2024 జనవరిలోనే సమగ్ర కుల గణన పూర్తి చేశాం
రాజమహేంద్రవరం: కేంద్రప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన కులగణనకు ప్రేరణ ఆనాడు ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలేనని మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ జనగణనలోనే కులగణన చేర్చాలని 2021లోనే వైయస్ జగన్ బీహార్ రాష్ట్రం కంటే ముందుగానే ప్రతిపాదించారని వెల్లడించారు. అంతేకాకుండా ఆ మేరకు ఏపీ శాసనసభ, శాసనమండలిలో తీర్మానం చేసి, దానిని కేంద్రానికి కూడా పంపించారని గుర్తు చేశారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలన్న నిర్ణయంను వైయస్ఆర్‌సీపీ స్వాగతిస్తోంది. మనదేశంలో ప్రతి పదేళ్లకోసారి కేంద్రం జనగణన చేయాలని ఆర్టికల్ 246, క్లాజ్ 69 చెబుతోంది. వైయస్ జగన్ పాలనలో 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. వివిధ సామాజికవర్గాల స్థితిగతులు, సమస్యలపై అధ్యయనం చేయడానికి కులగుణన సరైన మార్గమని ఆనాడు వైయస్ జగన్ భావించారు.
సామాజికవేత్తలతో సమావేశాలు
1872లో భారతదేశంలో తొలిసారి జనగణన ప్రారంభమైంది. 1931లో జనగణనతోపాటు చివరిసారిగా కులగణన జరిగింది. అంటే కుల గణన చేసి దాదాపు 94 సంవత్సరాలైంది. వైయస్ జగన్ ప్రభుత్వం ఈబీసీ కులాల కిందకు వచ్చే అన్ని కులాల లెక్కలు స్పష్టంగా ఉండాలని అధ్యయన కమిటీని వేసింది. సమగ్రమైన కుల గణన చేసేందుకు ఈ కమిటీలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ముస్లిం వెల్ఫేర్, గ్రామ సచివాలయాలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలందర్నీ చేర్చారు. ఇంకా సూక్ష్మంగా ఆలోచించి సామాజిక న్యాయం సాధించాలంటే అన్ని వర్గాల ఆలోచనలను స్వీకరించాలని నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ఈ మేరకు కలెక్టర్ల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి వివిధ కుల సంఘాలకు చెందిన మేధావులు, పోరాట సంఘం నాయకులతో చర్చించి అభిప్రాయాలను సేకరించడం జరిగింది.
కుల గణన కోసం ప్రత్యేక యాప్
బీహార్ ప్రభుత్వం కేవలం బీసీ కుల గణన చేస్తే మన రాష్ట్రంలో సమగ్ర కులాల గణన చేసి సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇదంతా వైయస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ కారణంగానే చేయగలిగాం. ఒక యాప్ క్రియేట్ చేసి గెజిటెట్ ఉద్యోగుల సహకారంతో సమగ్ర కులగణన చేశాం. జనగణనతోపాటు కుల గణన చేస్తేనే గుర్తింపు ఉంటుందని, రాష్ట్రాలు కులగణన చేయాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలని కోర్టులు స్ఫష్టం చేశాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో కుల గణన చేపట్టినప్పటికీ ఎన్నో కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ లోపాలన్నింటినీ అధిగమించి ప్రతి సూక్ష్మమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లడం జరిగింది. జనవరి 2024 నాటికి పూర్తి చేయాలని నాటి సీఎం వైయస్ జగన్ నిర్దేశించారు. ఆ విధంగా అనుకున్న సమయానికి కుల గణన పూర్తిచేశాం. ఆ లెక్కలు ఇప్పటి ప్రభుత్వం వద్ద కూడా ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ప్రకటించడానికి ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు కేంద్రం చేస్తున్న కులగణనను కూడా వైయస్ఆర్‌సీపీ స్వాగతిస్తోంది.
వెనుకబడిన కులాలు ఆత్మగౌరవంతో బతికేలా చేశాం
కేంద్రం ఎలాగూ కుల గణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి, గతంలో మా హయాంలో చేసిన కుల గణన లెక్కలను బయటపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత మా హయాంలో రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పేదరికంలో ఉన్నవారి ఎదుగుదలకు రాజకీయాలు అడ్డుకాకూడదు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. గత ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో వైయస్ జగన్ వెనుకబడిన కులాలను ఆత్మగౌరవంతో తలెత్తుకు బతికేలా చేశారు. సంక్షేమ పథకాల ద్వారా వెనుకబడిన కులాలు ఆర్థికంగా ఎదిగేందుకు తన వంతు అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కులాల కార్పొరేషన్లకు ఆఫీసుల్లేవు, చైర్మన్లు కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు.
50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్ జగన్‌దే
శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటైందంటే అది జగన్ చలవే. నామినేటెడ్ పోస్టుల్లో 2014 ఎన్నికల్లో మార్కెటింగ్ కమిటీల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి 2019 వరకు కూడా పట్టించుకోలేదు. 2019లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక యాక్ట్ నెంబర్ 24 ద్వారా నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు యాక్ట్ నెంబర్ 25, యాక్ట్ నెంబర్ 26 ద్వారా వాటిల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవేకాకుండా రాజ్యసభకు 8 మందిని పంపాల్సి ఉంటే అందులో నలుగురు బీసీలను, ఒక ఎస్సీని నామినేట్ చేయడం జరిగింది. కేబినెట్‌లో 17 మంది మంత్రుల్ని బీసీలను చేర్చుకుని 60 శాతం మంది బీసీలకు చోటు కల్పించారు. వైయస్ జగన్ చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఫలాలను ఇచ్చినట్టయింది. అన్ని కులాల ఎదుగుదలను కాంక్షించే వారైతే చంద్రబాబు తక్షణమే మా ప్రభుత్వం చేసిన సమగ్ర కుల గణన లెక్కలను బయటపెట్టాలి.