భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతున్న చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లా: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అపచారం చేశారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. స్వామివారి ప్రసాదానికి కళంకం ఆపాదించేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తే నాయకులు నైతిక బాధ్యత వహించేవారని, కానీ ప్రస్తుత కూటమి నాయకులు మాత్రం ఎదురు దాడులకు దిగుతున్నారని అన్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ఘోరమైన ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో టాయిలెట్లు శుభ్రం చేసే యాసిడ్ వాడారంటూ ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. భగవంతుడి మహిమలను చంద్రబాబు లాంటి వ్యక్తి నిర్ణయించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తిరస్కరించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని మళ్లీ ఎందుకు వినియోగించారనే అంశంపై కుట్ర కోణం ఉందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించడం సరికాదని విమర్శించారు.
అంబటి అరెస్టు దారుణం: మేడపాటి శర్మిలా రెడ్డి
వైయస్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబును అరెస్టు చేయడం దారుణమని పార్టీ నేత మేడపాటి శర్మిలా రెడ్డి అన్నారు. వైయస్ఆర్‌సీపీ నాయకులను అణచివేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో కూటమి నేతలు తమ చర్యల ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. భగవంతుడి విషయంలో చేస్తున్న ఆరోపణలపై తప్పకుండా ఫలితం అనుభవిస్తారని మేడపాటి శర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు.