నేడు `జగనన్న విద్యాదీవెన` నిధులు విడుదల
తాడేపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని ఉద్దేశంతో జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారు. తల్లిదండ్రులపై భారం పడకుండా కాలేజీ ఫీజు మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. జగనన్న విద్యా దీవెన పథకం గతేడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి నేడు విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లను సీఎం వైయస్ జగన్ జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తూ వారి చదువులకు పూర్తి భరోసానిస్తోంది.
గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుంచి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద వైయస్ జగన్ ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తోంది.
జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. విద్యార్థుల చదువుల కోసం అందించే సాయాన్ని తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారికి ప్రశ్నించే హక్కును, తమ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది వైయస్ జగన్ ప్రభుత్వం.