ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ జగనే
రాజమహేంద్రవరం: టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డినే అని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. రాజమండ్రిలో మెజారిటీ రావడానికి వాసు గొప్పతనం, ఆయన కుటుంబం గొప్పతనం కాదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నుంచి ఆదిరెడ్డి కుటుంబాన్ని తరిమేస్తే వైయస్ జగన్ రాజకీయ బిక్ష పెట్టారని గుర్తు చేశారు. ఇటీవల బొల్లినేని ఆసుపత్రిలో మృతి చెందిన యువతికి ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకూ ఎటువంటి సహాయం అందించలేదని తప్పుపట్టారు. రాజమండ్రిలో అవినీతి జరక్కుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నానని, నగరంలో అధికార పార్టీ నేతలు భూములను కబ్జా చేసే ప్రయత్నాలు అడ్డుకుంటామన్నారు. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల వద్ద అనధికార పర్మిట్ రూములు విషయంలో కచ్చితంగా ఆందోళన చేస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు.