డూప్లికేట్ ఓట్లపై వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల కమిషన్
తాడేపల్లి: డూప్లికేట్ ఓట్లపై వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమీషన్ సీరియస్ గా స్పందించింది. తప్పుడు సమాచారంతో ఓటర్ నమోదుకు ప్రయత్నించే దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 ప్రకారం వారికి శిక్షలు ఉంటాయని వెల్లడించింది. ఇదే విషయాన్ని రాష్ర్టంలోని అన్ని రాజకీయపార్టీలకు సైతం తెలియచేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులందరికి ఆదేశాలు జారీచేసింది. వాటిలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17,18 ప్రకారం ఒక ఓటర్ ఒకచోట మాత్రమే ఎన్ రోల్ అయి ఉండాలి. అలా కాకుండా ఒక చోటకు మించి వేరేచోట లేదా మరో ప్రాంతంలో ఓటర్ గా నమోదు చేసుకోవడం జరిగితే సెక్షన్ 31 ( పీపుల్స్ యాక్ట్ ) ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.కేసులు నమోదు చేస్తారు.
ఫారమ్ 6 అనేది ఫస్ట్ టైమ్ మాత్రమే ఎన్ రోల్ చేసుకునేవారు వినియోగించాలి. ఫారమ్ 6 కింద దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడా కూడా ఓటర్ గా నమోదు అయి ఉండకూడదు. అలా కాకుండా ఎవరైనా ఓటు కలిగి ఉండి కూడా ఫారమ్ 6 కింద ఎన్ రోల్ చేసుకుంటే సెక్షన్ 31 ప్రకారం శిక్షించడం జరుగుతుంది.
ఫారం 8 కింద దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి తగు విధంగా విచారణ చేయాలని బూత్ లెవల్ ఆఫీసర్ లకు ఖచ్చితంగా కొన్ని అంశాలకు విచారణ చేసి తీరాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీచేసింది. వాటిలో సంబంధిత వ్యక్తి ఓటర్ ఐడిని ఎన్నికల కమీషన్ వెబ్ సైట్ లో చెక్ చేయాలి. అలా ఎక్కడైనా వారి పేరు వెబ్ సైట్ లో ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని ఆ దరఖాస్తుదారుని అప్లికేషన్ పై కామెంట్ గా రాయాలి.ఫీల్డ్ వెరిఫికేషన్ లో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి.
వీటికి సంబంధించి బూత్ లెవల్ ఏజంట్లనుంచి గాని ఇతరులనుంచి సందేహాలు,అభ్యంతరాలు ఉంటే బూత్ లెవల్ ఆఫీసర్లు నమోదు చేసుకోవాలి.
వీటన్నిటిని అంటే డాక్యుమెంట్స్,ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు బిఎల్ ఓలు బిఎల్ ఏల రిమార్క్స్ ను పొందుపరిచిన అనంతరమే ఈ ఆర్ ఓ లు ఆ దరఖాస్తులకు సంబంధించి తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఏ దరఖాస్తుదారుడైనా తప్పుడు ధృవీకరణ,తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే వారిపై ఈ ఆర్ ఓ కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా తగుచర్యలు తీసుకుంటారు.