కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి, హోమియో డాక్టర్లను నియమించాలి
వైయస్ఆర్ జిల్లా: కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి, హోమియోపతి డాక్టర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ కమలాపురం వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి మెడికల్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఉన్నమతి పాయ చంద్రమతి అన్నట్లుగా ఆసుపత్రి పరిస్థితి తయారైంది” అని వ్యాఖ్యానించారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి రూ.7.5 కోట్ల వ్యయంతో ఆసుపత్రిని ఆధునిక సదుపాయాలతో పునర్నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం 30 పడకలతో ఆసుపత్రి నిర్మించబడిందని, భవిష్యత్తులో 100 పడకలకు విస్తరించేలా ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేపట్టారని చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఆసుపత్రిని అభివృద్ధి చేసినప్పటికీ, ఈ ప్రభుత్వం కొత్త డాక్టర్లను నియమించడం బదులు ఉన్న డాక్టర్లనే తొలగించిందని ఆరోపించారు. రోజుకు 50 నుంచి 300 మంది వరకు ఓపీ వచ్చే ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది తీవ్ర కొరత ఉందన్నారు.
పంటి, కంటి, హోమియోపతి వైద్యులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసిన నరేన్ రామాంజులరెడ్డి, ముఖ్యంగా వృద్ధులు హోమియోపతి వైద్యంపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం డాక్టర్లు లేకపోవడంతో చిన్న చికిత్సలకే ప్రజలు జిల్లా కేంద్రం కడపకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. కంటి పరీక్షలకు కూడా వృద్ధులు ఇతర ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై చిన్నచూపు చూస్తోందని విమర్శించిన ఆయన, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ఆలోచన దుర్మార్గమని అన్నారు. “వైద్య విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలిస్తే, వాటిని ప్రైవేటీకరించాలని చంద్రబాబు చూస్తున్నారు” అని విమర్శించారు. అలాగే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, 104 సేవలు, పీహెచ్‌సీల వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం విద్య, వైద్యం గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని కృషి చేసిందని, ప్రస్తుతం వాటిని ప్రజలకు దూరం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఉన్నట్లుగానే హోమియోపతి, కంటి డాక్టర్లను నియమించాలని నరేన్ రామాంజులరెడ్డి డిమాండ్ చేశారు.