తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

11 Dec, 2020 14:10 IST

సచివాలయం: వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష పథకం ప్రతిష్టాత్మక పథకం అని, గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఈ బృహత్తర కార్యక్రమంతో పరిష్కారం అవుతాయని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. దేశంలో ఎప్పుడూ, ఎక్కడా ఇంత పెద్దస్థాయిలో సర్వే జరగలేదన్నారు. వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం ద్వారా గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందన్నారు. భూ యజమానులకు న్యాయమైన, చట్టబద్ధమైన శాశ్వత హక్కులు లభిస్తాయని, ముందుతరాలకు సైతం మంచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈనెల 21వ తేదీన సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుడతారన్నారు. మూడు విడతల్లో భూ సర్వే చేపట్టాలని, 2023 జూలై నాటికి పూర్తి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 

సచివాలయంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 నెలల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 90 శాతానికి పైగా సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేశారని చెప్పారు. అత్యంత ప్రాధాన్యత అంశాలుగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను గుర్తించాలని, ఆ దిశగానే రైతు సమస్యలు, భూవివాదాలు పరిష్కరించాలనే లక్ష్యంతో సమగ్ర భూరీసర్వే చట్టాన్ని సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చారని వివరించారు. వివాదరహిత పాలన తెచ్చేందుకు సమగ్ర భూసర్వే పథకం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామన్నారు. తరాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. 

వైయస్‌ఆర్‌ జగనన్న భూహక్కు – భూ రక్ష పథకం మూడు విడతల్లో చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు. ఇప్పటికే ట్రైనింగ్‌ కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో సర్వే చేపడుతున్నామన్నారు. సుమారు 1.26 లక్షల చదరపు కిలోమీటర్లు సర్వే చేయడం జరుగుతుందని చెప్పారు. మొదటి విడతలో 5 వేల గ్రామాలు, రెండో విడతలో 6,500 గ్రామాలు, మూడో విడతలో 6,000 గ్రామాలుగా విభజించే సర్వే పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. సమగ్ర భూసర్వే ద్వారా ప్రజలకు మేలు చేకూరుతుందని భావిస్తున్నామన్నారు.