వైయస్ జగన్ సర్వేకు చంద్రబాబు రంగులు

9 Jun, 2026 09:07 IST

భీమవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. గతంలో వైయస్.జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన సమగ్ర భూ సర్వే క్రెడిట్‌ను దొంగిలించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి నిధులు ఇస్తారని, సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకుంటారని ఆశించిన ప్రజలకు చంద్రబాబు జిల్లా పర్యనటనలో  ఆరోగ్య పాఠాలు చెప్పి మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన తీవ్ర నిరాశను కలిగించింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే క్రెడిట్‌ను దొంగిలించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

-  పుస్తకం 'జగన్'ది.. రంగు 'చంద్రబాబు'ది!

భారతదేశంలో 100 ఏళ్ల తర్వాత భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా వైయస్ జగన్ సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. నాడు 'ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్' తెచ్చి, సచివాలయ సిబ్బందితో పక్కాగా సర్వే చేయిస్తే.. నాటి కూటమి నేతలు భూములు లాక్కుంటున్నారంటూ దుష్ప్రచారం చేశారు. వైయస్. జగన్ చేసిన ఆ అద్భుతమైన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ. 400 కోట్ల ప్రోత్సాహకం కూడా ఇచ్చింది. నాడు రైతులకు క్యూ ఆర్ కోడ్, జియో ట్యాగింగ్, యూనిక్ ఐడీలతో డిజిటల్ పాస్ పుస్తకాలు సిద్ధం చేస్తే.. నేడు చంద్రబాబు కేవలం జగన్ ఫోటోలు తుడిపేసి, రంగులు మార్చి తన ఖాతాలో వేసుకోవాలని చూడడం విడ్డూరంగా ఉంది. 

- ఆక్వా రైతులకు తీవ్ర అన్యాయం - ఫిషరీస్ యూనివర్సిటీ పనులు నిలిపివేత:

    జిల్లాకు గుండెకాయ లాంటి ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఆక్వా రైతుల కోసం జగన్ హయాంలో 2021లో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 'అంతర్జాతీయ ఫిషరీస్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక దానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా పనులన్నీ ఆపేశారు. రైతుల కష్టాలు తీర్చాల్సింది పోయి "యోగా చేయండి, అన్నం తినొద్దు, ప్రోటీన్ తినండి" అంటూ చంద్రబాబు సుద్దులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 

- రైతుల పాలిట శాపంగా మారిన టీడీపీ నాటి '22A':

గత టీడీపీ హయాంలో తీసుకొచ్చిన '22A' విధానం వల్ల ప్రైవేటు ఆస్తులను కూడా తప్పుడు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములుగా మార్చారు. దీనివల్ల నేటికీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాడు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ, నేడు రికార్డులు తారుమారయ్యాయంటూ కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నారు. 

- గతంలో మోడీ మట్టి.. ఇప్పుడు బాబు మొండిచేయి

    గతంలో అమరావతి పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ ఏపీకి మట్టి, నీళ్లు ఇచ్చినట్లే.. నేడు పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన చంద్రబాబు కూడా జిల్లా ప్రజలకు కేవలం సుద్దులు చెప్పి మొండిచేయి చూపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పక్కన పెట్టేసి, సాగు, తాగునీటి ఇబ్బందులను పట్టించుకోకుండా కేవలం వైయస్ జగన్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. 

చంద్రబాబు నాయుడు ఎన్ని రంగులు మార్చినా, సర్వే రాళ్లపై పేర్లు చెరిపేసినా.. భూ సర్వే విషయంలో వైయస్ . జగన్ చేసిన చారిత్రాత్మక మేలును, ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఎప్పటికీ మరువరని ముదునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు. జిల్లా ప్రయోజనాలను గాలికొదిలేసి, ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, కేవలం వైయస్ జగన్‌పై బురదజల్లడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా కక్షసాధింపు రాజకీయాలు పక్కన పెట్టి, జిల్లాలో నిలిచిపోయిన అంతర్జాతీయ ఫిషరీస్ యూనివర్సిటీ పనులను తక్షణమే ప్రారంభించాలని, ఆక్వా రైతులను ఆదుకోవాలని, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని" వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ప్రసాదరాజు డిమాండ్ చేశారు.