ఎవరిది విజన్?, ఎవరిది విధ్వంసం?

10 Dec, 2025 22:04 IST

హైదరాబాద్: అడుగడుగునా అబద్దాలు, వాస్తవ వక్రీకరణలతో సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ... విద్య,వైద్యం, వ్యవసాయం,సంక్షేమం, పోర్టుల నిర్మాణమే ప్రాధాన్యంశాలుగా  వైయస్ఆర్‌సీపీ  ప్రభుత్వం పనిచేస్తే...  అప్పులు, అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందన్న బుగ్గన... ఎవరిది విజన్?, ఎవరిది విధ్వంసం అని నిలదీశారు. వైయస్.జగన్ హయాంలో పండగలా ఉన్న వ్యవసాయం... చంద్రబాబు  హాయంలో దండగలా మారిందని ఆక్షేపించారు. వైయస్.జగన్ రైతును చేయిపట్టుకుని నడిపిస్తే... చంద్రబాబు అన్నదాతను అధోగతి పాల్జేసారని మండిపడ్డారు. అయినా చంద్రబాబు స్థూల ఉత్పత్తిపై అర్దం కాని లెక్కలతో మభ్యపెడుతున్నారని స్పష్టం చేశారు. మరోవైపు అప్పుల విషయంలోనూ అడ్డగోలు వాదనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ... కాగ్, ఆర్బీఐ, అసెంబ్లీ రికార్డులనూ తప్పుదారిపట్టిస్తున్నారని తేల్చి చెప్పారు. వైయస్ఆర్‌సీపీహాయంలో కేవలం రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే... మా హాయంలో రూ.10 లక్షల కోట్లు అబద్దాలు చెప్పడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం 18 నెలల కూటమి పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన రూ. 2.66 లక్షల కోట్లు అప్పు ఏమైందని నిలదీశారు. ఈ సందర్బంగా ఇంకా ఆయన ఏమన్నారంటే... 

● స్థూల ఉత్పత్తి పేరుతో అర్ధ సత్యాలు... 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తూ.... సీఎం చంద్రబాబు మొదటే ఏపీ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ విధ్వంసం అయిపోయిందంటూ ఎత్తుకున్నారు. వాస్తవానికి ప్రస్తుతం కూటమి పాలన సాగుతోంది. చంద్రబాబునాయుడు దగ్గర చాలా థియరీ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తూ అది ఎప్పుడూ ప్రాక్టికల్ గా మారదు. 2014-19 లో తన పాలన బ్రహ్మాండంగా సాగింది కాబట్టి స్థూల ఉత్పత్తి సగటున 13.5 శాతం పెరిగిందని,  2019-24 లో వైయస్.జగన్ ప్రభుత్వంలో 10.3 శాతం మాత్రమే పెరిగిందని చెప్పారు. దానివల్ల రూ.7 లక్షల కోట్ల ధనం తక్కువైందని చెప్పారు. స్థూల ఉత్పత్తి గురించి 99 శాతం మందికి తెలియదు కాబట్టి.. మీరేం చెప్పినా నమ్ముతారనుకుంటున్నారు.
మీరిచ్చిన లెక్కల ప్రకారమే... 2020-21 లో కేంద్ర ప్రభుత్వమే స్థూల ఉత్పత్తిలో మైనస్  1.2 శాతం ఉంది. కారణం కోవిడ్ వల్ల నెగిటివ్ గ్రోత్ ఉంది. కోవిడ్ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. కేంద్రంలో మైనస్ 1.2 శాతం గ్రోత్ రేటు తగ్గుదలతో ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం 5.7 శాతం పెరిగింది. చంద్రబాబుగారి పోలిక ఎలా ఉందంటే... మాటైంలో ఎండాకాలంలో బట్టలు బాగా ఆరాయి... మీ హయాంలో వర్షాకాలంలో బట్టలు సరిగా ఆరలేదన్నట్టు ఉంది.  కేంద్ర స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతో చూస్తే... చంద్రబాబు హయాంలో 4.45 శాతం మాత్రమే. అంటే రూ.100 లో మన రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.4.45 శాతం మాత్రమే ఇచ్చారు. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్తులోనూ కేంద్ర జాతీయ స్థూల ఉత్పత్తిలో 4.78శాతం అంటే మీ కంటే ఎక్కువే జాతీయ ఉత్పత్తిలో మన వాటా ఉంది.  అంటే ఎవరి పరిపాలన బాగున్నట్టు. 13 శాతం నుంచి తగ్గిపోయిందని మీరు చెబుతున్నారు. 2020-21లో కేంద్ర జాతీయ స్థూల ఉత్పత్తి తగ్గినా, రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గలేదు అదెందుకు చెప్పడం లేదు. 

● స్థూల ఉత్పత్తిపై ఇవీ వాస్తవాలు...

