కుట్టు మిషన్ల కుంభ‌కోణంపై విచార‌ణ చేప‌ట్టాలి

6 May, 2025 16:25 IST

అనంత‌పురం: కుట్టు మిషన్ల పంపిణీ, శిక్షణ కోసం నిర్ధేశించిన స్కీంలో జ‌రిగిన‌ అవినీతిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం అనంత‌పురం జిల్లా అధ్య‌క్షురాలు వ‌ర‌ల‌క్ష్మి డిమాండ్ చేశారు. పార్టీ మహిళ విభాగం ,  బీసీ విభాగం నాయకులు  ఆధ్వ‌ర్యంలో కుట్టు మిషన్ ల స్కామ్ కు సంబంధించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా వ‌ర‌ల‌క్ష్మి మాట్లాడుతూ.. బీసీ మహిళలకు పంపిణీ చేస్తున్న కుట్టుమిషన్లలో రూ.230 కోట్లకు టెండర్ పిలిచార‌ని, ఒరిజినల్ ఖర్చు రూ.73 కోట్ల మాత్ర‌మే అవుతుంద‌న్నారు. 167 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పొయాయ‌ని ఆమె ప్ర‌శ్నించారు.  బీసీ మహిళల అభ్యున్నతికి తోడ్పడాల్సిన కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్లలో అవినీతి పాల్పటం సిగ్గుచేటని విమ‌ర్శించారు. ఈ కుంభ‌కోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గుంత‌క‌ల్ తహశీల్దార్  కార్యాలయం వద్ద  మ‌హిళ‌లు ఆందోళ‌న చేప‌ట్టి విన‌తిప‌త్రం అంద‌జేశారు.