టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా?

27 Jul, 2024 21:58 IST

విజయనగరం: టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా? అని మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. రాష్ట్రంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మారుమూల గ్రామానికి  వెళ్లి విధ్వంసం చేయడమేంటి? నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడమేంటి? అంటూ మండిపడ్డారు. దన్నానపేటలో వెంకునాయుడు ఇంటిని కూల్చివేయడం సరికాదన్నారు. జిల్లాలో ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ జరగలేదు. ప్రజాపత్రినిధులు అంటే ఇలాగేనా వ్యవహరించేది?. టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా?. రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌పై ఎందుకింత కక్ష?. కక్ష సాధించడం కోసమేనా రాజకీయాల్లోకి వచ్చింది అంటూ టీడీపీ నేతల తీరుపై బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. శ‌నివారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఇలాంటి ఘటన చూడలేదు:
    తాను 1985 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా,  రాజకీయాలు వీడలేదని.. అయితే ఇన్నేళ్లలో ఏనాడూ ఇలాంటి దురదృష్టకర ఘటన చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతికి జిల్లాలో శ్రీకారం చుట్టారని ఆయన మండిపడ్డారు. అసలు దీని వల్ల ఏం లాభిస్తుందని, ఇది సమంజసమేనా అని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.

ఇల్లు కూల్చివేత దారుణం:
    దేశం కోసం పోరాడిన ఓ మాజీ సైనికుడి ఇల్లు కూలిస్తే, అధికార పక్షం వారికి ఏం లాభిస్తుందని, అది కూడా ఎక్కడో మారుమూల ధన్నానపేట అనే గ్రామంలో ఇలాంటి చర్యకు పాల్పడడం అత్యంత హేయమని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు. ఒక వేళ ఆ ఇంటి స్థలం, ప్రభుత్వానికి చెందింది అయితే, అక్కడ ఇల్లు కట్టుకున్న వారు అర్హులైతే పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

మేము ఆ పని చేయలేదు:
    నిజానికి గత ఎన్నికల ఫలితాల నాటి నుంచే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని గుర్తు చేసిన మాజీ మంత్రి బొత్స, తమ జిల్లాలో ఈ రకమైన సంప్రదాయం రాకూడని బలంగా కోరుకున్నామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు, ఈ తరహా ఫిర్యాదులు వచ్చినా, ఇంత దారుణంగా వ్యవహరించి, ఆస్తులు కూల్చివేయలేదని తెలిపారు.

కలెక్టర్‌ పాత్ర ఆక్షేపణీయం:
    ఈ ఘటనలో జిల్లా కలెక్టర్‌ పాత్ర ఆక్షేపణీయమన్న మాజీ మంత్రి బొత్స, అసలు ఏ విధంగా ఒక మాజీ జవాన్‌ ఇల్లు కూల్చివేతకు ఆనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఫిర్యాదుపై స్వయంగా వెళ్లి పరిశీలించకుండా, ఏకంగా దాదాపు 50 మంది పోలీసులతో వెళ్లి ఇల్లు కూల్చడం ఏమిటని నిలదీశారు. ఇలాంటి వాటిలో మానవీయ కోణం అవసరమని అన్నారు.

వైఖరి మార్చుకొండి:
    అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వాస్తవాలు గుర్తించి, ఇకనైనా ఈ తరహా చర్యలు వీడాలని, వైఖరి మార్చుకోవాలని అధికార పార్టీ నేతలకు సూచించారు.