చంద్రబాబుగారూ మీరు పెరిగాయని చెబుతున్న లెక్కలు... వాస్తవంలో సాధ్యమా? ఇది రాబడిలో ఎందుకు పెరగడం లేదు? ఆయన చెప్పింది ఎలా ఉందంటే... ధనవంతులే కానీ ఆదాయం మాత్రం లేదు అని చెబుతున్నారు. 2019-24 మధ్యలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9.7 శాతం పెరిగ్గా.. ఆదాయం 10.7 శాతం పెరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పినట్లు... 12.0 శాతం స్థూల ఉత్పత్తి పెరిగితే ఆదాయం  కేవలం 2.58 శాతం మాత్రమే ఎందుకు పెరుగుతుంది?
వైయస్ఆర్‌సీపీ హయాంలో 2018-19 నుంచి 2023-24 వరకు చూస్తే.. స్థూల ఉత్పత్తితో ఆదాయం పెరుగుదల చూస్తే.. 10.2 శాతం స్థూల ఉత్పత్తి పెరగ్గా.. ఆదాయం కూడా 9.8 శాతం పెరిగింది.అదే సయమంలో జాతీయ స్థూల ఉత్పత్తి 10.7 పెరగ్గా.. ఆదాయం 9.7 శాతం పెరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో 12 శాతం స్థూల ఉత్పత్తి పెరిగిందంట... కానీ ఆదాయం మాత్రం 3 శాతం మాత్రమే పెరుగుతుందని చెబుతున్నారు. ఇదెలా సాధ్యం. 2024-25 నుంచి 2025-26 మొదటి 6 నెలల కాలాన్ని పోల్చి చూస్తే... కూటమి ప్రభుత్వంలో 10.9 స్థూల ఉత్పత్తి పెరుగుదల కాగా, 2024-25లో మాత్రం 9.9 స్థూల ఉత్పత్తి పెరుగుదల అని చెబుతున్నారు. కానీ మీ హయాంలో ఆదాయం పెరుగుగల చూస్తే.. సేల్స్ టాక్స్ లో మైనస్ 2.8 అయితే, 4.3 జీఎస్టీలో పెరిగింది. ఓవరాల్ గా చూస్తే... 2.5 శాతం మాత్రమే పెరుగుదల. అంటే 11 శాతం స్థూల ఉత్పత్తి పెరుగుతుంది కానీ ఆదాయం మాత్రం 2.5 శాతమే పెరుగుతుందని చెబుతున్నారు. అదే జాతీయ స్థూల ఉత్పత్తి చూస్తే... 8.8 శాతం స్థూల ఉత్పత్తి పెరిగితే 7.3 శాతం ఆదాయం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం లెక్కలతో మా ప్రభుత్వ హయాంలో ఆరునెలల లెక్కలు, ఏడాది  ఆదాయం, స్ధూలఉత్పత్తి సరిపోలుతుంది, కానీ మీ ప్రభుత్వ హాయంలో మాత్రం కేంద్రంలో ఎక్కడా సరిపోలదు. అయినా మీది అద్బుతమైన పాలన, అద్భుతమైన స్థూల ఉత్పత్తి అని చెబుతారు. చంద్రబాబు గారు చెబుతున్నట్టు ఇలా మూడు నెలలకు లెక్కలు వేసే పరిస్థితి ఉండదు. ఇవాళ స్థూల ఉత్పత్తి గురించి అంచనాలు ఇస్తే...  అది వాస్తవమా కాదా అన్నది తెలియడానికి మూడేళ్లు పడుతుంది. తొలుత అడ్వాన్డ్ ఎస్టిమేట్స్, అనంతరం ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకెండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆ తర్వాత థస్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చివరగా.... అకౌంట్స్.

2014-19లో మీ హయాంలో 13.2 శాతం తలసరి ఆదాయం పెరిగితే, మా హయాం 2019-24లో 9.1  ఉంది.. కాబట్టి ... ఇంత ఆదాయం మిస్ అయిందని చెపుతూ మీకు అనుకూలంగా మీరు కొన్ని అంశాలను మర్చిపోతున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు.. జాతీయ స్ధాయిలో కేంద్రం తలసరి ఆదాయం మైనస్ 3.9 శాతం తగ్గితే మా ప్రభుత్వ హయాంలో 4.8 శాతం పెరిగింది.అది మాత్రం మీరు చెప్పరు. దేశ వ్యాప్తంగా చూస్తే.. 2013-14లో ఏపీలో 18వస్ధానంలో మీ పరిపాలన కాలం మొత్తం ఉంది. మా పరిపాలన కాలంలో అది 15 వ స్ధానానికి పెరిగింది. మరలా మీ సృజనాత్మకతతో ప్రజలను మభ్యపెట్టడానికి మీకేదో ముందు చూపుంది అని అనిపించుకోవడానికి డాలర్లలో మాట్లాడతారు.

● అప్పులపై అడ్డగోలు అబద్దాలు..

