మొక్కజొన్న పంట వేసే సమయంలోనే రైతులకు అవసరమైన యూరియా ఎరువును సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ధర్మాన విమర్శించారు. రైతులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కొంతమంది బలహీన రైతులకు ఎరువు కూడా అందలేదని చెప్పారు. పంట పండించేందుకు అవసరమైన ఎరువులు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం, ఇప్పుడు పండిన పంటకు సరైన ధర కూడా ఇవ్వలేకపోతున్నదని ఆయన మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో మొక్కజొన్న ధరలు తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతులకు మద్దతు ధర కల్పించామని ధర్మాన గుర్తు చేశారు. అదే విధంగా ఇప్పటికీ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా నిధులు విడుదల చేసి మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించాలన్నారు. ఎక్కడైనా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లయితే వెంటనే అడ్డుకుని వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు కలిసి రంగంలోకి దిగితేనే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

రైతులు రక్తం చెమటోడ్చి పండించిన పంటకు కనీస ధర కూడా అందించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరమని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న రైతులకు అండగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.