సంక్షేమ హాస్టల్లో ఒక్క రాత్రి నిద్రపోయే దమ్ముందా బాబూ?
అనంతపురం: విశాలమైన మీ భవంతుల్లో కాదు, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఒక్క రాత్రి నిద్రపోయే దమ్ముందా అని సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు వైయస్ఆర్ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర సవాల్ విసిరారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట వైయస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట ట్రంకు పెట్టెలు, ఖాళీ ప్లేట్లతో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవిన్యూ అధికారి( డీ ఆర్ ఓ ) మలోలకు వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి చంద్ర మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. వీటిల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. గత ఏడాది నుంచి సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్స్ ఛార్జీలను ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి కూడా పెంచలేదని దుయ్య బట్టారు. బయట ధరలు 200 శాతం పెరిగితే విద్యార్థుల డైట్ ఛార్జీలు మాత్రం ఒక్క శాతం కూడా పెంచలేదని విమర్శించారు.
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు రూ.850 నుంచి రూ,1400కు, కళాశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు రూ.1200 నుంచి రూ.1600కు వైయస్ జగన్ పెంచారన్నారు. కాస్మొటిక్ ఛార్జీల కింద గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.75 మాత్రమే చెల్లించగా, వైయస్ జగన్ అధికారంలోకి రాగానే దాన్ని రూ.170కి పెంచారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం రావడం, ఆ విద్యార్థులకు శాపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హాస్టల్ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మంత్రులు తమ పిల్లల్ని వసతి గృహల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు హాస్టళ్లలో ఎదుర్కొంటున్న అవస్థలు తెలుస్తాయన్నారు. ఏ ఒక్క సంక్షేమ వసతి గృహంలోనూ పిల్లలకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయడం లేదు.
మరోవైపు వసతి గృహాల్లో బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్ల నిర్వహణ పూర్దిగా గాలికొదిలేయడంతో, అవి అధ్వాన్నంగా మారాయని ధ్వజ మెత్తారు. దోమ తెరలు, చాపలు, పెట్టెలు, దుప్పట్లు, గ్లాసులు ఇంకా విద్యార్థులకు పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదని తెలిపారు. పారిశుద్ధ్యం లోపించి, విద్యార్థుల ఆరోగ్యం దెబ్బ తింటున్నా కుడా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రహరీ గోడలు లేక విద్యార్థులు ముఖ్యంగా అమ్మాయిలకు రక్షణ కొరవడిందన్నారు. హాస్టళ్ళ నిర్వహణకు రూ.143 కోట్లు కేటాయించామని సాంఘిక సంక్షేమ మంత్రి డోలా వీరాంజనేయులు ప్రకటించారు. కానీ ఆ నిధుల మంజూరు, విడుదల జరిగిందా? ఆ నిధులు ఇస్తే ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాల్లో ఎక్కడా నూతన హాస్టల్ భవనాల నిర్మాణం జరగలేదని స్పష్టం చేశారు.
వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సన్నబియ్యం పేరుతో పాలిష్ పట్టిన బియ్యాన్ని, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో హాస్టళ్లకు రోజువారీ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని కచ్చితంగా అందించేవారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా, ఏ మెనూను అమలు చేయడం లేదన్నారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు, రుచి లేని కూరలతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. అది తినలేక చాలా మంది విద్యార్థులు కడుపు మాడ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు 27 రకాల వస్తువులు ఇవ్వాలి. కానీ అది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం అందించిన స్కూల్ బ్యాగ్‌లు నెలన్నర గడవక ముందే చిరిగిపోయాయి. నోట్ పుస్తకాలు నాణ్యత లేవు. ప్రభుత్వానికి ఎంతసేపూ ప్రచారయావ తప్ప, వాస్తవ పనులపై ఎక్కడా శ్రద్ధ కనిపించడం లేదు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బాల, బాలికల వసతి గృహాలు, డా. బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కేజీబీవీ గురుకులాల విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తోంది. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎండీ. సుల్తాన్, వంశీ యాదవ్, జిల్లా నియోజకవర్గం అధ్యక్షులు కైలాష్, కాశీ మనోజ్, సాకే. పురుషోత్తం, జిల్లా ఉపాధ్యక్షులు మంజునాధ్ రెడ్డి, వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నిశాంత్ రెడ్డి, అశోక్, హరినాధ్ రెడ్డి, మహేష్ నాయక్, అశోక్ కుమార్, నగర విద్యార్ధి నాయకులు ఆంజన్ రెడ్డి,ఫయాజ్,రాహుల్ రెడ్డి, రఫీ,విజయ్, కుమార్, నరేంద్ర, లోకేష్, నాయకులు నాగేంద్ర, అనిల్, మని, సాయి,కేశవ, అంజి,కేశవ,ఆదిల్, గౌతమ్ సాయి, అరవింద్ యాదవ్, గౌస్, జిలాన్, శివ, సాయి, నరేంద్ర రెడ్డి, వంశీ నాయుడు తదితరులు పాల్గొన్నారు