బూచేపల్లి సుబ్బారెడ్డికి ఘన నివాళులు

11 May, 2026 16:09 IST

ప్ర‌కాశం జిల్లా : దర్శి మాజీ శాసన సభ్యులు  బూచేపల్లి సుబ్బారెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా చీమకుర్తిలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు, దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ముందుగా బూచేపల్లి సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సూర్య గ్రానైట్స్ సంస్థ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. 


బూచేపల్లి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు 
 వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి చెందిన సూర్య గ్రానైట్స్‌పై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చీమకుర్తి ప్రాంతంలోని సూర్య గ్రానైట్ క్వారీల్లో సోమవారం ఉదయం నుంచి మైనింగ్, విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రెండు బృందాలుగా విడిపోయి అధికారులు క్వారీల్లో పత్రాలు, కార్యకలాపాలను పరిశీలించారు. సూర్య గ్రానైట్స్ యాజమాన్యం అన్ని అనుమతులు, రాయల్టీ చెల్లింపులతో పూర్తిస్థాయిలో నిబంధనలకు అనుగుణంగా క్వారీయింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, రాజకీయ కక్షతోనే ఈ దాడులు చేపట్టారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు.

జిల్లాలో రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్న బూచేపల్లి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూడా బూచేపల్లి క్వారీలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టి మూసివేసే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. తప్పుడు ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని సూర్య గ్రానైట్ యాజమాన్యాన్ని అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బూచేపల్లి కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు.