బీసీల పేరుతో రూ. 245 కోట్ల భారీ స్కామ్
శ్రీ సత్యసాయి జిల్లా: బీసీల పేరుతో రూ. 245 కోట్ల భారీ స్కామ్‌కు కూటమి ప్రభుత్వం తెర లేపిందని వైయస్ఆర్‌సీపీ హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్త దీపిక విమర్శించారు. కుట్టు మిషన్ల పేరుతో చేస్తున్న దోపిడీపై విచారణ చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం హిందూపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దీపిక గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ, ట్రైనింగ్ పేరుతో రూ.160 కోట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత దోచేస్తున్నారని మండిపడ్డారు. రూ. 4,300 విలువ చేసే కుట్టు మిషన్ , ట్రైనింగ్ పేరుతో మరో మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,000 ఖర్చు అంటూ అంచనాలు పెంచి దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంపద సృష్టించడం లేదని, ప్రజా సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆక్షేపించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మధుమతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.