సువార్తికుల వాహనంపై దాడి ఘటనలో దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి
అనంతపురం: ఈనెల 04న అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలం, కొర్రకొడు గ్రామంలో సువార్త ప్రకటించేందుకు వెళ్లిన చర్చి పెద్దలు, సువార్తికుల వాహనంపై దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అనంతపురం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై స్పందించిన వైయస్ఆర్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ హక్కులున్నాయని గుర్తు చేశారు. శాంతియుతంగా సువార్త ప్రకటించడానికి వెళ్లిన వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇటువంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ముస్లిం మైనార్టీ వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు సైఫుల్ల బేగ్, డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాజా, యూత్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ దాదు, కోఆప్షన్ మెంబర్ శమ్ము, సోషల్ మీడియా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ శామీర్, జిల్లా మైనార్టీ సెక్రటరీ మాసూద్, సిటీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ అబ్బాస్ వలి, సిటీ జనరల్ సెక్రటరీ కేఎం బాషా, గుల్జార్‌పేట్ దాదు తదితరులు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మతసామరస్యం, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య హక్కులకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దోషులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మీడియా సమావేశం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జానీ, చిలకల థామస్ రాజ్ కుమార్, జిల్లా అధ్యక్షులు వైపి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, జిల్లా కార్యదర్శి పుట్లూరు ప్రభాకర్, నగర అధ్యక్షుడు సతీష్, అనంతపురం గాస్పల్ హాల్ సంఘ పెద్దలు ఆదినారాయణ, దేవవరం, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నూకల కమల్ పాల్గొన్నారు.