వైయస్ఆర్సీపీ కార్పొరేటర్ దారుణ హత్య
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కాకినాడ వైయస్ఆర్సీపీ 9వ వార్డు కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. కాకినాడ వాకపూడి గానుగచెట్టు సెంటర్ వద్ద గల కార్ వాష్ షెడ్ ఎదురుగా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను చేసినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హత్యకు ముందు రమేష్ ఇదే కార్ వాష్ షెడ్ లో మిత్రులతో కలసి మద్యం సేవించారు. అనంతరం ఇళ్లకు కార్లపై వెళ్లే సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అతని స్నేహితుడు గురజాల చిన్నా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు చెబుతున్నాయి. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. నలుగురుపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి రమేష్ మృతదేహాన్ని తరలించారు. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రమేష్ పార్థీవదేహానికి నివాళులర్పించారు.