అప్పులు విషయానికొస్తే రూ.10 లక్షల కోట్లు అప్పు అని చెప్తారు. అంటే ఆర్బీఐ, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్(కాగ్) తప్పు చెబుతున్నాడు. మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అకౌంట్స్, మేము కూడా తప్పు చెబుతున్నాం. మీరు మాత్రమే కరెక్టు. మీరు మాట్లాడితే మేం వాస్తవాలు మాట్లాడాల్సి వస్తుంది. మరలా మీకు కోపం వస్తుంది. మీ 18 నెలల పాలనలో దాదాపు రూ. 2,66,175 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా. బడ్జెట్ అప్పు రూ.1,54,880 కోట్లు చేస్తే బడ్జెట్ బయట అప్పు రూ.1,11295 కోట్లు చేసిన మాట వాస్తవం కాదా? 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రూ.81597 కోట్లు అప్పు చేశారా? లేదా? కాగ్ గణాంకాల ప్రకారం 2025-26 సంవత్సరంలో రూ.67283 కోట్లు అప్పు, నవంబరు 4న రూ.3వేలు కోట్లు ,డిసెంబరు 2 న రూ.3వేలు కోట్లు మొత్తం అంతా కలిసి రూ.1,54,880 నిజామా? కాదా?. 
ఇది కాకుండా బడ్జెట్ బయట పౌరసరఫరాలసంస్ధ రూ.7వేల కోట్లు ,మార్క్ ఫెడ్ రూ.18,700 కోట్లు, ఏపీఐఐసీ రూ.1000 కోట్లు,  ఏపీఐఐసీ స్పెషల్ ఫర్పస్ వెహికల్ కింద రూ.7500 కోట్లు, ఏపీఎండీసి రూ.9000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ రూ.6710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు రూ.1150 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీపవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కలిసి రూ.5473 కోట్లు, నాబార్డు ద్వారా డిస్కమ్ లకు రూ.3762 కోట్లు... ఈ మూడు విద్యుత్ సంస్థలకు కలిసి రూ.10385 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా? జలజీవన్ మిషన్ రూ.10 వేల కోట్లు.. ఇవన్నీ కాకుండా అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు రూ.15వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కెఎఫ్ డబ్ల్యూ సంస్థ రూ.5వేల కోట్లు, ఎన్ ఏ బీ ఎఫ్ వై డీ నుంచి రూ.7500 కోట్లు,  ఏపీపీఎస్సీయల్ నుంచి రూ.1500 కోట్లు కలిపి మొత్తం రూ.2,66,175  కోట్లు అప్పు చేసింది వాస్తవం కాదా? మీరా మాతో అప్పులు గురించి పోలిక చేసి మాట్లాడుతారా? 

● రాష్ట్రం ఇప్పుడు శ్రీలంక కాదా?

మా హయాంలో రూ.10 లక్షల కోట్లు అని పచ్చి అబద్దాలు ముఖ్యమంత్రి స్ధానంలో ఎలా చెప్పగలుగుతున్నారు. మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారమే.. మా ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పు రూ.7,21,918 కోట్లు మాత్రమే. 2019లో మీ ప్రభుత్వం దిగిపోయి, మా ప్రభుత్వం వచ్చేనాటికి ఉన్న అప్పు రూ.3,90,247 కోట్లు ఉంది. అంటే మీరు దిగిపోయేనాటికి ఉన్న అప్పు కూడా మేమే చేశామా?  మా హయాంలో చేసిన మేము ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మీరు ఏడాదిన్నర లోనే రూ. 2.66 లక్షల కోట్లు అప్పు చేసి.. మా అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఇది కాకుండా.. అప్పులకోసం పరిమితి ఉంటే..  2014-19 మధ్య మీరు రూ.29 వేల కోట్లు పరిమితి మించి అప్పులు చేస్తే, ఆ అప్పు మా దాంట్లో మైనస్ చేసిన మాట వాస్తవం కాదా? మా హయాంలో చంద్రబాబుది ఎంత ఆవేదన అంటే.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని పచ్చి అబద్దాలు చెప్పారు. ఇవాళ రాష్ట్రం శ్రీలంక అయిపోవడం లేదా?  అంత దిగులుపడ్డ వాళ్లంతా ఎక్కడున్నారిప్పుడు?
ఏప్రిల్ 3 2025లో రూ.5750 కోట్లు,  మే 6న రూ.6822 వేల కోట్లు అప్పు చేయాలేదా? జూన్ 3 న రూ.7వేల కోట్లు,  జూన్ 10, 2025న రూ.7వేల కోట్లు, 2025 జూలై 15న రూ.3600   కోట్లు, ఆగష్టు 5 న రూ.5వేల కోట్లు, సెప్టెంబరు 2న రూ.5వేల కోట్లు, సెప్టంబర 30 రూ.2వేల కోట్లు, ఆక్టోబరు 7 రూ.1900 కోట్లు, నవంబరు 4న రూ.3వేల కోట్లు, డిసెంబరులో రూ.3వేల కోట్లు అప్పు చేయలేదా? ఇవన్నీ మేం ఊహించుకుంటున్నామా? రాష్ట్రం అప్పుల పాలవుతుందని దిగులుపడ్డ వారందరి దిగులు ఇప్పుడు ఎక్కడకు పోయింది? ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక కాదా? ఆ దిగులుపడ్డ వాళ్లంతా ఎక్కుడున్నారు? 

