ద్రాక్షారామంలో శివలింగ ధ్వంసం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేప‌ట్టాలి

31 Dec, 2025 19:48 IST

అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా: ద్రాక్షారామంలో ఉన్న అతి పురాతన కపిలేశ్వర ఘట్టంలో శివలింగం ధ్వంసం అయిన ఘటనపై తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొంటూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.  దక్షిణ కాశీగా పేరుగాంచిన పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం వెనుక భాగంలో, ఉత్తర దిశగా సప్త గోదావరి నది తీరంలో ఉన్న అతి పురాతన కపిలేశ్వర ఘట్టంలో ప్రతిష్ఠితమైన శివలింగాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటన అనంతరం ఆగమశాస్త్ర నియమ నిబంధనలు పాటించకుండా హడావుడిగా సాయంత్రంలోగానే మరో శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేక అనుమానాలకు తావిస్తోందని నేతలు పేర్కొన్నారు. ఈ అంశాలపై ద్రాక్షారామంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మీడియా స‌మావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గి రెడ్డి గారు, మాజీ దేవాదాయ శాఖ మంత్రి మల్లాది విష్ణు గారు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారు, రామచంద్రపురం నియోజకవర్గం ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడారు.

వారు మాట్లాడుతూ, ఈ ఘటనపై తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టి, శివలింగ ధ్వంసానికి పాల్పడిన దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

తదనంతరం, ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ సంబంధిత వినతిపత్రాన్ని ఆర్‌డీఓ గారికి అందజేశారు. భక్తుల విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.