తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ 

2 Jun, 2025 15:14 IST

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నగర పంచాయతీ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయ్యింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ మండిప‌డ్డారు. గతవారం ఉద్రిక్తత మధ్య వాయిదా పడిన తిరువూరు నగర పంచాయతీ చైర్‌పర్స‌న్‌ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. ఈ స‌మ‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ నేత‌లు ప్రలోభాలు , కుట్రలతో మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్ స్థానాన్ని దక్కించుకున్నార‌ని స్వామిదాస్ విమ‌ర్శించారు.  ఫ్యాన్ గుర్తు పై గెలిచిన ఏడుగురు వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లను టిడిపి కొనేసిందని ధ్వ‌జ‌మెత్తారు. సంతలో పశువుల మాదిరి మా పార్టీ కౌన్సిలర్లను కొన్నార‌న్నారు. తొమ్మిది మంది కౌన్సిలర్లు అమ్ముడుపోకుండా వైయ‌స్ఆర్‌సీపీకి అండగా ఉన్నార‌ని అభినందించారు. తిరువూరు మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌ ఎన్నికల్లో నైతిక విజయం వైయ‌స్ఆర్‌సీపీదే అన్నారు. ఏప్రిల్ 19, 20వ తేదీల్లో జరగాల్సిన ఎన్నికను ఎమ్మెల్యే  గూండాగిరి చేసి వాయిదా వేయించార‌న్నారు. మద్యం పోయించి , గంజాయి బ్యాచ్ ను తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకున్నార‌ని ఫైర్ అయ్యారు. కక్షపూరిత ఆలోచనలతో కూట‌మి నేత‌లు రాజ్య‌మేలుతున్నార‌ని, 
జనసేన పార్టీ నేతలు రౌడీల్లా తిరుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడ‌ని మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ప్ర‌శ్నించారు.