రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం

24 Mar, 2025 14:43 IST

అనంతపురం జిల్లా:  రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంద‌ని అనంత‌పురం వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా నాయ‌కుడు ఆలూరు సాంబ శివారెడ్డి మండిప‌డ్డారు. జిల్లాలోని యల్లనూరు మండలం నీర్జాంపల్లి గ్రామానికి చెందిన రైతులు వెంగప్ప, లక్ష్మీనారాయణ కొతకొచ్చిన పంట అకాల వర్షానికి నేల‌రాల‌డంతో మ‌న‌స్తాపానికి గురై ఈ నెల 23న  ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆలూరు సాంబ శివారెడ్డి అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులను సోమ‌వారం పరామర్శించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఆలూరు సాంబ‌శివారెడ్డి ఏమ‌న్నారంటే.. 
`వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో రైతుల‌ను అన్ని విధాల ఆదుకున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకున్న పాపాన లేదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతులు లక్షలు పెట్టుబడితో 20 ఎకరాల్లో పంట వేస్తే అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట నేలమట్టం కావడంతో ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైయ‌స్ జ‌గ‌న్ పాలనలో రైతులకు సచివాలయాలు, ఆర్బికేలను ఏర్పాటు చేసి రైతన్నలకు కష్టాలు వస్తే వెంటనే అధికారులు వెళ్లి ఎప్పటికప్పుడు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించి పదిరోజుల వ్యవధిలోనే పంట నష్టం పరిహారం అందించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతన్నలను ప‌ట్టించుకోవ‌డం లేదు. రైతులకు భరోసా ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. ఇప్పటికైనా చంద్ర‌బాబు ప్రభుత్వం రైతులను  ఆదుకొని నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలి` అని సాంబ‌శివారెడ్డి డిమాండ్ చేశారు.