నేడు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్
విజయవాడ: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నేడు రాష్ట్రంలోనూ ప్రారంభమవుతోంది. విజయవాడలోని సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ఇవాళ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 11.25 గంటలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో నిర్ణయించిన మేరకు టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్ వేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్ స్టోర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఆస్పత్రిలోని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.