రక్తతర్పణలపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిస్మస్ సందర్భంగా తిరుపతిలో చేసిన వ్యాఖ్యల్ని వైయస్ఆర్‌సీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ఈ ప్రపంచంలో తన లాంటి శాంతికాముకుడు ఎక్కడా లేనట్లుగా, గురివిందగింజ తరహాలో చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రిగా రౌడీయిజాన్ని, హత్యా రాజకీయాల్ని అణచివేస్తానని చంద్రబాబు ప్రజలకు చెప్పుకోవచ్చు, కానీ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ చండాలపు పనులే అన్నారు. రౌడీయిజం గురించి చెప్పినా, హత్యా రాజకీయాలకు గురించి మాట్లాడినా, విలువల రాజకీయాల గురించి చెప్పుకున్నా, ఆయన రాజకీయ ప్రయాణం మొత్తం వంచనలతో, కుటిల రాజకీయాలతో, కుళ్లు పట్టిపోయి, ఒళ్లంతా గాయాలపాలై ఉందని ఆయనే చెప్పుకున్నారని తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థులు ఏం చేసినా తప్పు, తాను ఏం చేసినా ఒప్పు అన్నట్లు ఆయన వ్యవహారశైలి ఉందని సుధాకర్ బాబు తెలిపారు. సుధాకర్ బాబు ప్రెస్ మీట్ లో ఇంకా ఏమన్నారంటే...
● దేశ చరిత్రలో అత్యంత ప్రజాబలం జగన్ సొంతం
రాష్ట్రంలో రెండు, మూడు దినపత్రికలు, మూడు-నాలుగు టీవీలు చంద్రబాబుకు బాకా ఊదే కార్యక్రమమే చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక్క అంశం కూడా మాట్లాడరు. అందుకే జగన్మోహన్ రెడ్డి మా లాంటి వారికి నిజం ప్రజలకు చెప్పాలని సందేశం ఇచ్చారు. ఆ నిజం చెప్పేటప్పుడు సాక్ష్యం కూడా ఉండాలి. హైందవ సంప్రదాయంలో అమ్మవారికి బలులు ఇవ్వడం సహజమే. అమ్మవారికి మొక్కుకున్నప్పుడు, లేదా జాతరలలో లేదా అమ్మవారి మీద ఉన్న ప్రేమను అత్యధికంగా ప్రదర్శించడానికి, మొక్కులు తీర్చుకోవడానికి బలార్పణలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఎంచుకునే మార్గాలు ఈ బలిదానాలు. రాష్ట్రంలో జగన్ అభిమానులు రకరకాలుగా ఉంటారు, రాజకీయంగా, వ్యక్తిగతంగా, సిద్ధాంతపరంగా అభిమానించే ఉండే వాళ్లతో పాటు ఏ పార్టీకీ సంబంధం లేకుండా ఆయన ఏం చేసినా అభిమానించే వారు ఉంటారు. ఆయన కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. ఆయన ఏం చేసినా అభిమానించేవారు, ఆయన కోసం ఏ త్యాగానికైనా సిద్దపడే వాళ్లు ఉన్నారు. భారత దేశ రాజకీయ చరిత్రలో ఏ సినీ నటుడికీ కూడా లేనంత ప్రజాబలం జగన్ మోహన్ రెడ్డి సొంతం. ఇది ఒక రోజుతోనో, ఒక సంఘటనతోనో, ఒక రాజకీయ చరిత్రతోనో వచ్చింది కాదు. రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా మొదలుపెట్టిన రాజకీయ ప్రయాణం అంచలంచెలుగా జగన్మోహన్ రెడ్డి అనే మహా నాయకుడిగా ఉద్భవించిన సందర్భం.
● జగన్ పై అభిమానంతోనే రక్తాభిషేకాలు
తన నాయకుడి పుట్టినరోజు తన అభిమానాన్ని తన నాయకుడికి ప్రదర్శించడానికి ఆ అభిమాని ఎంచుకున్న మార్గం రక్తాభిషేకం. దాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఇదేంటి, ఓ పుట్టినరోజున రక్తార్పణలు, బలులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కానీ ఆయన పుట్టినరోజున అభిమానులు ఇచ్చిన బలి అర్పణలు ఏంటో చూడాలి. (చంద్రబాబు, బాలకృష్ణ పుట్టినరోజుల సందర్భంగా రాష్ట్రంలో చేసిన రక్త తర్పణల వీడియోలు వ్రదర్శించారు) మేం ఏ రోజూ ఇలాంటి చర్యల్ని ఉన్మాదం కింద ఏరోజూ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏం చేసినా చంద్రబాబుకు ఎందుకో తప్పుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు, సోషల్ మీడియా మీద జరుగుతున్న దాడులు. కేవలం చేతకాని ప్రభుత్వాన్ని జాకీలు వేసి లేపే కార్యక్రమం కనిపిస్తోంది.
● జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే ఒప్పు
చంద్రబాబు తాను చేయాల్సిన కార్యక్రమాల్ని పూర్తిగా తుంగలో తొక్కి, రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా గతంలో జగన్మోహన్ రెడ్డి పాస్టర్లందరికీ ఆర్ధిక సహాయం చేశారు. దాన్ని అప్పట్లో చంద్రబాబు తప్పుబట్టారు. ఇవాళ పరమత సహనం పాటించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవుల్ని అవమానించేలా వేడుకలు జరిపించారు. ఎవరికి భయపడుతున్నారో, ఎందుకు భయపడుతున్నారో ముఖ్యమంత్రికి తెలియదు. మతం పేరుతో, కులం పేరుతో విభజన రాజకీయాలు చేయాలనుకునే కుట్ర రాజకీయ నాయకుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తికి మా నాయకుడి గురించి మాట్లాడే హక్కు లేదు. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఏ రోజూ హత్యా రాజకీయాలు ప్రోత్సహించారా ? రక్తపాత రాజకీయాలు ప్రోత్సహించారా, బలి అర్పణలు అడిగారా ? శాంతికాముడికిగా సమాజంలోని అణగారిన వర్గాలకు పరిపూర్ణ విద్య, వైద్యం, న్యాయం అందించాలని, ప్రతీ ఒక్కరికీ హక్కులు అందించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చిన ఘనులు మీరు. మీకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు, అందుకే కుడివైపున పవన్ కళ్యాణ్, ఎడమవైపున బీజేపీ. పోనీ ఎవరూ లేకుండా ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఉందా?, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున రాష్ట్రం నుంచి విదేశాల వరకూ ఎంత అభిమానం చూపించారో చూశాం. మా పార్టీ క్యాడర్ కు ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఆనవాయితీ అయితే, ఇవాళ వ్యాపారస్తులు, మహిళలు రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కాల్చారు, జై జగన్ నినాదాలతో మార్మోగించి పది కాలాలు జగన్ చల్లగా ఉండాలని దీవించారు. చంద్రబాబు అయినా, ఆయన కుమారుడు లోకేష్ అయినా అలా ఉండాలి.
● ప్రతిపక్ష నేతపై ఈనాడు విషపురాతలు
ఇవాళ మీ జేబు సంస్ధ అయిన ఈనాడు రాతల్ని ఎలా చూడాలి?, ప్రజాబలంతో ముఖ్యమంత్రి అయి, అవకాశం ఉన్నంతవరకూ ప్రజలకు మేలు చేసి, ఇవాళ మాజీ ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న ప్రతిపక్ష నాయకుడి మీద ఈనాడు విషపు రాతలు రాస్తోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు వద్దు ప్రభుత్వ కాలేజీలే ముద్దు అంటూ కోటి సంతకాలు వచ్చినా మీకు సిగ్గు రాలేదు. పైత్యం దిగలేదు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఉంటుందా ఈ ప్రపంచంలో. ప్రజల పక్షాన పోరాడే నాయకుడు ఓవైపు ఉంటే మీ రాతలు పతాక స్ధాయికి చేరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే మనకు ఆస్తులు పెరుగుతాయి, పది స్టూడియోలు పెట్టుకోవచ్చు, విదేశాల్లో ఆస్తులు సంపాదించుకోవచ్చు, స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచిపెట్టుకోవచ్చని అనుకుంటున్నారు. అయినా తృప్తిలేదు.. అణగారిన వర్గాలకు మేలు చేసే ముఖ్యమంత్రిగా తాను పరిపాలించిన రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన రాజశేఖర్ రెడ్డి కుమారుడి గురించి ఒక్క మంచి వార్త మీరు రాశారా ?, నువ్వు దిగిపో, చంద్రబాబు నాయుడు ఎక్కాలి, ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి.
● రాజకీయ పార్టీగా మారిన ఈనాడును బహిష్కరిస్తున్నాం
ఈనాడు దినపత్రికలో ఓ వ్యాసకర్త ఇలా రాసి ఉంటే మాకు బాధ కలిగేది కాదు. ఎందుకంటే వారు రాజకీయ నాయకులు, వారిని మేం రాజకీయంగా ఎదుర్కొంటాం. కానీ ఈనాడు స్వయంగా రాజకీయపక్షంగా మారిపోయింది. ఇది ఈనాడు కాదు, ఇది తెలుగుదేశం నాడు. ఈనాడు దినపత్రిక చంద్రబాబు నాయుడు జేబు సంస్ధ. అందుకే జగన్ ప్రేమికులకు ఈనాడును బహిష్కరిద్దామని పిలుపునిస్తున్నాం. చంద్రబాబు రాత్రి చెప్పింది పగలు పేపర్ లో రాస్తారు, చంద్రబాబు తప్పులన్నీ ఒప్పులుగా రాస్తారు, రాష్ట్రంలో 80 శాత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదలు అత్యధికమంది ఉచితంగా వైద్యం పొందే వైద్యశాలల్ని చంద్రబాబు కుటిలరాజకీయాలతో ప్రైవేటీకరణ చేస్తుంటే ఈనాడు పత్రిక వంతపాడుతోంది కాబట్టి బహిష్కరించి తీరాల్సిందే. పీపీపీ విధానం వద్దని మేం అంటుంటే, ఈనాడు ఆ విధానం కావాలంటోంది. చంద్రబాబు ఓ రాజకీయ నాయకుడు, ఆయనకు ఓ రాజకీయ పార్టీ ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మాకు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అతను అనడంలో తప్పులేదు. కానీ ఈనాడు న్యూట్రల్ జర్నలిజం పేరుతో వేసుకున్న ముసుగు తీసేసింది. ఈనాడు ఈ రోజువరకూ న్యూట్రల్ జర్నలిజం పేరుతో, నైతిక విలువల పేరుతో చేసిన డ్రామాల్ని ఇవాళ నిస్సిగ్గుగా రాజకీయపక్షంగా మారిపోయింది. చంద్రబాబు, బీజేపీ, జనసేన తరహాలో ఈనాడు కూడా పత్రిక కాకుండా రాజకీయ పార్టీగా మారింది. ఈనాడులో రాసే వార్తలన్నీ రాజకీయ వార్తలే. అవన్నీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమే. ఈనాడు సిద్ధాంతాలకు వ్యతిరేకం. తెలుగుదేశం పత్రిక అయిన ఈనాడును చీల్చి, కాల్చి, నా ఉక్రోషం చెప్పుకోవడానికి ఏమాత్రం వెనుకంజ వేయట్లేదు.
● అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానాలిస్తూ టీజేఆర్ సుధాకర్ బాబు ..
రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు విని బిడ్లు వేస్తారో తాను ముఖ్యమంత్రి కాకనే వాటిని రద్దు చేస్తాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను, అది ప్రజలకు సంబంధించి ఆస్తి అని చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. దానికి భయపడి ఆగారా, వీళ్లు కమిషన్లు ఎక్కువ అడిగితే ఆగిపోయారా, ఎందుకు బిడ్లు వేయలేదో మాకు తెలియదు. ఇంత భారీ మెజార్టీ వచ్చిన టీడీపీ తీసుకున్న ఓ విధానానికి మద్దతుగా బిడ్లు పడలేదు. అవి ఎందుకు పడలేదో వాళ్లు ఆలోచించుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి విజయం, సమాజ విజయం, కోటి సంతకాలు సేకరించిన వారి విజయం.