ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై నాడు విష‌ ప్రచారం

8 Jun, 2026 20:16 IST

త‌ణుకు:  నాటి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రైతుల భూ హక్కులకు సంపూర్ణ భద్రత కల్పించడం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడం లక్ష్యంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఎన్నికల సమయంలో విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన చంద్రబాబు నాయుడు, నేడు అదే చట్టానికి పేరు మార్చి తన ఘనతగా చెప్పుకోవడం క్రెడిట్ చోరీకి పరాకాష్ట అని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రవ్యాప్తంగా భూసర్వే నిర్వహించి రైతులకు భూ హక్కులకు గ్యారంటీ కల్పించే చారిత్రాత్మక కార్యక్రమాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. అయితే నాడు ఈ చట్టంపై అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ నాయకులు, నేడు అదే కార్యక్రమాన్ని తమ విజయంగా ప్రచారం చేసుకోవడం ప్రజలను మరోసారి మోసం చేయడమేనని తణుకులోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండిపడ్డారు.
ప్రెస్‌మీట్‌లో కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ఏమ‌న్నారంటే..

- వందేళ్ల తరువాత సమగ్ర భూసర్వే
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారు. జగన్ గారు భూములు ఇచ్చేవాడే గానీ, లాక్కునేవాడు కాదు. ప్రజలకు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ఈ చట్టం లక్ష్యం. వైయస్ జగన్ హయాంలో వందేళ్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే నిర్వహించి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాల్లో సర్వే పూర్తై, 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూ హక్కుదారులకు పత్రాలు అందజేశారు. ఈ చట్టం ద్వారా భూములు లాక్కోవడం సాధ్యం కాదు. ప్రభుత్వం భూ పత్రాలను స్వాధీనం చేసుకోదు. కేవలం రికార్డులను పరిశీలించి గ్యారంటీ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. దీంతో భవిష్యత్తులో 30 రకాల పత్రాల అవసరం ఉండదు. రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు ఉంటే అప్పిలేట్ అథారిటీ, అవసరమైతే హైకోర్టు ప్రత్యేక బెంచ్ ద్వారా న్యాయం పొందే అవకాశం ఉంటుంది. 

- ఇది క్రెడిట్ చోరీ కాదా చంద్రబాబు ? 
ల్యాండ్ టైటిలింగ్ విధానం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విజయవంతంగా అమలవుతోంది. రైతులకు పూర్తి భూ హక్కులు కల్పించడం, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే దీని లక్ష్యం. ఇదే ఉద్దేశంతో వైయస్ జగన్ అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్తంగా భూసర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఎన్నికల సమయంలో ఈ యాక్ట్‌పై చంద్రబాబు విష ప్రచారం చేసి, జగన్ భూములు లాక్కుంటున్నారని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే కార్యక్రమానికి పేరు మార్చి తన ఘనతగా చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా?. వైయస్ జగన్ చేపట్టిన భూ హక్కు–భూ సర్వే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా సూచించింది. ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.450 కోట్ల ప్రోత్సాహక నిధులు వచ్చినా, వాటిని కూడా చంద్రబాబు ఘనతగా చూపించేందుకు ప్రయత్నించడం దురదృష్టకరం. 

- రైతు సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం
రైతుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతు భరోసా సక్రమంగా అందడం లేదు, ఇన్‌పుట్ సబ్సిడీ లేదు, గిట్టుబాటు ధరలు లేవు. రైతులను గాలికి వదిలేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచాం. కరోనా సమయంలో అరటి రైతులకు ప్రత్యేక రైళ్ల ద్వారా మార్కెట్ కల్పించి నష్టాల నుంచి గట్టెక్కించాం. 

- నేడు అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3.80 లక్షల కోట్ల అప్పు చేసింది. జగన్ గారు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూర్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. కానీ నేడు రైతులకు, పేదలకు, రోగులకు ఎలాంటి భరోసా లేదు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా అటకెక్కిన పరిస్థితి నెలకొంది. 


- అంతా ప్ర‌చార ఆర్భాట‌మే
చంద్ర‌బాబు ప్రతి నెల పింఛన్ల పంపిణీ పేరుతో జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. పీ4 ద్వారా ఎంత మంది పేదలకు మేలు చేశారో చెప్పగలరా? నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఎవరికి ఇచ్చారో చెప్పాలి. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో టీచర్ పోస్టులు అమ్ముకున్నారు. వైయ‌స్ జగన్ హయాంలో 1.20 లక్షల ఉద్యోగాలు పారదర్శకంగా, మెరిట్ ఆధారంగా ఇచ్చాం. 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం. మీరు చేసిన అప్పులతో ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి.

వైయ‌స్ జగన్ గారు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు నిర్మించారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను వంచించింది. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది. మద్యం ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. వైయస్ జగన్ పాలనలో రాష్ట్రం జీఎస్డీపీ, విద్య, రైతు సంక్షేమం, పరిశ్రమల రంగాల్లో అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు అన్ని రంగాలు అటకెక్కాయి. వ్యాపారులు నష్టాల్లో ఉన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది.

హైదరాబాద్‌లో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.4,500 ఉంటే అమరావతిలో రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. గ్లాస్ బిల్డింగ్‌ల పేరుతో అంచనాలు మరింత పెంచుతున్నారు. రాష్ట్రాన్ని అధోగతి వైపు తీసుకెళ్తున్నారు. ఇళ్ల స్థలాలు, మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఇచ్చారా? జగనన్న కాలనీల్లో రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉంది. రంగులు మార్చి క్రెడిట్ చోరీ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్రంగా ఆక్షేపించారు.