రాజకీయ ప్రయోనాల కోసమే లడ్డూపై దుష్ప్రచారం
రాజమహేంద్రవరం: రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్నారని వైయస్ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వ కుట్రలను ఆధారాలతో సహా ఎండగట్టారు.
రాష్ట్రంలోని హరిభక్తులను మానసిక క్షోభకు గురిచేస్తూ, నిత్యం ఏదో ఒక అసత్యాన్ని ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబు తీరును మాజీ మంత్రి ఆక్షేపించారు. శ్రీవారి ప్రసాదాన్ని వేలెత్తి చూపిన చంద్రబాబు తీరుతో, తిరిగి నాలుగు వేళ్లు ఆయన తప్పులనే చూపిస్తున్నాయని స్పష్టం చేశారు. గతంలో ఎన్టీఆర్ గారిపై దుష్ప్రచారం చేసినట్లే, ఇప్పుడు వైయస్ జగన్‌ను కూడా ప్రజల నుంచి దూరం చేసేందుకు భగవంతుడిని కూడా వాడుకుంటున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు అవశేషాలు లేవని ఎన్‌డిఆర్‌ఐ, ఎన్‌డిడిబి ల్యాబ్‌లతో పాటు సుప్రీంకోర్టు నియమించిన ’సిట్’ కూడా తన ఛార్జిషీట్‌లో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
‘నిజం బయటపడిన తర్వాత బాధ్యత గల ముఖ్యమంత్రిగా భక్తులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. ఇప్పుడు లడ్డూలో బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ కలిపారంటూ మరిన్ని అపవిత్ర మాటలు మాట్లాడటం చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం‘ అని ధ్వజమెత్తారు. భగవంతుడి మీద వేసిన ఈ నింద నుండి చంద్రబాబు తప్పించుకోలేరని, తప్పుడు ప్రచారంతో భక్తులను భయపెట్టే మీ ఆశలు నెరవేరవని హెచ్చరించారు. ప్రెస్‌మీట్‌లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంకా ఏమన్నారంటే..
పాంప్లెంట్ల పంపిణీతో మరింత దిగజారారు:
చంద్రబాబునాయుడుగారి రాజకీయ ప్రస్థానమంతా ఒక్కో ఎన్నికలకు ఒక్కో విధానాన్ని పాటించడం అలవాటు. గతంలో కులాలను, ప్రాంతాలను అడ్డం పెట్టుకున్న ఆయన, ఇప్పుడు మతపరమైన అంశాలను చిత్రీకరించడం ద్వారా లాభపడాలని చూస్తున్నారు. ఆయనకు తోడు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా తోడై భక్తుల విశ్వాసాలను దెబ్బ తీస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిన్న (ఆదివారం) పిఠాపురంలో తిరుపతి లడ్డూ కల్తీపై వారు చేసిన ప్రచారమే ఇందుకు నిదర్శనం. వారు పంచిన పాంప్లెంట్లు చూస్తే.. భక్తుల విశ్వాసాలను దెబ్బ తీయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్న విధానం స్పష్టమవుతోంది.
తిడితే జైలు. కొడితే బెయిలు:
సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రజల శాంతియుత జీవనానికి కృషి చేయాలి. కానీ, ఇక్కడ దురదృష్టవశాత్తు ప్రభుత్వమే ప్రజల్లో అశాంతిని రేకెత్తిస్తోంది. గుంటూరులో ఫ్లెక్సీని ప్రశ్నించినందుకు అంబటి రాంబాబుగారి ఇంటిపై దాడి చేశారు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ‘తిడితే సెంట్రల్ జైలు. కొడితే బెయిలు‘ అనే కొత్త చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. అధికారం మాకు మాత్రమే అండగా ఉండాలి తప్ప మిగిలిన పౌరులకు చట్టాలు వర్తించవు అన్న రీతిలో వ్యవహరిస్తూ అధికార పార్టీ నేతలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
శ్రీవారి ప్రసాదంపై అపవిత్ర ప్రచారం:
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని తరించడాన్ని అత్యంత అదృష్టంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పూజిస్తారు. స్వామి వారి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావించి స్వీకరిస్తారు. అలాంటి భక్తుల మనోభావాలను చంద్రబాబునాయుడు గాయపరిచారు. భక్తుల మనోభావాలపై ఆయనకున్న చులకన భావనకు ఇదే నిదర్శనం. స్వామివారి ప్రసాదంపై చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అధికార అహంకారంతో కల్తీ జరిగిందనే దుష్ప్రచారం మొదలుపెట్టారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్త కోటి తీవ్ర మానసిక వేదనకు గురైంది. కేవలం జగన్‌గారిపై నింద వేయాలని చూసి, సాక్షాత్తు శ్రీవారి ప్రసాదంపైనే దుష్ప్రచారం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని వేలెత్తి చూపిన చంద్రబాబు తీరుతో తిరిగి నాలుగు వేళ్లు ఆయన తప్పులను చూపించాయి.
ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తప్పించడానికి ఆయన వ్యక్తిత్వంపై చంద్రబాబు ప్రచారం చేసినట్టు, ఇప్పుడు భగవంతుడి విషయంలో మీ ఆటలు సాగవు.
సిట్ ఛార్జ్‌షీట్ బయటపెట్టిన వాస్తవాలు:
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు మీరు అధికారంలో ఉన్నప్పుడే వచ్చాయి. కాబట్టి మీరే దీనికి బాధ్యత వహించాలి. ఇందులో ఎలాంటి డీవియేషన్స్ లేవు. కానీ కనీస సిగ్గు లేకుండా రాజకీయ ప్రయోజనం కోసం వైయస్.జగన్ పై ఈ నింద వేయాలని ప్రయత్నించి.. ఏకంగా జగన్నాధుడి ప్రసాదంపైనే నింద వేశారు. తిరుమల లడ్డూపై రాజకీయం చేసి ప్రయోజనం పొందాలన్న కూటమి కుట్ర భగ్నమైందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పదే, పదే దుష్ప్రచారం చేసినా.. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అవశేషాలు లేవని ప్రతిష్టాత్మకమైన ఎన్‌డిఆర్‌ఐ, ఎన్‌డిడిబి ల్యాబ్‌లు స్పష్టం చేశాయి. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన ’సిట్’ కూడా తన ఛార్జ్‌షీట్‌లో ఈ అవశేషాలు లేవని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రిస్ధాయిలో బాధ్యత, విజ్ఞత కలిగిన వ్యక్తి అయితే చంద్రబాబు భక్తులకు క్షమాపణ చెప్పాలి. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే మీరు ఈ ఆరోపణలు చేశారు. లడ్డూలో మీరు చెప్పిన గొడ్డు కొవ్వు, పందికొవ్వు అవశేషాలు లేవని చెప్పిన తర్వాత మీరు మాట మార్చి లడ్డూలో బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్ కలిపారంటూ మరిన్ని అపవిత్ర మాటలు మాట్లాడుతున్నారు. పురాణాల్లో చెప్పిన విధంగా రాక్షసుల్లా ఇంకా భక్తులను హింసించే కార్యక్రమానికి పూనుకున్నారు.
కల్తీ నెయ్యి ట్యాంకర్ల వెనుక ఉన్న నిజాలివే:
కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న నెయ్యి ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి? కల్తీ జరిగిందని ఆరోపిస్తూ వెనక్కి పంపించిన ట్యాంకులు మరలా టీటీడీకి వచ్చింది కూడా మీ హయాంలోనే కదా? వాటికి మీరే సమాధానం చెప్పాలి? భోలే బాబా డెయిరీకి ద్వారాలు తెరిచింది మీరే కదా చంద్రబాబూ? కేజీ నెయ్యి తన హయాంలో రూ.320కే కొన్నమాట వాస్తవం కాదా? అలాంటప్పుడు మీరే కేజీ నెయ్యి ఎలా రూ.320కు దొరుకుతుందని ప్రశ్నిస్తారు? ప్రజలను ఇంకా మోసం చేయగలననుకుంటున్నారా? తిరుమలలో వాడిన నెయ్యి కల్తీ వ్వవహారం బయటపడిందే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా. వీటికి సమాధానం చెప్పకుండా వైయస్.జగన్ మీద నిందలు వేస్తున్నారు. భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.
కూటమి పాలనలోనే కల్తీ కుట్ర:
మార్చి 16, 2024 నాడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మే 13న ఎన్నికలు జరగ్గా, మే 15, 2024లో ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో తిరుమలలో నెయ్యి సరఫరాకి సంబంధించిన టెండర్లు తెరిచి ఏఆర్ డైరీకి ఆర్డర్ ఇచ్చారు. జూన్ 12, 2024న కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అదే రోజు నుండి ఏఆర్ డైరీ నుంచి నెయ్యి ట్యాంకర్లు రావడం మొదలైంది. జూన్ 12, 20, 25, జూలై 4న ఏఆర్ డైయిరీ నుంచి 4 ట్యాంకర్లు రాగా, ల్యాబ్ పరీక్షల్లో.. వాటిలో ఎలాంటి కల్తీ లేదని తేలడంతో అనుమతించారు. మళ్లీ జూలై 6, 12 తేదీల్లో రెండేసి చొప్పున వచ్చిన నాలుగు ట్యాంకర్లు రాగా, ఆ నెయ్యిని ఇక్కడ టీటీడీ ల్యాబ్‌లో ల్యాబ్‌లో పరీక్షిస్తే, కల్తీకి సంబంధించి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో మళ్లీ పరీక్ష కోసం ఎన్‌డీడీబీకి శాంపిల్స్ పంపగా, జూలై 23న అక్కణ్నుంచి కూడా అదే పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దానివల్ల జూలై 25న వెనక్కి పంపించారు. అపుడు కూటమి ప్రభుత్వమే ఉంది. జూలై 27న ఆ ట్యాంకర్లను శ్రీకాళహస్తి దగ్గర ఒక స్టోన్ క్రషర్ వద్ద రహస్యంగా ఉంచారు. మళ్లీ అవే ట్యాంకర్లు ఆగస్టు, సెప్టెంబర్‌లో తిరిగి రాగా, అనుమతించి లడ్డూ తయారీలో వాడారు. ఈ వాస్తవాలన్నీ సీబీఐ సిట్ తన ఛార్జిషీట్‌లో స్పష్టంగా ప్రస్తావించింది.
నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్దాలు:
తన హయాంలోనే కల్తీ జరిగినా సెప్టెంబర్ 18న 100 రోజుల పాలన సందర్భంగా చంద్రబాబు మాత్రం ఎక్కడా సిగ్గు పడకుండా తన హయాంలో జరిగిన ఈ కల్తీని గత ప్రభుత్వంపై నెట్టేస్తూ ప్రసంగించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగినా ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేస్తూ.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు కలిసిందని రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం మొదలుపెట్టాడు.
కల్తీ ట్యాంకర్లు మీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి, మీరే వాటిని దొడ్డిదారిన మళ్ళీ రప్పించారు. భోలే బాబా డెయిరీకి టీటీడీలో ద్వారాలు తెరిచింది చంద్రబాబు గారే. కేజీ నెయ్యి రూ.320కి గతంలో కొన్నది మీరే. అయినా ఆ విషయాలను అంగీకరించకుండా ఏ ఆధారాలు రుజువులు లేని 2019–24 వరకు కల్తీ నెయ్యిని ఆపాదించే ప్రయత్నం ఇంకా చేస్తున్నారు. ఆ నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు, పందికొవ్వు, చేప నూనె లేదని తెలిసిన తర్వాత కనీస విలువలు, భక్తుల మనోభావాల మీద పట్టింపు లేకుండా బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు.
2024 తర్వాత కల్తీ ఆరోపణలు వస్తే సమాధానం చెప్పాల్సింది మీరు కాదా చంద్రబాబూ? కల్తీ జరిగిందని తిప్పి పంపిన నాలుగు ట్యాంకర్లు మరలా టీటీడీలోకి వెళ్లడానికి మీరు కాదా కారణం? ఏఆర్ డెయిరీ దేశవ్యాప్తంగా నెయ్యి సరఫరా చేస్తున్నారు. దాని గురించి ప్రస్తావించలేదు. ఆ నెయ్యిలో కల్తీ ఉంటే దేశ వ్యాప్తంగా ఎందుకు బయటపడలేదు? నెయ్యిలో జంతుకొవ్వులు కలిసాయని నిందవేసి, అవి అబద్దాలని తేలిన తర్వాత భక్తులకు క్షమాపణ చెప్పకపోవడం, ఇంకా అందులో మరేదో క ల్తీ జరిగిందని చెప్పడం బరితెగింపు కాదా చంద్రబాబుగారూ? మా ప్రభుత్వ హయాంలో జరగని వాటికి మీరు కుట్ర పూరితమైన విమర్శలు చేస్తున్నారు.
నెయ్యి సేకరణ. అప్పుడు, ఇప్పుడూ ఒకే విధానం:
నెయ్యి సేకరణ విధానం 2014–19 మధ్య ఎలా ఉందో, 2019–24 మధ్య కూడా అలాగే ఉంది. ఏ ట్యాంకర్ అయినా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అప్రూవల్, సర్టిఫికెట్ తీసుకోవాలి. అలా వచ్చిన నెయ్యిని మళ్లీ టీటీడీ ల్యాబ్‌లో పరీక్షిస్తారు. వాస్తవానికి వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆ ల్యాబ్‌ను మరింత ఆధునీకరించడం జరిగింది. ఇంకా నెయ్యిలో నాణ్యత లేకపోతే తిప్పి పండం కూడా సహజం. అంతకు ముందు మీ హయాంలో అలా 15 ట్యాంకర్లు తిప్పి పంపితే, మా ప్రభుత్వ హయాంలో 18 ట్యాంకులు వెనక్కి పంపించాం. ఇంకా 2018లో ఏఆర్ డెయిరీని టీటీడీకి తీసుకొచ్చింది కూడా మీరే. ఇప్పుడేమో వైయస్.జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎలా చెబుతారు?.
మీ హెరిటేజ్ డెయిరీ ఎవరితో కలిసి వ్యాపారం చేసిందో..ఆ వాస్తవాలన్నీ బయట పడ్డంతో దాన్నుంచి తప్పుకోవడానికి ఇంకా పది తప్పులు చేస్తున్నారు. హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపుర్ డెయిరీకి సంబంధించిన డేటా ఎందుకు తొలగించారో.. చంద్రబాబు సమాధానం చెప్పాలని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తేల్చి చెప్పారు.