గతేడాది 2024లో చూస్తే జూన్  24 రూ.6వేల కోట్లు, జూలై 24 రూ.10 వేల కోట్లు, ఆగష్టు 24 రూ.3వేల కోట్లు, సెప్టెంబరు 24 రూ.4వేల కోట్లు, అక్టోబరు 24 రూ. 6 వేల కోట్లు, నవంబరు 24 రూ.6 వేల కోట్లు, డిసెంబరు 24 రూ.9237 కోట్లు, పిబ్రవరిలో రూ.7 వేల కోట్లు అప్పు చేశారు. కాగ్ ఏం చెప్పిందంటే.. 2025-26లో దేశవ్యాప్తంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.63,052 కోట్లతో దేశంలోనే ప్రధమ స్ధానంలో ఉందని చెప్పింది.  ఈ లెక్కలు మేమే రాశామా? 
ఇక కాగ్ చెప్పిన లెక్కల ప్రకారం రెవెన్యూ రాబడి చూస్తే...  2023-24 మా చివరి సంవత్సరం ఆరునెలలు చూస్తే.. రూ.82,139 కోట్లు ఉంటే, మీ హయాంలో రూ.74,237 కోట్లు ఆదాయం ఉంది. అంటే మీరు వెనక్కి పడిపోతున్నారు. మాట్లాడితే మంచి పరిపాలన, సంపద సృష్టి అని చెబుతారు. మా హయాంలో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు వాడుకున్నామని చెబుతున్నారు. 

పోలవరం ప్రాజెక్టకు సంబంధించి... ఎవరి హయాంలో డబ్బులు అడ్వాన్స్ వచ్చాయో చూస్తే.. మీరు కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నారు కాబట్టి... అక్టోబరు 9, 2024లో  రూ.2348 కోట్లు ఇస్తే.. మీరు అకౌంట్ లో వేయకుండా వేరే ప్రయోజనాల కోసం ఆ డబ్బులు ఖర్చుపెట్టారు. కేంద్ర జలవనరులశాఖ పదే పదే మిమ్నల్ని హెచ్చరిస్తే.. జనవరి 2025లో ఆ అకౌంట్ లో వేశారు. మరలా మార్చి 12న రూ.2705 కోట్లు మీ అకౌంట్లో వేస్తే... అందులో రూ.570 కోట్లు పోలవరానికి ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు మీ స్వంతానికి వాడుకున్నారు. ఇవాల్టికి కూడా పోలవరానికి కేంద్రం ఇచ్చిన డబ్బుల్లో రూ.1107 కోట్లు ఇతర ఖర్చులు పెట్టిన మాట వాస్తవం కాదా? మా హయాంలో మేమే డబ్బులు ఖర్చుపెట్టి.. కేంద్రం ఎప్పుడు రీయింబర్స్ చేస్తుందా అని చూసేవాళ్లం. మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి అడ్వాన్స్ వస్తున్నాయి. 
మీరు మాకు చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో  2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ అప్పులు చేసిందని రాశారు.  రూ.9వేలకోట్లు నెలకు అప్పు చేస్తున్నారని కూడా మరో ఆంగ్లపత్రికల్లో రాశారు. 
మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి విపత్తులను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. చెప్పిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నాం. వాస్తవానికి మీ ప్రభుత్వం చేసింది.. అసమర్థతతో కూడిన ధ్వంసం.

● అన్నదాతలకు అడుగడుగునా అన్యాయం..

మీ సొంత జిల్లా చిత్తూరులో మామిడి పంటను కొనుగోలు చేయకుండా వదిలేసిన మాట వాస్తవం కాదా? రాయలసీమలో వేరుశెనగ ముఖ్యమైన పంట. దాదాపు 14 లక్షలకు పైగా ఎకరాల్లో సాగులో ఉండాల్సిన వేరుశెనగ పంట ఇవాళ కేవలం 5 లక్షల ఎకరాల్లోనే ఉంది. ప్రత్తి రూ.8110 క్వింటాల్లు ధర ఉండాల్సింది నేడు రూ.5- రూ.6వేలే అమ్ముతుంది. ఉల్లి పంటను, అరటి పంటను పొలంలోనే వదిలిపెట్టారు. మొక్కజొన్న కనీస మద్ధతు ధర రూ.2,400 ఉంటే.. నేడు రూ.1600 అమ్ముకోవాల్సిన దుస్థితి. మొంథా తుపాన్ తో దెబ్బతిన్న వరిపంట కూడా రూ.1450 అమ్ముకుంటున్నారు. కనీస మద్ధతు ధర క్వింటా రూ.8వేలు ఉండాల్సిన కంది పంట నేడు  కొత్తపంట అయితే రూ.6400, పాత పంట అయితే రూ.6వేలకే అమ్ముకోవాల్సిన దుస్థితి. ఇదికాకుండా త్వరలో కందిపంట మరో లక్ష టన్నులు దిగుబడికి సిద్దంగా ఉంది. మీరు దానికి ఏం సిద్ధమయ్యారు? ప్రాక్టికల్ గా మాట్లాడకుంటా... మీరు వ్యవసాయం అంత పెరిగింది, స్థూల ఉత్పత్తి పెరిగిందని వాస్తవవిరుద్ధంగా మాట్లాడతారు. కోకో, పామాయిల్ నేను పరిచయం చేశానని చెబుతారు. 2014లో మీ హయాంలో పామాయిల్ ధర రూ.7370, 2015లోరూ. 6125, 2016లో రూ.7513, 2017లో రూ. 7790, 2018లో రూ.8525 కానీ.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైయస్.జగన్ హయాంలో  పామాయిల్ కి సంబంధించి వారిని ఆదుకోవడానికి  2019లో ఒక నిర్ణయం తీసుకున్నారు. 2020లో రూ.10527, 2011లో రూ.17083, 2022లో రూ.17704, 2023లో రూ. 18200 మద్ధతు ధర కల్పించారు. ఇవాళ పరిస్థితి ఏంటన్నది చూస్తే...  ఏ పంటకూ మద్ధతు ధర లేదు. అనంతపురం, కడప, నంద్యాల, కర్నూలులో ఉల్లి రైతుల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది.  ఉల్లికి రూ.20వేలు ఎకరాకు ఇస్తామని చెప్పారు. హెక్టారుకు రూ.50వేలు అని చెప్పారు, ఇంతవరకు ఒక్క రైతుకీ ఒక్క రూపాయి కూడా జమ కాలేదు.  పైగా ఇ-క్రాప్ నమోదు కాకుండానే రుబాబు చేసి పేర్లు రాసుకుని, ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదు. 

