కులాల మధ్య చిచ్చు పెట్టడమే కూటమి సర్కార్ లక్ష్యం
తాడేపల్లి: రాష్ట్రంలో బీసీ కులాల మధ్య చిచ్చురగిలించి, రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐక్యంగా ఉండే గీతకులాల మధ్య అశాంతిని రగిలించేందుకు జీఓ 16ను అమలు చేస్తానంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ విద్వేషాలను రగిలించేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దానిని డైవర్ట్ చేసేందుకు వైయస్ఆర్‌సీపీ గతంలో జారీ చేసిన మెమోపై మాట్లాడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాము చేసిన తప్పును సరిచేసుకునేందుకు తాజాగా జీఓ నెం.6ను జారీ చేయడం నిజం కాదా అని నిలదీశారు. గీతకులాల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
చంద్రబాబు హయాంలోనే వివాదాస్పద జీఓ జారీ
ఆనాడు సర్ధార్ గౌతు లచ్చన్న గీతకులాల ఐక్యతన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ప్రకారం కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కోరారు. ఆ మేరకు చంద్రబాబు ప్రభుత్వం 19.06.1997 లో జీవో నెంబరు 16ని జారీ చేసింది. తరువాత శెట్టబలిజ సామాజికవర్గం చేసిన ఆందోళనలతో ఈ జీఓ అమలు నిలిచిపోయింది. గత జూన్ నెలలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒక టీవీ చానెల్ ఇంటర్వూలో మాట్లాడుతూ గీతకులాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీఓ 16ను అమలు చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. తరువాత గత రెండు నెలల కాలంగా విద్యార్ధులకు కూటమి ప్రభుత్వం జారీ చేస్తున్న కులధ్రువీకరణ పత్రాల్లో మార్పులు మొదలయ్యాయి. శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆతర్వాత ఆయా కులాల పేర్లను బ్రాకెట్ లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అంటూ జారీ చేస్తోంది. దీనిపై శెట్టిబలిజ సామాజికవర్గంలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై మంత్రి సుభాష్ స్పందిస్తూ ఇది సాంకేతికపరమైన ఇబ్బంది, త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామన్నారు. కొద్ది రోజుల తర్వాత సాంఘిక సంక్షేమశాఖ మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని మరోమాట చెప్పారు. ఆ తరువాత మంత్రి నారా లోకేష్, మంత్రి పవన్ కళ్యాణ్‌లకు కూడా ఈ విషయాన్ని వివరించానంటూ మంత్రి సుభాష్ మాట్లాడారు. మొత్తం వ్యవహారం అడ్డం తిరగడంతో ఒక్కసారిగా మంత్రి సుభాష్ తన వైఖరిని మార్చి, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జారీ చేసిన మెమో వల్ల శెట్టిబలిజ కులం ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని, తాను దానిని అడ్డుకున్నానంటూ ఒక డైవర్షన్ పాలిటిక్స్‌ను తెర మీదికి తీసుకువచ్చారు. 23.2.2023న వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం గీతకులాలకు జారీ చేసే కులధ్రువీకరణ పత్రాలకు సంబంధించి మెమో జారీ చేసింది. ఆ తరువాత వచ్చిన అభ్యంతరాలతో ఆ మెమెను అమలు చేయకుండా నిలిపివేయడం జరిగింది. తరువాత ఏరియా రిస్ట్రిక్షన్‌ను రిమూవ్ చేస్తూ 10.11.2023 లో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం జీఓ 25ని జారీ చేసింది. గ్రేటర్ రాయలసీమ జిల్లాలను మినహాయిస్తూ రాష్ట్రంలో శెట్టిబలిజలు ఎక్కడ ఉన్నా వారు అదే కులం పేరుతో సర్టిఫికేట్లు పొందవచ్చని, వారి కులానికి ముందు గౌడ అని ఎక్కడ పేర్కొనరంటూ ఆ జీఓలో స్పష్టం చేయడం జరిగింది. అలాంటప్పుడు దానికంటే ముందు ఇచ్చిన మెమో అమలులో ఉంటుందా? మంత్రిగా ఉన్న సుభాష్ కు కనీసం దీనిపై అవగాహన కూడా లేకుండా ఎలా మాట్లాడతారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ప్రకారం కులధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే గీతకులాల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీసేలా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలతో తిరిగి చిచ్చు రగిలించారు.