వినుకొండ హత్య ..రాజకీయ హత్య
నరసన్నపేట : తెలుగుదేశం నేతలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వినుకొండలో తమ పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా రాజకీయ హత్య చేసి దాన్ని వ్యక్తిగత హత్యగా చిత్రీకరించడం పట్ల తీవ్రంగా ధ్వజమెత్తారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పుంగనూరులో టిడిపి దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ మిధున్ రెడ్డిపై కూడా దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ రెండు ఘటనలను తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్య బద్దంగ ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏవిధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని కృష్ణదాస్ హెచ్చరించారు.