● మా ప్రభుత్వంలో సాగు పండగ.. మీ హయాంలో దండగైంది... 

ఇలా జరగడానికి కారణం.. వైయస్.జగన్ ప్రభుత్వంలో రైతులకు, వ్యవసాయానికి ప్రధాన స్ధానం ఇచ్చారు. మీరు మాత్రం రూ.5వేలు ఇచ్చి చప్పట్లు కొట్టించుకుంటున్నారు. రైతులు మాత్రం నా పంటలకు కనీస మద్ధతు ధర ఇవ్వండి, మా ఆత్మాభిమానాన్ని నిలబెట్టండి అని అడిగితే మీరు అది మాత్రం చేయడం లేదు. మీ పాలనలో రైతుల పంటలకు కనీస మద్ధతు ధర అన్న విధానానికి పూర్తిగా మంగళం పాడారు. దాన్ని అమలు చేయాలన్న ఆలోచనే మీకు లేదు. ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేయనప్పుడు రైతులకు ఎక్కడ కనీస మద్ధతు ధర వస్తుంది. 
ప్రపంచవ్యాప్తంగా రైతులకు ప్రభుత్వ సాయం లేకపోతే గిట్టుబాటు కాదు. అందుకనే పంట ప్రారంభం కాకముందే మా ప్రభుత్వంలో వారికి పెట్టుబడి సాయంకింద రైతుభరోసా రైతుల అకౌంట్లలో జమ చేసేవాళ్లం. మొత్తం 5 ఏళ్లలో  రూ.34288 కోట్ల రూపాయులు వైయస్సార్ రైతు భరోసా కింద రైతుల అకౌంట్లలో జమ చేశాం. ఇన్సూరెన్స్ కి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీమియమ్ కట్టడం నిలిపివేసింది. 
వైస్.జగన్ ప్రభుత్వంలో రైతులు కట్టలేకపోవచ్చు అని.. ఏడాదికి రూ.1500 కోట్లు చొప్పున రూ.7800 కోట్లు రైతుల తరపున ప్రీమియమ్ చెల్లించాం. రైతులకు ఏ రోజూ ఇబ్బంది లేకుండా చేశాం. సాధారణంగా పంట నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్రం తన వాటా కలుపుకుని ఎప్పుడో రెండేళ్లకు  మీ హయాంలో వచ్చేది. వైయస్.జగన్ ప్రభుత్వంలో ఏడాదికి రెండు సార్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి.. తర్వాత కేంద్రం నుంచి తెచ్చుకునేవాళ్లం. మా హయాంలో 54.50 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియమ్ కట్టాం. 54 లక్షల మంది రైతులకు రైతుభరోసా అందించాం.  రూ.3260 కోట్లు 34 లక్షల మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద చెల్లించాం. 
గిట్టుబాటు ధరల విషయానికొస్తే... 2022-23లో చూస్తే.. 64,300 టన్నుల శెనగలు సేకరించాం. మొక్కజొన్న పంట 72300 టన్నులు సేకరించాం. అరటి, ఉల్లి పంటలనూ సేకరించాం. సున్నావడ్డీ పంట రుణాలకి సంబంధించి రూ.2050 కోట్లు వడ్డీ కడుతూ.. మీ హయాంలో వదిలిపెట్టి పోయిన రూ.1180 కోట్లు కూడా చెల్లించాం. మా హయాంలో 2019-20 వరకు ఎప్పుడూ రైతు కనీస మద్ధతు ధర కంటే అధికంగా అమ్ముకోగలిగాడు. కారణం ఆ స్దాయిలో రైతులకు చేయూత అందించాం. 

● మీడియా సాక్షిగా బాబు అబద్దాలు...

విద్య,వైద్యం, వ్యవసాయం,సంక్షేమం, పోర్టుల నిర్మాణం మా ప్రభుత్వ ప్రాధాన్యాంశాలుగా పనిచేసాం. అది మా ప్రభుత్వ పాలసీ. విద్యుత్ గురించి మాట్లాడుతూ... మూడు పాయింట్లు చెప్పారు. ఒకటి అప్పు పెరిగిందని, రెండోది కరెంటు ధరలు పెంచలేదని, మూడోది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మేం రద్దు చేశామన్నారు. వాటి గురించి కూడా చూస్తే.. 2014-19 మీ హయాంలో  రూ.56,664 కోట్లు మీరు అప్పు చేసిన మాట వాస్తవమా? కాదా?  మీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.29,500 కోట్లు  ఉంటే మీరు దిగిపోయే నాటికి ఆ అప్పు రూ.86,215 కోట్లు చేరింది.  అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.1,22,518 కోట్లు అయింది.. అంటే మా హయాంలో కేవలం రూ.36,300 కోట్లు అప్పు చేశాం. మీ హాయంలో అప్పు 24 శాతం పెరిగితే మా హయాంలో 7 శాతం పెరిగింది. మీరు ఎవరూ చూడరనా మేం ఎక్కువ అప్పులు చేశామని చెపుతారు.

 ● మీ హయాం లోనే ప్రజల నెత్తిన రూ.18,272 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం.. 
 
మీ హయాంలో ఛార్జీలు పెంచలేదని చెబుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు మీరు ఇచ్చిన విజ్ఞప్తి ప్రకారం .. రేటు పెరిగిన మాట వాస్తవమా ? కాదా? ఓపీ నెంబరు 57,60,63,66 ప్రకారం 25 అక్టోబరు 2024 మీ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారు.
ఇక 2022-23 నాటికి సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జెస్ట్ మెంట్ ప్రకారం..  2024 నవంబరు, డిసెంబరులో 60 పైసలు, 60 పైసలు కలిపిన మాట వాస్తవం కాదా? ఈ విధానం ద్వారా రూ.6072 కోట్లు ప్రజల మీదా ప్రతినెలా, ప్రతి యూనిట్ మీదా 60 పైసలు చొప్పున భారం మోపిన మాట నిజం కాదా? ఇది మీ ఆర్డర్ కాదా? మరొకటి ఓపీ నెంబరు 69,70 ప్రకారం 2023-24 కు సంబంధించిన డబ్బులు ప్రతినెలా 45 పైసలు చొప్పున భారం  మోపిన మాట వాస్తవం కాదా? దీని ద్వారా 2023-24కు సంబంధించిన రూ.9412 కోట్లు 2025-26 లో వినియోగదారుల మీద మోపిన మాట నిజం కాదా? అదే విధంగా 2025-26 కు అడ్వాన్స్ గా రూ.2786 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇది పెరుగుదల కాదా? 
ఇక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో మా మీద నెపం వేస్తున్నారు. సౌర, వాయు విద్యుత్ లో 1 శాతం  రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 5 నుంచి 11 శాతం వివిధ సందర్భాల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటే మీరు 23 శాతానికి వెళ్ళారు. బొగ్గుతో కూడిన పవర్ ప్లాంట్లలో యూనిట్ రూ.4.22 కే యూనిట్ దొరుకుతుంటే మీరు మాత్రం రూ.5.94 కే ఎలా కాంట్రాక్ట్ చేసుకుని 25 ఏళ్లకు నిర్ణయించుకున్నారు. విండ్ మిల్స్, టర్బైన్స్ పెద్దవి అయ్యే కొద్ది ధరలు తగ్గుతున్నాయని తెలిసి కూడా ఎలా ఒప్పందం చేసుకున్నారు. మీరు వాయు విద్యుత్ లో రూ.4.22 బదులుగా రూ.6 కు కొన్నారు. ధర్మల్ పవర్ లో కూడా ఇలాగే రూ.6.99 కి  పర్చేజ్ చేశారు. దీనివల్ల బొగ్గు విద్యుత్ ఆపాల్సి వచ్చినప్పుడు అది కాస్తా రూ.8.09 పడింది. 

● వాయు విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసినప్పుడు .. 

కేంద్రం 2017 మార్చి వరకు రూ.50 పైసలు ప్రోత్సాహకాలు మాదిరిగా ఇస్తామంటే .. మీరు మాత్రం హడావుడిగా అందరి దగ్గరికి వెళ్లి కాంట్రాక్ట్ లు ఎంటర్ అయ్యారు. వెంటనే డిస్కమ్ లు ఏపీఈఆర్సీ దగ్గరికి వెళ్ల ఈ ధర ఎక్కువ అవుతుంది.. ఈ ఒప్పందాలను రద్దు చేయాలని కోరాయి. మీరు మాత్రం ఈఆర్సీకి చెప్పి తిరిగి పంపించి ఒప్పందాలు చేసుకున్నారు. అనవసరంగా యూనిట్ రూ.4.84 కి డిస్కమ్ లు వద్దన్నా వారితోనే కొనిపించారు. మా హయాంలో ఏవీ రద్దు చేయలేదు, కేవలం సమీక్షించాం. ఈ 50 పైసలు సబ్సిడీ అన్నది మార్చి 31, 2017 లోపే కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మీ హయాంలో కేవలం 15 రోజుల ముందు మూడు వారాల్లోనే  ప్లాంట్లు కట్టేశామని చెప్పారు. దానివల్ల ఏడాదికి రూ.922 కోట్లు ఖర్చు. అదే 2017లో గుజరాత్, తమిళనాడులో కొత్త రేట్లు రూ.3.46, రూ.2.43 వచ్చాయి. అంటే మీరు చేసుకున్న 25 సంవత్సరాల అగ్రిమెంట్ వల్ల ఎన్ని వందల కోట్లు తేడా వస్తుంది? డిస్కమ్స్ 3 మార్చి 2017లో ఈ అగ్రిమెంట్ వద్దనిచెబితే.. మరలా వెనక్కి పంపించారు. 13 జూలైలో ఇచ్చేశారు. 

● సూపర్ సిక్స్- సూపర్ ఫెయిల్....

మరోవైపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెబుతున్నారు. అంటే పీఏం కిసాన్ రూ.6వేలు  కాకుండా అన్నదాత సుఖీభవలో రైతులందరికీ రూ.20వేలు వచ్చాయా?  ఇప్పటి వరకు ఒక్కో రైతుకు రూ.40వేలు రావాలి, వచ్చాయా? యువగళం కింద ఉపాధి లేని నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు వస్తుందా? మహిళలకు నీకు రూ.15 అన్నారు, వచ్చిందా? తల్లికి వందనం కూడా అరాకొరాగా ఇచ్చారు. మూడు సిలెండర్లు అన్నారు, ఒక్కటిచ్చి చేతులు దులుపుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ పధకాలేవీ ఇవ్వకుండానే మీరు చేసిన అప్పు ఏమైంది? 
మా హయాంలో ఉన్న పథకాల్లో.... అమ్మఒడి అమలు చేస్తున్నారు, పెన్షన్ పెంచారు. ఇవి కాకుండా వసతి దీవెన, విద్యాదీవెన, విదేశీ విద్యాదీవెన, రైతుభరోసా, సున్నావడ్డీ,  క్రాప్ ఇన్సూరెన్స్, మత్స్యకార భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్ననేస్తం, వాహనమిత్ర, లా నేస్తం, కాపునేస్తం, ఆరోగ్యఆసరా, వైయస్సార్ ఆరోగ్యఆసరా, జగనన్న గోరుముద్ద, తోడు ఈ పథకాలన్నీ ఎక్కడికి పోయాయి. చేసిన అప్పంతా ఎక్కడికి పోయింది. అసలు పరిపాలన గురించి  ఆలోచన చేస్తున్నారా? 

● వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా పాలన...

ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రూ.3,600 కోట్లు నెట్ వర్క్ ఆసుపత్రులకు బకాయిలు ఉన్నాయి. అవి చెల్లించడం లేదు కానీ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి.. అక్కడ జీతాలు మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. ఇది ఎక్కడైనా ఉందా? ఫీజు రీయింబర్స్ మెంట్ అయితే రూ. 7,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఫీజులు చెల్లించకుండా కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. 230 కాలేజీలు మూతపడే దశలో ఉన్నాయి. విద్యకు  చూస్తే.. రూ. 18663 కోట్లు అవసరమైతే మీరు బడ్జెట్ లోనే తగ్గించి రూ.12వేల కోట్లు పెట్టారు.

● ఉద్యోగుల విషయానికి వస్తే...

 మిమ్నల్ని అద్బుతంగా సపోర్టు చేశారు. మీ గెలుపునకు సగం వారే కారణం. పీఆర్సీ పెట్టారా? ఐఆర్ ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అన్నారు. ఉన్న పీఆర్సీనే తీసేశారు. పీఆర్సీ పెడితే ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది, పెట్టడం లేదు. రూ. 31 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి. చివరకు ఒక్క డీఏ ప్రకటించి అది ఎప్పుడో చెల్లిస్తామని చెప్పారు. పోలీసుశాఖ పరిస్ధితి మరీ దారుణం. వారికి టీఏ, డీఏలు చెల్లించడం లేదు. ఏఎస్ ఎల్, ఎస్ ఎల్ కూడా ఇవ్వడం లేదు. రూ.1000 కోట్లు బకాయిలు ఉంటే.. ఒక్క నవంబరు 2024కు సంబంధించిన అడిషనల్ సరెండర్ లీవ్ లు నవంబరులో రూ.105 కోట్లు, డిసెంబరులో రూ.105 కోట్లు అని ప్రకటించి ఇంతవరకూ అవి కూడా ఇవ్వలేదు. ఇది ఈ ప్రభుత్వ పరిస్థితి.  ఒకటో తేదీనే జీతాలిస్తామని హామీ ఇచ్చారు. 
కోవిడ్ లో మా హయాంలో ఒకటి రెండు రోజులు జీతాలు ఆలస్యం అయితే ఉద్యోగులు మిమ్మల్ని ఎన్నో మాటలన్నారు. కోవిడ్ ఉందని చెప్పినా మిమ్మల్ని రాక్షుసులు మాదిరిగా చూశారు. ఇవాల కూటమి ప్రభుత్వంలో 10 వతేదీ వచ్చినా పౌరసరఫరాలు,  పబ్లిక్ హెల్త్, సర్వే, వ్యవసాయ, పరిశ్రమ, రవాణా, ఐ అండ్ పీఆర్ ,ఆర్ అండ్ బీ, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అరణ్యశాఖ, ఐసీడీఎస్, భూగర్భశాఖ, పంచాయితీ రాజ్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ శాఖ, ఆర్ డబ్లూఎస్ వీళ్లెవరికీ జీతాలు రాలేదు. మా హయాంలో కోవిడ్ వంటి ఇబ్బందులు ఉన్నాయి.  ఈ ప్రభుత్వం మాత్రం జీతాలు ఖర్చు ఎక్కువ అని చెబుతుంది. రాష్ట్ర ఆదాయంలో ఖర్చు లెక్కిస్తే... అప్పుడూ, ఇప్పుడూ 87 శాతమే. మా హయాంలో రూ.61,146 కోట్లు రాబడి ఉంటే...  రూ.53,051 కోట్లు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆదాయం రూ. 1,02000 కోట్లు మీ రాబడి అయితే... మీ ఖర్చు రూ.89 వేల ఖర్చు అవుతుంది.. అంటే రెండూ 87 శాతమే. పైగా మీరు పండగ చేసుకొండి హేపీ దీపావళి అని చెప్పారు.

