రాయలసీమకు చంద్రబాబు ద్రోహం
నంద్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పోరాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ రాయలసీమకు సంబంధించిన కీలక ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు స్పష్టమైన సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానాలు ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణపై ఇప్పటికైనా చంద్రబాబు పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై ఉందని గుర్తు చేశారు.
రాయలసీమకు నీరు ఇవ్వకుండా మాటలతో తప్పించుకుంటున్నారు: కాటసాని
ఇదే అంశంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమకు ద్రోహం చేస్తూ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడడం కాదని, నిజాయితీగా నీటిని అందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబు కృషి చేయాలని డిమాండ్ చేశారు. పాలకులుగా ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని, సవాళ్లు విసరడం మాత్రమే పరిష్కారం కాదని టీడీపీ ఎమ్మెల్యేలను తీవ్రంగా విమర్శించారు.
చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన సవాల్‌కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనని కాటసాని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో నీరు అందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని, ప్రజల పక్షాన నిలబడి చివరి వరకు పోరాడతామని ఆయన తేల్చి చెప్పారు.