ఒంటిమిట్ట శ్రీ సీతారాములను దర్శించుకున్న సీఎం వైయస్ జగన్
వైయస్ఆర్ జిల్లా: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కొలువుదీరిన శ్రీ సీతారాములను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఎం వైయస్ జగన్.. అక్కడి నుంచి సంప్రదాయ పంచెకట్టుతో ఒంటిమిట్ట రామాలయానికి చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తలపై శ్రీ సీతారాముల పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఎత్తుకొని.. రామాలయానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్.. స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కల్యాణోత్సవ సందర్భంగా స్వామివార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆలయ నిర్వాహకులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించి, వేద ఆశీర్వచనం అందించి, సీతారాముల చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం జరిగిన శ్రీసీతారాముల కల్యాణోత్సవంలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. సీఎం వైయస్ జగన్ వెంట తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు.