అక్రమ కేసులు పెట్టిన వారిని భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు
నెల్లూరు జిల్లా: వైయస్ఆర్‌సీపీ మాచర్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై నమోదు చేసిన అక్రమ కేసులకు భవిష్యత్తులో తప్పనిసరిగా చట్టపరమైన బదులు చర్యలు ఉంటాయని పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి సంబంధం లేని కేసులో కావాలని కక్షసాధింపు చర్యలతో పిన్నెల్లి సోదరులను ఇరికించడం ఘోర అన్యాయమన్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, పార్టీ కార్యకర్తలకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగాయని అప్పటి పల్నాడు జిల్లా ఎస్పీ కంచేటి శ్రీనివాసరావు స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి వీడియోలు విడుదల చేశారని గుర్తు చేశారు. ఆ వాస్తవాలను పక్కనపెట్టి, కేవలం వైఎస్ఆర్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిలపై అక్రమ కేసులు పెట్టడం రాజకీయ కక్షసాధింపుకే నిదర్శనమన్నారు.
లోకేష్ ప్రస్తావిస్తున్న “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు. ఈరోజు ఇబ్బందులు పెడుతున్న వారు భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. అక్రమ కేసులకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఏ పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసులు నమోదు చేశారో అదే పోలీస్ స్టేషన్‌లో బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని, ఈసారి మాత్రం ఎవరినీ వదిలిపెట్టే కార్యక్రమం ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి త్వరగా బయటకు రావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని, ప్రతి గ్రామంలో కొవ్వొత్తుల నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించి, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న నాయకుల తరఫున ప్రజా కోర్టులోనే పోరాటం చేస్తామని వెల్లడించారు. చివరగా, ఈ కేసులో పిన్నెల్లి సోదరులు పూర్తిగా నిర్దోషులుగా బయటకు వస్తారని, ప్రజల మద్దతుతో ఈ అన్యాయాన్ని తిప్పికొడతామని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.