న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది… తగ్గేదేలే!
గుంటూరు: ఇటీవల గుంటూరు కోర్టు వద్ద తగ్గేదేలే అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన సైగలు గురించి నిన్న శాసన మండలిలో హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను అంబటి రాంబాబు కూతురు అంబటి మౌనిక ఖండించారు. అంబటి రాంబాబు గారిని టీడీపీ ఎమ్మెల్యే రెచ్చగొట్టినప్పుడు, ఆయన ఇంట్లో ఉన్న మహిళలను దూషించి దాడి చేసినప్పుడు హోం మంత్రి ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. రాంబాబుపై 36 కేసులు నమోదు చేసినా ఆయన ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం కోల్పోలేదని, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని చెబుతూ పార్టీ శ్రేణులను ధైర్యం చెప్పేలా రాంబాబు గారు అలా సైగలు చేశారే తప్ప..ఎవర్ని రెచ్చగొట్టలేదు. దాడులు చేయమని అంబటి సైగలు చేయలేదని మౌనిక స్పష్టం చేశారు. శనివారం గుంటూరులోని అంబటి స్వగృహం వద్ద మౌనిక మీడియాతో మాట్లాడారు.
ప్రెస్‌మీట్‌లో అంబటి మౌనిక ఇంకా ఏమన్నారంటే..:
● అంబటి రాంబాబు ఎవర్ని రెచ్చగొట్టలేదు
అసెంబ్లీ సమావేశాల్లో హోంమంత్రి అనిత మా తండ్రి అంబటి రాంబాబు గురించి మాట్లాడారు. ఆయనను టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టి, మహిళలపై దాడులు చేస్తే హోం మంత్రి ఏం చేశారు? వెంకటేశ్వరస్వామి లడ్డూ విషయంలో వైయస్ఆర్‌సీపీపై నిందలు వేస్తూ ఫ్లెక్సీలు వేసింది కూటమి నేతలే. వాటిని తొలగించమని కోరితే అంబటి రాంబాబుపై దాడి చేసింది కూడా వాళ్లే. దాడి చేసిన వారిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. బాధితుడిపై 36 కేసులు పెట్టారు. అయినా అంబటి రాంబాబు ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది… తగ్గేదేలే! అంటూ గురువారం గుంటూరు కోర్టు వద్ద పార్టీ శ్రేణులందరికి ధైర్యం చెప్పేలా ఆయన అలాసైగలు చేశారు, ఎవరినీ రెచ్చగొట్టలేదు, దాడులు చేయమని సైగలు చేయలేదు.
● లోకేష్ పైనేనా అనిత ఆక్రోశం
నిన్న అసెంబ్లీలో అనిత చెప్పింది మా తండ్రి అంబటి రాంబాబునే ఉద్దేశించిందా? లేక మంత్రి లోకేష్ గారిని ఉద్దేశించిందా? అనేది నాకు ఒక అనుమానం. గతంలో లోకేష్ కూడా ‘తగ్గేదేలే’ అని చెప్పారు కదా. తిరుపతి లడ్డూ విషయంపై అబద్ధాలు చెప్పమని లోకేష్ ఒత్తిడి చేస్తుంటే, అనిత అక్రోశంతో అలా అన్నట్లుగా ఉంది.
● ఆ ఘనత మీకే దక్కుతుంది అనితా..
గతంలో మంత్రి అనిత బూతద్దంలో ‘అమ్మా’ పదాన్ని పెట్టి ఎంత అశ్లీలంగా మాట్లాడవచ్చో ప్రపంచానికి చూపించారు… ఆ ఘనత మీకే దక్కుతుంది అనిత గారు. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేస్తుంటే మిమ్మల్ని రక్షించలేం, దొడ్డిదారి నుంచి పారిపోండని మా తండ్రికి మీ పోలీసులు సలహా ఇచ్చారు. కానీ ఆయన ఏమన్నారు తెలుసా? “చావనైనా చస్తాను కానీ దొడ్డిదారిలో వెళ్ళను” అని రాంబాబు గారు ధైర్యంగా నిలబడ్డారు.
● మీరు తల్లులను తిట్టవచ్చా?
లోకేష్ మాట్లాడుతూ, “సీఎం గారి తల్లిని అవమానించారు” అంటున్నారు. సీఎం గారికే తల్లి, మిగతావారికి లేరా? మీరు పవన్ కళ్యాణ్‌గారి తల్లిని తిట్టవచ్చు, ముద్రగడ ఇంట్లో ఉన్న మహిళలపై దాడి చేసి తిట్టవచ్చు. అంబటి రాంబాబు ఇంట్లో మహిళలపై కూడా దాడి చేసి బూతులు తిట్టారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి 90 ఏళ్ల వృద్ధ మహిళను దూషించి భయాందోళనకు గురి చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి ఆయన తండ్రిగారిని దూషించారు. ప్రతిపక్షంలో ఉంటూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ గారిని ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేశారో అనేది లోకేష్ గుర్తుకు తెచ్చుకోవాలి
● పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి
ప్రశ్నించడానికే జనసేన పార్టీ ఉద్భవించిందని పవన్ కళ్యాణ్ అంటారు. కానీ ఈ ప్రశ్నలన్నీ ఆయన ఎందుకు అడగడం లేదు? హోంమంత్రి తన బాధ్యతను మరిచిపోయారు. ఒక టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మా ఇంటిపై దాడి చేసి రెచ్చగొట్టింది. ఈ ఘటనపై హోం మంత్రి స్పందించారా? అని అంబటి మౌనిక సూటిగా ప్రశ్నించారు.