పబ్లిక్ అకౌంట్  అంటే డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. 2014లో టీడీపీ హయాంలో రూ.19వేల కోట్లు ఉంటే మీరు దిగిపోయే సమయానికి దాన్ని రూ. 76,500 కోట్లు చేశారు. అంటే రూ.56 వేలకోట్లు మీరు వాడారు. మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ అదే రూ.76 వేల కోట్లు ఉందంటే మేమే తిరిగి రూ.500 కోట్లు కట్టాం. మా ప్రభుత్వం దిగిపోయేనాటికి  మార్చి 2024లో ప్రావిడెంట్ ఫండ్ 100 శాతం అంటే రూ.1353కోట్లు కట్టాం. జీఎల్ ఐ రూ.312 కోట్లు కట్టాం. సీపీఎస్ రూ.2421 కోట్లు చెల్లించాం. మెడికల్ రీఎంబర్స్ మెంట్ రూ.190 కోట్లకు పైగా కట్టాం. దాదాపు అన్నీ క్లియర్ చేశాం. 

విపరీతంగా అవినీతి పెరిగిందని చెబితే.. దానికి మాత్రం అటూ యిటూ కాని సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే. ఉచిత ఇసుక ఎవరికి దొరుకుతుంది. టీడీపీ నాయకులకు ఏ నియోజకవర్గంలోనైనా ఉచిత ఇసుక డబ్బులు ముట్టకుండా ఉండే పరిస్థితి లేదు. 
వైన్ షాపుల్లో స్థానిక టీడీపీ నాయకులు డబ్బులు వసూలు చేయని పరిస్థితి లేదు. తాసీల్దార్ కార్యాలయానికి భూములు రికార్డుల కోసం పోతే అక్కడా డబ్బులు వసూలు చేస్తున్నారు. లే అవుట్ వస్తే.. బలవంతంగా వసూళ్లు. చివరకి రైతులకు అందాల్సిన యూరియా సంచులను కూడా టీడీపీ నేతలు రుబాబు చేసి రైతులకు అందకుండా లాక్కుని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. 

● బయో ఫెస్టిసైడ్స్ పేరుతో భారీ దందా..

అన్నింటికంటే చాలా పెద్ద దందా.. బయో ఫెస్టిసైడ్స్ పేరుతో టీడీపీ నాయకులు విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. టీడీపీలో చాలా పెద్ద, ముఖ్యమైన నాయకులే ఈ దందా వెనుక ఉన్నారు. మీరు కావాలంటే తనిఖీ చేసుకోవచ్చు.
మరోవైపు చంద్రబాబు డ్రోన్స్ ద్వారా పురుగు మందులు పిచకారీ చేయిస్తాం.. దాని ద్వారా పండుమీద ఈగ ఎక్కడుంటే అక్కడే స్ప్రే చేసే టెక్నాలజీ వస్తుందని నమ్మబలుకుతుంటే.. ఈ డ్రోన్ల పేరుతో భారీ కుంభకోణమే జరుగుతుంది. ఒక్కో డ్రోన్ రూ.3.50 లక్షలు ఉంటే, ప్రభుత్వం మాత్రం రూ.9.80 లక్షలకు కొనుగోలు చేస్తోంది. ఇందులో 80శాతం సబ్సిడీ ఇస్తుంది. అంటే రైతు రూ.2 లక్షలు కడుతున్నాడు. అతను రూ.2 లక్షలకే వస్తుందని అనుకుంటున్నాడు. కానీ ప్రభుత్వం సబ్సిడీ పేరుతో ఇస్తున్న డబ్బులు ఎక్కడకుపోతున్నాయి? వ్యవసాయంలో కూడా విపరీతమైన అవినీతి చోటుచేసుకుంటుంది. దీనిపై ఏం సమాధానం చెప్తారని బుగ్గన రాజేంద్రనాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు.