ఏబీఎన్ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి

27 Apr, 2026 12:03 IST

తిరుపతి : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఇప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర రెడ్డి డిమాండ్  చేశారు. 
ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తిరుపతి ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి, ఏఎస్పీకి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఫిర్యాదులు ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు త‌ప్పుప‌ట్టారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా తక్షణమే ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి, విచారణ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త మోహిత్, సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్, గంగాధరనెల్లూరు సమన్వయకర్త కృపలక్ష్మి, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.